బహ్రెయిన్‌లో డ్యామేజ్ అసెస్‌మెంట్ సర్టిఫికెట్ సేవలు ఆన్‌లైన్‌లోకి..!!

- November 24, 2026 , by Maagulf
బహ్రెయిన్‌లో డ్యామేజ్ అసెస్‌మెంట్ సర్టిఫికెట్ సేవలు ఆన్‌లైన్‌లోకి..!!

మనామా: బహ్రెయిన్‌లో ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేసే దిశగా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Interior Ministry) కీలక నిర్ణయం తీసుకుంది. డ్యామేజ్ అసెస్‌మెంట్ సర్టిఫికెట్ జారీ సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేసింది. దీంతో ఇకపై ఈ సర్టిఫికెట్ కోసం ప్రభుత్వ కార్యాలయాలకు నేరుగా వెళ్లాల్సిన అవసరం ఉండదు. లబ్ధిదారులు eKey అథెంటికేషన్ విధానాన్ని ఉపయోగించి బహ్రెయిన్ ఈ-గవర్నమెంట్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన అన్ని ప్రక్రియలను కూడా ఆన్‌లైన్‌లో పూర్తి చేసి సర్టిఫికెట్ పొందవచ్చు.

ఈ సేవను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్ఫర్మేషన్ ఆధునికీకరించింది. ప్రభుత్వ సేవలను మెరుగుపరచడం, పరిపాలనా ప్రక్రియలను సరళీకరించడం, డిజిటల్ సేవలను విస్తరించడంలో భాగంగా ఈ మార్పులు చేపట్టారు. కొత్త విధానంలో సర్టిఫికెట్ కోసం సమర్పించాల్సిన పత్రాల సంఖ్యను 50% తగ్గించారు. అలాగే గతంలో సుమారు ఏడు పని దినాలు పట్టే ప్రక్రియను ఐదు పని దినాలకు కుదించారు. పేపర్ డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరాన్ని కూడా తొలగించారు.

మానవ వనరుల సహాయ అండర్ సెక్రటరీ, అభివృద్ధి మరియు విధానాల ప్రామాణీకరణ బృందం ఛైర్మన్ మేజర్ జనరల్ ఆదెల్ అబ్దుల్లా అమీన్ మాట్లాడుతూ.. వినూత్న డిజిటల్ పరిష్కారాలను అమలు చేయడం, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో భాగంగానే ఈ అప్‌గ్రేడ్ చేపట్టినట్లు తెలిపారు. ఈ మార్పులతో కార్యాలయాలకు వెళ్లకుండానే ప్రజలు సులభంగా సేవలు పొందవచ్చని, ప్రభుత్వ విభాగాల పనితీరు మెరుగుపడటంతో పాటు సేవల నాణ్యత, లబ్ధిదారుల అనుభవం కూడా మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com