సౌదీ అరేబియాలోని జాజాన్ పోర్టుపై హౌతీ మిలిటెంట్ల దాడి.. స్వల్పంగా దెబ్బతిన్న నౌకాశ్రయం

- November 25, 2026 , by Maagulf
సౌదీ అరేబియాలోని జాజాన్ పోర్టుపై హౌతీ మిలిటెంట్ల దాడి.. స్వల్పంగా దెబ్బతిన్న నౌకాశ్రయం

రియాద్: యెమెన్‌కు చెందిన హౌతీ మిలిటెంట్లు సౌదీ అరేబియాపై దాడులను తీవ్రతరం చేస్తున్నారు. తాజాగా బుధవారం నైరుతి సౌదీ అరేబియాలోని జాజాన్ నౌకాశ్రయంపై హౌతీ మిలిటెంట్లు ప్రయోగించిన ప్రక్షేపకం (Projectile) తాకినట్లు సంకీర్ణ దళాలు వెల్లడించాయి. ఈ ఘటనలో నౌకాశ్రయానికి స్వల్ప నష్టం వాటిల్లినట్లు తెలిపాయి.

ఈ దాడిలో ఎలాంటి పౌరులు గాయపడలేదని అధికారులు స్పష్టం చేశారు. దాడికి ఉపయోగించిన ప్రక్షేపకం ఏ రకానికి చెందినదో గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని సంకీర్ణ దళాలు పేర్కొన్నాయి. అయితే నష్టం వివరాలపై మరింత సమాచారం వెల్లడించలేదు.

దీనికి ఒక రోజు ముందే సౌదీ రాజధాని రియాద్‌లోని కింగ్ అబ్దుల్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న ఓ టవర్‌పై హౌతీ మిలిటెంట్లు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు సౌదీ పౌరులు, తొమ్మిది మంది విదేశీయులు సహా మొత్తం 11 మంది గాయపడినట్లు సౌదీ సివిల్ డిఫెన్స్ వెల్లడించింది.

సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (PIF) ప్రధాన కార్యాలయం ఉన్న ఈ టవర్‌పై నవంబర్ 19న కూడా దాడి జరిగింది. ఆ సమయంలో భవనానికి ఆస్తి నష్టం వాటిల్లినప్పటికీ ఎవరూ గాయపడలేదు.

ఇటీవలి కాలంలో సౌదీ అరేబియాలోని విమానాశ్రయాలు, చమురు కేంద్రాలు, ఇతర కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని హౌతీ మిలిటెంట్లు వరుస దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో తాజా ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com