కువైట్‌లో నవంబర్ 30న అంతర్జాతీయ స్టార్టప్ పోటీ..!!

- November 23, 2026 , by Maagulf
కువైట్‌లో నవంబర్ 30న అంతర్జాతీయ స్టార్టప్ పోటీ..!!

కువైట్: అంతర్జాతీయ తమిళ ఇంజినీర్ల ఫోరం (ITEF) ఆధ్వర్యంలో కువైట్‌లో అంతర్జాతీయ స్టార్టప్ పోటీ నిర్వహించనున్నారు. నవంబర్ 29, 30 తేదీల్లో జరగనున్న ఇంటర్నేషనల్ టెక్నికల్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్‌లో భాగంగా ఈ పోటీని ఏర్పాటు చేస్తున్నారు. 

నవంబర్ 30న ఉదయం 9:00 గంటల నుంచి కువైట్‌లోని జుమైరా మెస్సిలా బీచ్ హోటల్‌లో ఉన్న బద్రియా బాల్‌రూమ్‌లో పోటీలు ప్రారంభం కానున్నాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు తమ ఆలోచనలు, వినూత్న పరిష్కారాలు, అభివృద్ధి చేస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించేందుకు ఈ పోటీ వేదికగా నిలవనుంది.

ఇప్పటికే పలువురు స్టార్టప్ ఔత్సాహికులు పోటీల్లో పాల్గొనేందుకు పేర్లు నమోదు చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తమ ఆవిష్కరణలు, సాంకేతిక అభివృద్ధిని ప్రదర్శించేందుకు వారు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. వృత్తిపరమైన నైపుణ్యాల అభివృద్ధి, స్టార్టప్ వ్యవస్థకు ప్రోత్సాహం, నైపుణ్య శిక్షణకు మద్దతు అందించాలనే లక్ష్యంతో ITEF ఏర్పాటైంది. ఈ సంస్థకు ఛైర్మన్‌గా ఎర్. కృష్ణ జగన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎర్. సెల్వం వ్యవహరిస్తున్నారు.

రెండు రోజులపాటు జరిగే ఇంటర్నేషనల్ టెక్నికల్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్‌లో ఇంజినీరింగ్ నిపుణులు, ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక రంగ ఆసక్తిదారులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం ద్వారా విజ్ఞానాన్ని పంచుకోవడంతోపాటు నెట్‌వర్కింగ్, వృత్తిపరమైన సహకారానికి అవకాశాలు కల్పించనున్నారు. స్టార్టప్‌లపై ఆసక్తి ఉన్న యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు ఈ పోటీలకు హాజరై పాల్గొనేవారిని ప్రోత్సహించాలని నిర్వాహకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com