యూఏఈలో ప్రభుత్వ సేవలకు ఏఐ అసిస్టెంట్ ‘మీరా’..!!

- November 23, 2026 , by Maagulf
యూఏఈలో ప్రభుత్వ సేవలకు ఏఐ అసిస్టెంట్ ‘మీరా’..!!

దుబాయ్: యూఏఈ ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత వ్యక్తిగత సహాయకురాలు ‘మీరా’ (Mira)ను అందుబాటులోకి తీసుకురానుంది. 2027 మార్చి నుంచి ఈ సేవలను ప్రజలకు ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రజల అవసరాలను అర్థం చేసుకుని, వారి అభ్యర్థనలకు అనుగుణంగా స్పందించడంతోపాటు ప్రభుత్వ లావాదేవీలను వారి తరఫున పూర్తి చేసేలా మీరాను రూపొందించారు. 

తొలుత పౌరులు, నివాసితులకు అత్యంత అవసరమైన సేవలను ఈ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. 2027 చివరి నాటికి అన్ని ప్రభుత్వ సేవలను ఇందులో చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నవంబర్ 23న దుబాయ్‌లోని ఎక్స్‌పో సిటీలో నిర్వహించిన ‘ది న్యూ విజన్ అండ్ అప్రోచ్ టు డెలివరింగ్ గవర్నమెంట్ సర్వీసెస్’ కార్యక్రమంలో ఈ కొత్త విధానాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా క్యాబినెట్ వ్యవహారాల మంత్రి మొహమ్మద్ అబ్దుల్లా అల్ గెర్గావీ మాట్లాడుతూ.. ప్రభుత్వ సేవలను మెరుగుపరిచే ప్రయాణం 30 ఏళ్లకు పైగా కొనసాగుతోందని తెలిపారు. ప్రజల జీవితాలను సులభతరం చేయాలనే షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ దార్శనికతతో ఈ మార్పులు చోటుచేసుకున్నాయని వివరించారు.

యూఏఈలో ప్రభుత్వ సేవల అభివృద్ధి ప్రస్థానాన్ని వివరించిన ఆయన, కొత్త ఏఐ వ్యవస్థతో ప్రజలకు మరింత వేగంగా, సౌకర్యవంతంగా సేవలు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. మీరా అందుబాటులోకి వస్తే ప్రభుత్వ కార్యాలయాలను సంప్రదించాల్సిన అవసరం తగ్గడంతోపాటు, వివిధ సేవలకు సంబంధించిన లావాదేవీలను ఒకే డిజిటల్ వేదిక ద్వారా నిర్వహించుకునే అవకాశం కలగనుందని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com