మెక్సికోలో కార్టెల్ హింస..11 మంది మృతి
- November 22, 2026
మెక్సికోలో కార్టెల్ నాయకుడి అరెస్టు తర్వాత హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. సైనిక బలగాలు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో డ్రగ్ కార్టెల్ నేత ఫౌస్టో ఇసిడ్రో మెజా ఫ్లోరెస్ అలియాస్ ‘ఎల్ చాపో ఇసిడ్రో’ పట్టుబడ్డాడు. అయితే, అతడిని అరెస్టు చేసే క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఏడుగురు అనుమానిత కార్టెల్ సాయుధులు, నలుగురు మెక్సికన్ సైనికులు ఉన్నారు.
ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ జాబితాలో నిందితుడు
మెజా ఫ్లోరెస్ మెక్సికోలోని సినాలోవా రాష్ట్రంలో శుక్రవారం రాత్రి జరిగిన ప్రత్యేక ఆపరేషన్‌లో పట్టుబడ్డాడు. అతడు ఎఫ్‌బీఐ టెన్ మోస్ట్ వాంటెడ్ ఫ్యూజిటివ్స్ జాబితాలో ఉన్నాడు. అమెరికాకు డ్రగ్స్ అక్రమ రవాణా, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండటం వంటి ఆరోపణలపై అతడి కోసం అమెరికా అధికారులు 50 లక్షల డాలర్ల రివార్డును కూడా ప్రకటించారు. మెజా ఫ్లోరెస్‌తో పాటు అతడి సంస్థలో కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులు సహా మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు మెక్సికో అధికారులు వెల్లడించారు. వారిలో సంస్థలో రెండో స్థానంలో ఉన్న వ్యక్తి, ఆర్థిక కార్యకలాపాలను చూసుకునే వ్యక్తి కూడా ఉన్నట్లు సమాచారం.
గుయాసావేలో కాల్పులు.. రోడ్ల పై బారికేడ్లు
మెజా ఫ్లోరెస్ అరెస్టు సమయంలో భద్రతా బలగాలపై అనుమానిత కార్టెల్ సభ్యులు కాల్పులు, పేలుడు పదార్థాలతో దాడికి దిగినట్లు అధికారులు తెలిపారు. దీంతో సినాలోవా రాష్ట్రంలోని గుయాసావే నగరంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పలు ప్రాంతాల్లో కాల్పులు చోటుచేసుకోగా, వాహనాలు, వ్యాపార సంస్థలకు నిప్పు పెట్టిన ఘటనలు నమోదయ్యాయి. రహదారులపై వాహనాలను అడ్డంగా పెట్టి బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి.
హింసాత్మక పరిస్థితుల కారణంగా భద్రతా బలగాలు అరెస్టు చేసిన వారిని అక్కడి నుంచి తరలించడానికి కొన్ని గంటల సమయం పట్టింది. అనంతరం మెజా ఫ్లోరెస్ సహా అదుపులోకి తీసుకున్న వారిని విమానంలో మెక్సికో సిటీకి తరలించారు. పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు సినాలోవా రాష్ట్రంలో సైన్యం, నేషనల్ గార్డ్ బలగాల మోహరింపును కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు. కార్టెల్ నాయకుడి అరెస్టు భద్రతా పరంగా కీలక పరిణామంగా భావిస్తున్నప్పటికీ, అతడి సంస్థలో ఆధిపత్య పోరు లేదా ఇతర గ్రూపుల ప్రతిస్పందనతో మరిన్ని హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- మెక్సికోలో కార్టెల్ హింస..11 మంది మృతి
- కువైట్–అమెరికా ఆర్థిక సంబంధాల బలోపేతానికి చర్చలు..!!
- వచ్చే వారం ఖతార్‌లో పొగమంచు.. వాహనదారులకు హెచ్చరిక..!!
- సౌదీలో 25.2 శాతం పెరిగిన డెలివరీ ఆర్డర్లు..!!
- బహ్రెయిన్‌లో భారీ సైబర్ మోసం..మహిళ అరెస్ట్..!!
- ఒమన్‌లో సాంస్కృతిక వారసత్వ సంపదకు చట్టపరమైన రక్షణ..!!
- దుబాయ్ రైడ్‌లో భారతీయుడికి Dh10,000 బహుమతి..!!
- రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- దుబాయ్ పోలీసుల ఆధ్వర్యంలో బహ్రెయిన్‌కు చెందిన దివ్యాంగ పోలీసు అధికారికి ఘన స్వాగతం
- ఒమన్‌లో ఘనంగా 56వ జాతీయ దినోత్సవ వేడుకలు.. డ్రోన్ షోలతో ఆకట్టుకున్న ఆకాశం







