దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ 2026.. డిసెంబర్ 4 నుంచి 45 రోజుల పాటు సందడే సందడి!

- November 23, 2026 , by Maagulf
దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ 2026.. డిసెంబర్ 4 నుంచి 45 రోజుల పాటు సందడే సందడి!

దుబాయ్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ (DSF) 32వ ఎడిషన్‌కు సంబంధించిన కార్యక్రమాలను దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రిటైల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DFRE) ప్రకటించింది. 2026 డిసెంబర్ 4 నుంచి 2027 జనవరి 17 వరకు మొత్తం 45 రోజుల పాటు ఈ వేడుకలు నగరవ్యాప్తంగా ఘనంగా జరగనున్నాయి.

‘దుబాయ్‌స్ సీజన్ ఆఫ్ ఫైండ్స్’ (Dubai’s Season of Finds) థీమ్‌తో నిర్వహించనున్న ఈ ఫెస్టివల్‌లో సంగీత కచేరీలు, డ్రోన్ షోలు, లైట్ ప్రదర్శనలు, షాపింగ్ ఆఫర్లు, ఆహార ఉత్సవాలు, ఆటోమొబైల్ ప్రదర్శనలు, కుటుంబ వినోద కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అంతేకాకుండా లక్షలాది దిర్హామ్‌ల విలువైన బహుమతులు, లక్కీ డ్రాలు కూడా నిర్వహించనున్నారు.

ప్రముఖ సంగీత కళాకారులతో ప్రత్యేక కచేరీలు
ఫెస్టివల్ ప్రారంభోత్సవం సందర్భంగా డిసెంబర్ 4న కోకా కోలా అరేనాలో ప్రముఖ అరబ్ గాయకుడు రషెద్ అల్ మాజెద్ సంగీత కచేరీ నిర్వహించనున్నారు. దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్‌లో జరిగే ఎతిసలాత్ DSF నైట్స్‌లోనూ పలు సంగీత, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. DJ మాది, షర్మూఫర్స్, మొహమ్మద్ చాకర్, బెస్సాన్ ఇస్మాయిల్, అజీజ్ మరాకా, డిస్టింక్ట్ తదితర కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు.

నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా డిసెంబర్ 31న ఈజిప్టు గాయని రూబీ ప్రత్యేక సంగీత ప్రదర్శన ఇవ్వనున్నారు.

జేబీఆర్, బ్లూవాటర్స్‌లో డ్రోన్ షోలు
ఈ ఏడాది దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్‌లో డ్రోన్, లైట్ షోలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. జేబీఆర్‌లోని ది బీచ్ నుంచి బ్లూవాటర్స్ వరకు సముద్ర తీర ప్రాంతంలో ఈ ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ రాత్రి 8 గంటలకు, 10 గంటలకు రెండు ప్రత్యేక ప్రదర్శనలు ఉంటాయి. డ్రోన్లతో పాటు భవనాలపై లైట్ ప్రొజెక్షన్లు ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి.

బీచ్ కాంటీన్‌లో 50కి పైగా ఫుడ్ స్టాళ్లు
నెస్నాస్ బీచ్‌లో ఎతిసలాత్ బీచ్ కాంటీన్ 18 రోజుల పాటు సందడి చేయనుంది. ఇక్కడ 50కి పైగా ఫుడ్ అండ్ బెవరేజ్ సంస్థలు తమ ప్రత్యేక వంటకాలను అందించనున్నాయి. వంటకాల ప్రదర్శనలు, వర్క్‌షాపులు, స్థానిక వ్యాపారాల ఉత్పత్తుల మార్కెట్‌తో పాటు పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 13 నుంచి 27 వరకు ప్రతి ఆదివారం ఉచిత సంగీత కచేరీలు కూడా ఏర్పాటు చేశారు.

హట్టాలో గ్లో రన్.. ఆటోమొబైల్ ఈవెంట్లు
డిసెంబర్ 19న హట్టాలో తొలిసారిగా మూడు కిలోమీటర్ల హట్టా గ్లో రన్ నిర్వహించనున్నారు. ఇందులో 500 మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.

అలాగే డిసెంబర్ 19, 20 తేదీల్లో సిటీ వాక్‌లో కలెక్టర్స్ హబ్, జనవరి 9, 10 తేదీల్లో దుబాయ్ స్టూడియో సిటీలో మిడిల్ ఈస్ట్ కార్స్ అండ్ బైక్స్ వీక్ నిర్వహించనున్నారు. జనవరి 14 నుంచి 17 వరకు దుబాయ్ సెవెన్స్‌లో MOC27 – మోటార్స్, అవుట్‌డోర్ అండ్ క్యాంపింగ్ కార్యక్రమం జరగనుంది. జనవరి 16న సిటీ సెంటర్ మిర్దిఫ్‌లో మిర్దిఫ్ మోటార్ షో నిర్వహించనున్నారు.

జనవరిలో ఎతిసలాత్ MOTB
నాద్ అల్ షెబాలోని ది స్క్వేర్‌లో జనవరి 8 నుంచి 24 వరకు 17 రోజుల పాటు ఎతిసలాత్ MOTB (Market Outside The Box) నిర్వహించనున్నారు. ‘Y2K Reimagined’ థీమ్‌తో జరిగే ఈ కార్యక్రమంలో ఫ్యాషన్, బ్యూటీ, ఫిట్‌నెస్, సంగీతం, యువత సంస్కృతికి సంబంధించిన ఆరు ప్రత్యేక విభాగాలు ఉంటాయి. చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు.

1,000కి పైగా బ్రాండ్లతో భారీ షాపింగ్ ఆఫర్లు
షాపింగ్ ప్రియుల కోసం ఈసారి 1,000కి పైగా బ్రాండ్లు, 4,000కు పైగా రిటైల్ అవుట్‌లెట్లు ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు, బహుమతుల పోటీల్లో పాల్గొననున్నాయి. దుబాయ్‌లోని ప్రముఖ మాల్స్, షాపింగ్ కేంద్రాల్లో 45 రోజుల పాటు ప్రత్యేక ప్రమోషన్లు కొనసాగనున్నాయి.

ఆహార ప్రియుల కోసం డిసెంబర్ 7 నుంచి ఏడు వారాల పాటు ‘దుబాయ్ చెఫ్స్ ఫేవరెట్స్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రతి వారం ఒక్కో అవార్డు గెలుచుకున్న చెఫ్ తనకు ఇష్టమైన దుబాయ్ రెస్టారెంట్లు, ఆహార ప్రదేశాలను పరిచయం చేయనున్నారు.

ఈ సందర్భంగా DFRE సీఈఓ అహ్మద్ అల్ ఖాజా మాట్లాడుతూ.. మూడు దశాబ్దాలకు పైగా దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ నగరంలోని ప్రజలను, సందర్శకులను విభిన్న అనుభవాల ద్వారా ఒకచోట చేర్చుతోందని తెలిపారు. 32వ ఎడిషన్‌లో మరిన్ని వినోద కార్యక్రమాలు, అంతర్జాతీయ ఆహార అనుభవాలు, సాంస్కృతిక వేడుకలు, సాహస కార్యక్రమాలు, షాపింగ్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు.

మొత్తంగా 2026-27 దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ నివాసితులతో పాటు ప్రపంచవ్యాప్తంగా వచ్చే పర్యాటకులకు 45 రోజుల పాటు వినోదం, షాపింగ్, ఆహారం, సంగీతం, కుటుంబ సమేతంగా ఆనందించే అనేక అనుభవాలను అందించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com