సౌదీపై దాడులను ఖండించిన పలు దేశాలు..!!
- November 28, 2026
రియాద్: సౌదీ అరేబియాపై హౌతీ మిలీషియా దాడులు కొనసాగుతుండటంపై అంతర్జాతీయంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా జాజాన్ చమురు శుద్ధి కర్మాగారం (Oil Refinery), నౌకాశ్రయంపై జరిగిన దాడులను కువైట్, బహ్రెయిన్, అల్జీరియాతో పాటు ముస్లిం వరల్డ్ లీగ్ (MWL) తీవ్రంగా ఖండించాయి.
సౌదీ అరేబియాలోని జాజాన్ చమురు శుద్ధి కర్మాగారంపై జరిగిన దాడిలో ఒక కార్మికుడు మరణించగా, పలువురు గాయపడ్డారని కువైట్ విదేశాంగ శాఖ వెల్లడించింది. జాజాన్ పోర్టుపై కూడా దాడి జరిగినట్లు పేర్కొంది.ఈ దాడులు సౌదీ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమే కాకుండా అంతర్జాతీయ, మానవతా చట్టాలకు విరుద్ధమని కువైట్ పేర్కొంది. పౌరులు, పౌర ఆస్తులు, కీలక మౌలిక సదుపాయాలపై దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది. సౌదీ అరేబియాకు పూర్తి మద్దతు ప్రకటించిన కువైట్.. దేశ భద్రత, స్థిరత్వాన్ని కాపాడేందుకు సౌదీ తీసుకునే అన్ని చర్యలకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది.
ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ మిలీషియా సౌదీ అరేబియాలోని పౌర, ఆర్థిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడాన్ని బహ్రెయిన్ విదేశాంగ శాఖ ఖండించింది. జాజాన్ రిఫైనరీపై జరిగిన దాడిలో నేపాల్‌కు చెందిన ఒక కార్మికుడు మరణించగా, వివిధ దేశాలకు చెందిన పలువురు గాయపడ్డారని తెలిపింది. రాస్ తనూరా ప్రాంతం, జెడ్డా ఇస్లామిక్ పోర్టు పరిసరాలు, రియాద్ సహా ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడి ప్రయత్నాలను సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని పేర్కొంది. క్షిపణులు, డ్రోన్లతో ఇంధన కేంద్రాలు, వాణిజ్య నౌకాశ్రయాలపై దాడులు చేయడం ప్రాంతీయ భద్రతతో పాటు అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన సరఫరాలకు ముప్పుగా మారుతుందని బహ్రెయిన్ హెచ్చరించింది.
ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని ఆర్టికల్ 51 ప్రకారం సౌదీ అరేబియాకు ఆత్మరక్షణ హక్కు ఉందని బహ్రెయిన్ పేర్కొంది. సౌదీ భద్రతే గల్ఫ్ సహకార మండలి (GCC) భద్రతలో భాగమని స్పష్టం చేసింది. దాడులను నిలువరించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కఠిన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా 2216, 2817, 2837 తీర్మానాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరింది.
సౌదీ అరేబియాలోని కీలక, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న విచక్షణారహిత దాడులను అల్జీరియా ఖండించింది. ఈ పరిణామాలు గల్ఫ్, ఎర్ర సముద్ర ప్రాంతాల్లో ఉద్రిక్తతలను పెంచుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. హౌతీ మిలీషియా దాడులను ముస్లిం వరల్డ్ లీగ్ కూడా తీవ్రంగా ఖండించింది. ఈ దాడులు మతపరమైన విలువలతో పాటు అంతర్జాతీయ, మానవతా చట్టాలకు విరుద్ధమని సంస్థ ప్రధాన కార్యదర్శి, ముస్లిం పండితుల సంస్థ అధ్యక్షుడు షేక్ డాక్టర్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ కరీమ్ అల్-ఇస్సా పేర్కొన్నారు.
పౌరులను, పౌర మౌలిక సదుపాయాలను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోవడం తీవ్రంగా ఖండించాల్సిన చర్యగా అభివర్ణించారు. సౌదీ అరేబియా భద్రతను కాపాడేందుకు తీసుకునే చర్యలకు ముస్లిం వరల్డ్ లీగ్ సంపూర్ణ సంఘీభావం ప్రకటించింది. దాడుల్లో మరణించిన కార్మికుడి కుటుంబానికి కువైట్, బహ్రెయిన్ సంతాపం తెలిపాయి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాయి.
తాజా వార్తలు
- కువైట్‌లో మాదకద్రవ్యాలతో రూలింగ్ ఫ్యామిలీ మెంబర్ అరెస్ట్..!!
- ఖతార్–కెనడా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త దిశ..!!
- సౌదీపై దాడులను ఖండించిన పలు దేశాలు..!!
- యూఏఈ జాతీయ దినోత్సవం.. వాహనదారులకు శుభవార్త..!!
- విమానంలో సాంకేతిక లోపం.. మస్కట్‌కు మళ్లింపు..!!
- ఒమన్‌లో ‘గల్ఫ్ ఆట’ ఆవిర్భావం..ప్రవాస భారతీయుల సంక్షేమమే ప్రధాన లక్ష్యం
- వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక ముందుగానే మెసేజ్‌లు షెడ్యూల్ చేసుకోవచ్చు!
- సౌదీపై హౌతీల దాడి..నేపాల్ కార్మికుడు మృతి, పలువురికి గాయాలు..!!
- ఖతార్‌లో ఊపందుకుంటున్న సినీ పరిశ్రమ..!!
- యూఏఈలో రోడ్డు ప్రమాదాల నివారణకు కొత్త ట్రాఫిక్ నిబంధనలు..!!







