సౌదీపై హౌతీల దాడి..నేపాల్ కార్మికుడు మృతి, పలువురికి గాయాలు..!!
- November 27, 2026
రియాద్: సౌదీ అరేబియాలోని జజాన్ నగరంలో ఉన్న చమురు శుద్ధి కర్మాగారంపై హౌతీ తిరుగుబాటుదారులు జరిపిన దాడిలో నేపాల్‌కు చెందిన ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. పలువురు ఇతర దేశాలకు చెందిన కార్మికులు గాయపడ్డారు. యెమెన్ సరిహద్దుకు సమీపంలోని నైరుతి సౌదీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. రిఫైనరీపై శత్రు వైమానిక ప్రక్షేపకం దాడి చేయడంతో మంటలు చెలరేగాయి. దీంతో కర్మాగారంలోని కొన్ని కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనపై సమాచారం అందుకున్న అత్యవసర, సాంకేతిక బృందాలు వెంటనే అక్కడికి చేరుకున్నాయి.
ఆస్తి నష్టాన్ని అంచనా వేయడంతో పాటు కర్మాగారంలోని ఇతర విభాగాల భద్రతను పరిశీలిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. గాయపడిన వారికి అవసరమైన వైద్య చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ దాడికి సంబంధించి యెమెన్‌లోని హొదైదా ఓడరేవు నగరంలో హౌతీలు వినియోగించిన బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ వేదికను ధ్వంసం చేసినట్లు యెమెన్‌లో చట్టబద్ధ ప్రభుత్వానికి మద్దతుగా పనిచేస్తున్న సంకీర్ణ దళాలు ప్రకటించాయి.
సౌదీకి చెందిన కీలక చమురు కేంద్రాలపై హౌతీలు దాడులు కొనసాగిస్తున్నారు. జజాన్ రిఫైనరీపై దాడికి ఒకరోజు ముందు సౌదీలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రం, ప్రధాన చమురు ఎగుమతి కేంద్రంగా ఉన్న రాస్ తనూరాపై దాడులు చేసినట్లు హౌతీలు ప్రకటించారు.
బుధవారం జజాన్ పోర్టుపైనా హౌతీలు దాడికి పాల్పడగా స్వల్ప నష్టం మాత్రమే జరిగిందని, ఎవరూ గాయపడలేదని సంకీర్ణ దళాలు తెలిపాయి. అదే రోజు జెడ్డా ఇస్లామిక్ పోర్టు, సౌదీ పశ్చిమ ప్రాంతంపైనా దాడులకు ప్రయత్నించినట్లు వెల్లడించాయి. మరోవైపు, మంగళవారం రియాద్‌లోని కింగ్ అబ్దుల్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఓ టవర్‌పై జరిగిన హౌతీ దాడిలో 11 మంది గాయపడినట్లు సౌదీ సివిల్ డిఫెన్స్ వెల్లడించింది.
ఇదిలా ఉండగా, గురువారం కువైట్‌లోని ఓ కీలక కేంద్రంపై జరిగిన దాడిలో ఇద్దరు ఇటలీ పౌరులు మరణించిన ఘటన కూడా చోటుచేసుకుంది. ఆ దాడికి ఇరాన్ కారణమని ఆరోపణలు వచ్చాయి యెమెన్‌లో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న హౌతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ మద్దతు ఇస్తోంది. సౌదీ విమానాశ్రయాలు, చమురు కేంద్రాలు, ఇతర కీలక మౌలిక సదుపాయాలపై వరుస దాడులు ప్రాంతీయ భద్రతపై ఆందోళనలు పెంచుతున్నాయి.
తాజా వార్తలు
- సౌదీపై హౌతీల దాడి..నేపాల్ కార్మికుడు మృతి, పలువురికి గాయాలు..!!
- ఖతార్‌లో ఊపందుకుంటున్న సినీ పరిశ్రమ..!!
- యూఏఈలో రోడ్డు ప్రమాదాల నివారణకు కొత్త ట్రాఫిక్ నిబంధనలు..!!
- ఒమన్‌లో భారీ అగ్నిప్రమాదం.. రెండు ట్రక్కులు, మరో వాహనం దగ్ధం..!!
- కువైట్‌లో అల్ రాయ్ పక్షుల మార్కెట్ శాశ్వతంగా మూసివేత..!!
- బహ్రెయిన్‌లో కార్మికులకు వర్క్ వీసా..ఎంపీ కీలక ప్రతిపాదన..!!
- డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యంగా ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’..
- హైదరాబాద్‌లో ‘సైబరాబాద్ మూవ్స్ 2026’ ప్రారంభం..సుస్థిర రవాణాకు కార్పొరేట్ల ప్రతిజ్ఞ
- త్వరలో 25 వేల ఉద్యోగాలు..సీఎం రేవంత్ కీలక ప్రకటన
- సొంతూరి అభివృద్ధికి చిత్తర్వు కుటుంబీకుల సంకల్పం







