దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షో ప్రారంభించిన షేక్ మన్సూర్ బిన్ మహమ్మద్
- November 25, 2026
25 దేశాల నుంచి 300కుపైగా సంస్థలు..ప్రదర్శనలో 100కుపైగా యాచ్‌లు, వాటర్‌క్రాఫ్ట్‌లు
దుబాయ్: ప్రపంచ యాచ్ తయారీ, సముద్ర సాంకేతిక రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తున్న 32వ దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షో (DIBS) ఘనంగా ప్రారంభమైంది. యూఏఈ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు హెచ్‌హెచ్ షేక్ మన్సూర్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ బుధవారం దుబాయ్ హార్బర్‌లో ఈ ప్రదర్శనను ప్రారంభించారు. నవంబర్ 25 నుంచి 29 వరకు ఐదు రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగనుంది.
ప్రారంభోత్సవం అనంతరం షేక్ మన్సూర్ పలు ప్రముఖ యాచ్ తయారీ, సముద్ర పరికరాల సంస్థల స్టాళ్లను సందర్శించారు. అజిముట్, బెనెట్టి, ఫెర్రెట్టి గ్రూప్, లూర్సెన్, రోమియో మెరైన్, అమీట్ గ్రూప్, ఎక్సాల్టో సంస్థలతో పాటు ఇటాలియన్ పెవిలియన్, దుబాయ్ ఇంటర్నేషనల్ మెరైన్ క్లబ్, అల్ షాలీ మెరైన్ ప్రదర్శనలను పరిశీలించారు.
ఈ సందర్భంగా యాచ్‌లు, బోట్ల తయారీ రంగంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతికతలు, వినూత్న డిజైన్లు, అధునాతన మెరైన్ ఇంజినీరింగ్ పరిష్కారాలను ఆయన తిలకించారు. పాల్గొన్న సంస్థల ప్రతినిధులతో మాట్లాడి వారి ఉత్పత్తులు, ప్రాజెక్టులు, భవిష్యత్ ప్రణాళికల గురించి వివరాలు తెలుసుకున్నారు.
ప్రపంచంలోని ప్రముఖ యాచ్ తయారీ సంస్థలు, అంతర్జాతీయ బ్రాండ్లు, పరిశ్రమ నిపుణులు, పెట్టుబడిదారులను ఒకే వేదికపైకి తీసుకువస్తున్న ఈ ప్రదర్శన దుబాయ్‌ను అంతర్జాతీయ యాచ్ తయారీ, సముద్ర కార్యకలాపాల కేంద్రంగా మరింత బలోపేతం చేయనుంది. అలాగే మెరైన్ రంగంలో పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్యాలు, అంతర్జాతీయ సహకారానికి కొత్త అవకాశాలను కల్పించనుంది.
ఈ ఏడాది ప్రదర్శనలో యూఏఈలో తయారైన పలు యాచ్‌లు ప్రపంచ, ప్రాంతీయ స్థాయిలో తొలిసారిగా పరిచయం కానున్నాయి. యాచ్ డిజైన్, ఇంజినీరింగ్, తయారీ రంగాల్లో యూఏఈ సాధిస్తున్న ప్రగతిని ఈ ప్రదర్శన చాటిచెబుతోంది.
ఈ కార్యక్రమంలో దుబాయ్ ఆర్థిక వ్యవహారాలు, పర్యాటక శాఖ డైరెక్టర్ జనరల్, దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అథారిటీ డైరెక్టర్ జనరల్ హెలాల్ సయీద్ అల్ మర్రీ, దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ సయీద్ హరేబ్ పాల్గొన్నారు.
ఈ ఐదు రోజుల ప్రదర్శనలో 25 దేశాలకు చెందిన 300కుపైగా కంపెనీలు, అంతర్జాతీయ బ్రాండ్లు పాల్గొంటున్నాయి. 100కుపైగా యాచ్‌లు, వాటర్‌క్రాఫ్ట్‌లను ప్రదర్శనకు ఉంచారు. చైనా, ఇటలీ, అమెరికా దేశాల జాతీయ పెవిలియన్లతో పాటు దక్షిణ కొరియా, స్లోవేనియా దేశాలు తొలిసారిగా పాల్గొంటున్నాయి. ఈ ఏడాది 50కుపైగా కొత్త కంపెనీలు, బ్రాండ్లు చేరగా, వాటిలో 20కిపైగా సంస్థలు కొత్తగా ప్రదర్శనలో పాల్గొంటున్నాయి.
ప్రపంచ, ప్రాంతీయ స్థాయిలో కొత్త యాచ్ మోడళ్ల ఆవిష్కరణలతో పాటు మెరైన్ తయారీ, సేవల రంగానికి చెందిన సంస్థల విస్తృత భాగస్వామ్యం ఈ ఏడాది బోట్ షో ప్రత్యేకతగా నిలుస్తోంది. దుబాయ్‌తో పాటు విస్తృత ప్రాంతంలోని సముద్ర పరిశ్రమపై అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆసక్తి, విశ్వాసానికి ఈ ప్రదర్శన నిదర్శనంగా నిలుస్తోంది.
తాజా వార్తలు
- అజ్మాన్ ప్రభుత్వ ఉద్యోగులకు డిసెంబర్ 2 నుంచి 4 వరకు ఈద్ అల్ ఎతిహాద్ సెలవులు
- దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షో ప్రారంభించిన షేక్ మన్సూర్ బిన్ మహమ్మద్
- దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత పోలీస్ స్టేషన్.. పంజాగుట్టలో పైలట్ ప్రాజెక్టు
- 14 దేశాల పై అమెరికా సుంకాల మోత..
- అబుదాబి–కొచ్చి ఇండిగో విమానంలో ప్రయాణికుడి పై దాడి.. వ్యక్తి అరెస్ట్
- నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
- కవిత బరిలోకి దిగేది ఆ అసెంబ్లీ స్థానం నుండే !!
- కువైట్‌లో గొర్రెల పెంపకందారులకు డిసెంబర్ 31 వరకు గడువు..!!
- ఒమన్‌లో ప్రారంభమైన ముత్రా కేబుల్ కార్..!!
- పలు కీలక రంగాల్లో ఖతార్–అమెరికా ఒప్పందాలు..!!







