GMU అలుమ్ని సమ్మిట్ 2026.. నాలుగు దేశాల్లో కొత్త అంతర్జాతీయ అలుమ్ని చాప్టర్ల ప్రారంభం

- November 23, 2026 , by Maagulf
GMU అలుమ్ని సమ్మిట్ 2026.. నాలుగు దేశాల్లో కొత్త అంతర్జాతీయ అలుమ్ని చాప్టర్ల ప్రారంభం

అజ్మాన్: గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీ (GMU) ఆధ్వర్యంలో నిర్వహించిన అలుమ్ని సమ్మిట్ 2026 ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కెనడా, ఒమన్, ఖతార్, స్వీడన్ దేశాల్లో నాలుగు కొత్త అంతర్జాతీయ అలుమ్ని చాప్టర్లను ప్రారంభించడంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో విశేష సేవలందిస్తున్న 28 మంది పూర్వ విద్యార్థులను సత్కరించారు.

అజ్మాన్‌లోని థంబే మెడిసిటీ ప్రాంగణంలో ఆదివారం ఈ సమ్మిట్ నిర్వహించారు.తుంభే గ్రూప్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ తుంభే మొయిదీన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జీఎంయూ ఛాన్సలర్ ప్రొఫెసర్ మందా వెంకటరమణ, అలుమ్ని అఫైర్స్ విభాగాధిపతి నౌషీన్ సల్మా, జీఎంయూ అలుమ్ని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఒమర్ నబీతో పాటు వైస్ ఛాన్సలర్లు, డీన్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.

10 దేశాలకు విస్తరించిన అంతర్జాతీయ అలుమ్ని నెట్‌వర్క్
సమ్మిట్‌లో ముఖ్య ఘట్టంగా డాక్టర్ థంబే మొయిదీన్ నాలుగు కొత్త అంతర్జాతీయ అలుమ్ని చాప్టర్లను ప్రారంభించారు. కెనడాలో డాక్టర్ రిజ్వాన్ రషీద్, ఒమన్‌లో డాక్టర్ ఫర్హానా అల్ ఉత్మానీ, ఖతార్‌లో డాక్టర్ జుయెల్ చౌధురి, స్వీడన్‌లో నర్మీన్ అనీస్ ఈ చాప్టర్లకు నాయకత్వం వహించనున్నారు.

ఇప్పటికే అమెరికా, బ్రిటన్, భారత్, జర్మనీ, బహ్రెయిన్, పోలాండ్ దేశాల్లో అలుమ్ని చాప్టర్లు కొనసాగుతున్నాయి. తాజాగా మరో నాలుగు దేశాల్లో ప్రారంభించడంతో మొత్తం అంతర్జాతీయ చాప్టర్ల సంఖ్య 10కి చేరింది.

ఈ చాప్టర్ల ద్వారా వివిధ దేశాల్లో పనిచేస్తున్న జీఎంయూ పూర్వ విద్యార్థులకు స్థానిక నెట్‌వర్క్, మార్గదర్శకత్వం, వృత్తిపరమైన అభివృద్ధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే యూనివర్సిటీతో తమ అనుబంధాన్ని కొనసాగించేందుకు వీలుంటుంది.

28 మంది ప్రముఖ పూర్వ విద్యార్థులకు సత్కారం
యూనివర్సిటీ 28వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ‘28 GMU Icons’ పేరుతో రూపొందించిన పుస్తకాన్ని డాక్టర్ తుంభే మొయిదీన్ ఆవిష్కరించారు. వైద్య విభాగాల్లో నాయకత్వ బాధ్యతలు చేపట్టడం, పరిశోధనలు చేయడం, సొంత వైద్య సంస్థలను అభివృద్ధి చేయడం, సమాజానికి సేవలందించడం వంటి రంగాల్లో గుర్తింపు పొందిన 28 మంది పూర్వ విద్యార్థుల విజయగాథలను ఈ పుస్తకంలో పొందుపరిచారు.

ఈ సందర్భంగా వారందరినీ ఘనంగా సత్కరించారు. అంతకుముందు ‘GMU Alumni – Future Ready’ పేరుతో నిర్వహించిన ప్యానెల్ చర్చలో ఆరుగురు పూర్వ విద్యార్థులు తమ విద్యాభ్యాసం నుంచి వైద్య రంగంలో నాయకత్వ స్థాయికి ఎదిగిన ప్రయాణాన్ని వివరించారు. 1998లో యూనివర్సిటీని స్థాపించిన డాక్టర్ తుంభే మొయిదీన్‌కు పూర్వ విద్యార్థులు ప్రత్యేక జ్ఞాపికను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.

జీఎంయూ పూర్వ విద్యార్థులకు తుంభే గ్రూప్‌లో ఉద్యోగ అవకాశాలు
ఈ సందర్భంగా డాక్టర్ తుంభే మొయిదీన్ మాట్లాడుతూ.. తమ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కలిగినవారని, వారితో తమ అనుబంధాన్ని మరింత బలోపేతం చేయాలనుకుంటున్నామని తెలిపారు.తుంభే గ్రూప్‌లోని మొత్తం ఉద్యోగాల్లో 3 శాతం ఉద్యోగాలను జీఎంయూ పూర్వ విద్యార్థుల కోసం కేటాయించినట్లు వెల్లడించారు. ప్రపంచంలోని ఏ దేశంలో పనిచేస్తున్నా జీఎంయూ కుటుంబం వారికి అండగా ఉంటుందని పేర్కొన్నారు.

ఛాన్సలర్ ప్రొఫెసర్ మందా వెంకటరమణ మాట్లాడుతూ.. ఒక యూనివర్సిటీ స్థాయిని దాని నుంచి విద్యను పూర్తి చేసి బయటకు వెళ్లిన విద్యార్థులు సాధించే విజయాల ద్వారా అంచనా వేయవచ్చని అన్నారు. 28 మంది ప్రముఖ పూర్వ విద్యార్థుల విజయాలు జీఎంయూ విద్యా ప్రమాణాలకు నిదర్శనమని పేర్కొన్నారు. కొత్త చాప్టర్ల ప్రారంభంతో 10 దేశాల్లో జీఎంయూ పూర్వ విద్యార్థులకు ప్రత్యేక నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చిందని తెలిపారు.

117 దేశాల విద్యార్థులతో అంతర్జాతీయ గుర్తింపు
ప్రస్తుతం గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో ఏడు కళాశాలలు, 55 గుర్తింపు పొందిన విద్యా కార్యక్రమాలు ఉన్నాయి. 117కు పైగా దేశాలకు చెందిన విద్యార్థులు, 56 దేశాలకు చెందిన అధ్యాపకులు, సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్నారు. ఇప్పటివరకు 5,000 మందికి పైగా పూర్వ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా వివిధ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల్లో సేవలందిస్తున్నారు.

టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2027లో ఇంటర్నేషనల్ ఔట్‌లుక్ విభాగంలో 2,297 యూనివర్సిటీలలో 99.4 స్కోరుతో ప్రపంచంలోనే మొదటి స్థానాన్ని జీఎంయూ సాధించినట్లు యూనివర్సిటీ వెల్లడించింది. QS అరబ్ రీజియన్ ర్యాంకింగ్స్‌లో అంతర్జాతీయ విద్యార్థుల నిష్పత్తి పరంగా అరబ్ ప్రాంతంలో అగ్రస్థానంలో నిలిచింది. THE అరబ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో 88వ స్థానాన్ని దక్కించుకుంది.

2026 జూన్‌లో బ్రిటన్‌కు చెందిన క్వాలిటీ అష్యూరెన్స్ ఏజెన్సీ (QAA) నుంచి సంస్థాగత గుర్తింపును కూడా పొందింది. 3,100కు పైగా పడకల సామర్థ్యం కలిగిన ఏడు అకడమిక్ ఆసుపత్రుల్లో విద్యార్థులకు శిక్షణ అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 75కు పైగా యూనివర్సిటీలతో భాగస్వామ్యాలు కలిగి ఉంది.

2027 అడ్మిషన్లు ప్రారంభం
2027 స్ప్రింగ్, ఫాల్ ఇన్‌టేక్‌లకు సంబంధించి జీఎంయూ వివిధ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించింది. మెడిసిన్, డెంటిస్ట్రీ, ఫార్మసీ, నర్సింగ్, హెల్త్ సైన్సెస్, హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్, హెల్త్‌కేర్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వెటర్నరీ మెడిసిన్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

మరిన్ని వివరాలు, దరఖాస్తుల కోసం యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్నుhttp://www.gmu.ac.ae సందర్శించవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com