నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

- November 25, 2026 , by Maagulf
నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

అమరావతి: ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో డిసెంబర్ 19, 20 తేదీల్లో ఒంగోలులో నిర్వహించనున్న నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆహ్వానించినట్లు పరిషత్తు అధ్యక్షుడు డా. గజల్ శ్రీనివాస్ తెలిపారు.

ఈ మేరకు పరిషత్తు ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. డిసెంబర్ 19న ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్న మహాసభల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేయాలని కోరినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా డా.గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలుగు భాషా చరిత్రలో తొలిసారిగా 16 ఏళ్లలోపు బాలల కోసం, బాలల చేత నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక మహాసభలుగా వీటిని రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిపారు. తెలుగు భాషలోని వివిధ సాహిత్య ప్రక్రియల్లో బాలబాలికలు తమ ప్రతిభను ప్రదర్శించనున్నారని పేర్కొన్నారు.

ఒంగోలులోని నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించనున్న ఈ మహాసభలకు శ్రీ నందమూరి తారక రామారావు కళా ప్రాంగణం వేదిక కానుండగా, శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు ప్రధాన వేదికగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల నుంచి ప్రతినిధులు తమ తల్లిదండ్రులతో కలిసి ఈ మహాసభల్లో పాల్గొననున్నారని వివరించారు.

మహాసభలకు హాజరుకావాలన్న తమ ఆహ్వానం పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని డా.గజల్ శ్రీనివాస్ వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మహాసభల ముఖ్య సమన్వయకర్తలు డా.కె.మురళీధర్ రెడ్డి, కోగంటి శ్రీకాంత్, ఆంధ్రప్రదేశ్ రెడ్‌క్రాస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి. రామచంద్రరాజు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com