యూఏఈ 55వ ఈద్ అల్ ఎతిహాద్ వేడుకలకు ఐదు రోజుల సంబరాలు..

- November 23, 2026 , by Maagulf
యూఏఈ 55వ ఈద్ అల్ ఎతిహాద్ వేడుకలకు ఐదు రోజుల సంబరాలు..

అబుదాబి: యూఏఈ 55వ జాతీయ దినోత్సవం (ఈద్ అల్ ఎతిహాద్) వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు షేక్ జాయెద్ ఫెస్టివల్ నిర్వాహక కమిటీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు వరుసగా ఐదు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అబుదాబిలోని అల్ వత్బాలో జరిగే ఈ వేడుకల్లో 5,000 డ్రోన్లతో ఆకాశంలో అద్భుత ప్రదర్శనలు, ప్రతిరోజూ బాణసంచా విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ ఊరేగింపులు, అంతర్జాతీయ కళా ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

5,000 డ్రోన్లతో ఆకాశంలో అద్భుత విన్యాసాలు

ఈ వేడుకల్లో భాగంగా 5,000 డ్రోన్లతో నిర్వహించే ప్రత్యేక ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. యూఏఈ జాతీయ ఐక్యత, దేశ చరిత్ర, ప్రత్యేకతలను ప్రతిబింబించేలా డ్రోన్లు ఆకాశంలో వివిధ ఆకృతులు, కాంతి విన్యాసాలను ప్రదర్శించనున్నాయి. అంతేకాకుండా ఐదు రోజుల పాటు ప్రతి రాత్రి సంగీతం, లైటింగ్ ఎఫెక్ట్స్‌తో కూడిన బాణసంచా ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

960 మందికి పైగా కళాకారులతో 'యూనియన్ స్పెక్టాకిల్'

'యూనియన్ స్పెక్టాకిల్' పేరుతో నిర్వహించనున్న ప్రధాన ప్రదర్శనలో 960 మందికి పైగా కళాకారులు, ప్రదర్శకులు పాల్గొననున్నారు. ఐదు విభిన్న కళారూపాల సమాహారంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఎమిరేటీ సంప్రదాయాలు, అంతర్జాతీయ ప్రదర్శన కళలు, సంగీతం, లేజర్ షోలు, లైటింగ్ ఎఫెక్ట్స్, ఎమిరేట్స్ ఫౌంటెన్‌తో ఈ ప్రదర్శన ప్రత్యేకంగా ఉండనుంది.

ఐక్యత, సౌభ్రాతృత్వం, సాంస్కృతిక వైవిధ్యం వంటి విలువలను చాటిచెప్పడంతో పాటు యూఏఈ సమాఖ్య ఏర్పాటైన చరిత్ర, దేశ అభివృద్ధి, జాతీయ గర్వాన్ని ప్రతిబింబించేలా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

గుర్రాలు, ఒంటెలతో సంప్రదాయ ఊరేగింపు

వేడుకల్లో భాగంగా 'యూనియన్ కారవాన్' పేరుతో ప్రత్యేక సంప్రదాయ ఊరేగింపు నిర్వహించనున్నారు. యూఏఈ జాతీయ జెండా రంగులతో అలంకరించిన 10 గుర్రాలు, సంప్రదాయ ఎమిరేటీ కుటుంబ కారవాన్‌ను ప్రతిబింబించే 15 ఒంటెలు ఈ ఊరేగింపులో పాల్గొంటాయి. వీటితో పాటు 13 అంతర్జాతీయ ప్రదర్శన బృందాలు, కార్నివాల్ కళాకారులు సందడి చేయనున్నారు.

ఎమిరాతి సమాజంలో గుర్రాలు, ఒంటెలకు ఉన్న చారిత్రక ప్రాధాన్యతను నేటి తరానికి పరిచయం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.

కుటుంబాలు, చిన్నారుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు

'యూనియన్ లాంతర్న్ పరేడ్'తో పాటు వివిధ దేశాల సాంస్కృతిక ప్రదర్శనలు, సంప్రదాయ కళారూపాలు, కుటుంబాలు, చిన్నారుల కోసం ప్రత్యేక వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. దేశభక్తి గీతాలు, కళా ప్రదర్శనలతో పాటు సందర్శకులకు యూఏఈ జాతీయ జెండాలు, జాతీయ స్కార్ఫ్‌లను పంపిణీ చేయనున్నారు.

వందలాది బహుమతులు.. డిసెంబర్ 2న ప్రత్యేక కారు డ్రా

ఐదు రోజుల వేడుకల్లో భాగంగా వందలాది లక్కీ డ్రాలు, బహుమతుల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, విమాన టికెట్లు, హోటల్ బస, షాపింగ్ వోచర్లు, వీఐపీ ప్యాకేజీలు, గేమింగ్ కార్డులు వంటి బహుమతులు అందించనున్నారు. ప్రతిరోజూ లక్కీ డ్రాలు నిర్వహించడంతో పాటు డిసెంబర్ 2న యూఏఈ 55వ ఈద్ అల్ ఎతిహాద్ సందర్భంగా ప్రత్యేక కారు బహుమతి డ్రా కూడా నిర్వహించనున్నారు.

అంతర్జాతీయ సాంస్కృతిక ప్రదర్శనలకు వేదిక

షేక్ జాయెద్ ఫెస్టివల్‌లోని జాతీయ, అంతర్జాతీయ పెవిలియన్లు కూడా ఈ వేడుకల్లో భాగస్వామ్యం కానున్నాయి. సహనం, సహజీవనం, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా వివిధ దేశాల కళా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. యూఏఈ సంప్రదాయ వారసత్వం, అభివృద్ధి విజయాలు, సామాజిక కార్యక్రమాలను కూడా ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.

డ్రోన్ షోలు, బాణసంచా విన్యాసాలు, సంప్రదాయ ఊరేగింపులు, అంతర్జాతీయ కళా ప్రదర్శనలు, ఆకర్షణీయమైన బహుమతులతో అల్ వత్బాను ఐదు రోజుల పాటు ప్రధాన వేడుకల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. యూఏఈ వారసత్వ పరిరక్షణ, సాంస్కృతిక మార్పిడి, జాతీయ ఐక్యత, దేశభక్తి భావాలను మరింత బలోపేతం చేయడమే ఈ వేడుకల ముఖ్య ఉద్దేశమని నిర్వాహక కమిటీ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com