యూఏఈలో రోడ్డు ప్రమాదాల నివారణకు కొత్త ట్రాఫిక్ నిబంధనలు..!!
- November 27, 2026
దుబాయ్: యూఏఈలో ఇటీవల రెండు వారాల వ్యవధిలో జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో 27 మంది ప్రాణాలు కోల్పోవడంతో రహదారి భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డ్రైవర్లకు కఠినమైన నిబంధనలు అమలు చేయడంతో పాటు, వాహనాల కదలికలు, డ్రైవింగ్ సమయాన్ని పర్యవేక్షించే వ్యవస్థను తీసుకురావాలని రోడ్డు భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ట్రాఫిక్ నిబంధనల ప్రకారం.. డ్రైవర్లు 24 గంటల వ్యవధిలో గరిష్ఠంగా 9 గంటలు మాత్రమే డ్రైవింగ్ చేయాలి. అంతేకాకుండా, 9 గంటల పరిమితి పూర్తికాకపోయినా అలసట కారణంగా డ్రైవింగ్ సురక్షితం కాదని భావిస్తే వాహనం నడపకూడదు.
డ్రైవింగ్ సమయంపై నిఘా
రోడ్‌సేఫ్టీ యూఏఈ వ్యవస్థాపకుడు థామస్ ఎడెల్‌మన్ మాట్లాడుతూ.. కొత్త నిబంధన స్వాగతించదగినదేనని, అయితే వాటిని సమర్థంగా అమలు చేయడానికి టాకోగ్రాఫ్ వ్యవస్థ అవసరమని తెలిపారు. టాకోగ్రాఫ్ అనేది వాహనం ఎంతసేపు ప్రయాణించింది, ఎక్కడ ప్రయాణించింది, ఎంత వేగంతో వెళ్లింది వంటి వివరాలను నమోదు చేసే పరికరం.
ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈ వ్యవస్థను ఉపయోగిస్తున్నారని చెప్పారు. యూఏఈలో దీన్ని ఎలా అమలు చేస్తారు, నిబంధనల ఉల్లంఘనలను ఎలా గుర్తిస్తారనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ట్యాక్సీల కదలికలను పర్యవేక్షిస్తున్న స్మార్ట్ వ్యవస్థను ట్రక్కులు, బస్సులు, డెలివరీ బైక్‌లకు కూడా విస్తరించాలని సూచించారు.
డ్రైవర్లదా.. కంపెనీలదా బాధ్యత?
నిబంధనలు ఉల్లంఘించినప్పుడు బాధ్యత ఎవరిపై ఉంటుందనేది మరో కీలక ప్రశ్నగా మారింది. డ్రైవర్‌పైనా లేదా అతడిని నియమించుకున్న కంపెనీపైనా చర్యలు తీసుకుంటారా అనే విషయంపై స్పష్టత అవసరమని థామస్ పేర్కొన్నారు.
20 ఏళ్లకు పైగా రోడ్డు ప్రమాదాలపై అధ్యయనం చేసిన నిపుణుడు డాక్టర్ ముస్తఫా అల్ దా మాట్లాడుతూ.. డ్రైవర్ల పని గంటలు, వాహనం నడిపిన సమయాన్ని కొలవడం, పర్యవేక్షించడం అత్యంత ముఖ్యమన్నారు. బ్రిటన్‌లో అమలవుతున్న టాకోగ్రాఫ్ వ్యవస్థను ఉదాహరణగా ప్రస్తావించారు. మానవ ప్రాణాల కంటే వ్యాపార నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వకూడదని స్పష్టం చేశారు.
నిలిచిపోయిన వాహనాలతోనూ ప్రమాదాలు
రాస్ అల్ ఖైమాలో ఈ వారం జరిగిన ప్రమాదంలో 13 మంది మరణించిన విషయం తెలిసిందే. యాంత్రిక సమస్యతో రోడ్డు పక్కన నిలిచిన ట్రక్కును బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇలాంటి ఘటనలను నివారించేందుకు రోడ్డు పక్కన నిలిచిపోయిన వాహనాల వద్ద హెచ్చరిక త్రిభుజాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా ట్రక్కుల వద్ద ఈ హెచ్చరికలు సరిగా కనిపించడం లేదని డాక్టర్ ముస్తఫా అన్నారు. కొంతమంది డ్రైవర్లు హెచ్చరిక బోర్డులకు బదులుగా ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, లోహపు సిలిండర్లను వాహనాల ముందు ఉంచుతున్నారని, ప్రమాద సమయంలో అవి వేగంగా దూసుకెళ్లే వస్తువులుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. హెచ్చరిక బోర్డులను కొన్ని సెకన్లలో ఏర్పాటు చేసుకునేలా వాటి రూపకల్పనను మెరుగుపరచాలని, వాహనం చెడిపోయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డ్రైవింగ్ స్కూళ్లలో శిక్షణ ఇవ్వాలని సూచించారు.
అయితే ప్రమాదాలకు కేవలం నిలిచిపోయిన భారీ వాహనాలే కారణం కాదని, డ్రైవర్లు రోడ్డుపై దృష్టి పెట్టకపోవడం కూడా ప్రధాన సమస్యని ఆయన పేర్కొన్నారు. ముందు వాహనానికి కనీసం రెండు సెకన్ల దూరం పాటిస్తూ అప్రమత్తంగా డ్రైవింగ్ చేస్తే ఇలాంటి ప్రమాదాలను తగ్గించవచ్చని చెప్పారు.
ఏడు ఎమిరేట్లకు ఒకే భద్రతా
యూఏఈలో వేలాది స్కూల్ బస్సులను నిర్వహిస్తున్న ఎస్‌టీఎస్ గ్రూప్ సీఈఓ స్టీవ్ బర్నెల్ మాట్లాడుతూ.. దేశంలోని ఏడు ఎమిరేట్లలో భారీ వాహనాల భద్రత కోసం ఒకే విధమైన జాతీయ కార్యక్రమాన్ని అమలు చేయాలని సూచించారు. డ్రైవింగ్ గంటల పరిమితి ఒక్కటే సరిపోదని, పని గంటలు, డ్రైవింగ్ సమయం, విశ్రాంతి సమయాలు, మొత్తం పని వ్యవధిని పర్యవేక్షించే విధానం ఉండాలని అన్నారు.
సాంకేతిక పరిజ్ఞానంతో పాటు స్వతంత్ర తనిఖీలు కూడా అవసరమని పేర్కొన్నారు. వాణిజ్య ఒత్తిళ్లు, నిర్వహణ ఖర్చులు, కంపెనీల పెట్టుబడుల విషయంలో రాజీలు ఉన్నా రహదారి భద్రత విషయంలో మాత్రం ఎలాంటి రాజీ ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సౌదీపై హౌతీల దాడి..నేపాల్ కార్మికుడు మృతి, పలువురికి గాయాలు..!!
- ఖతార్‌లో ఊపందుకుంటున్న సినీ పరిశ్రమ..!!
- యూఏఈలో రోడ్డు ప్రమాదాల నివారణకు కొత్త ట్రాఫిక్ నిబంధనలు..!!
- ఒమన్‌లో భారీ అగ్నిప్రమాదం.. రెండు ట్రక్కులు, మరో వాహనం దగ్ధం..!!
- కువైట్‌లో అల్ రాయ్ పక్షుల మార్కెట్ శాశ్వతంగా మూసివేత..!!
- బహ్రెయిన్‌లో కార్మికులకు వర్క్ వీసా..ఎంపీ కీలక ప్రతిపాదన..!!
- డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యంగా ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’..
- హైదరాబాద్‌లో ‘సైబరాబాద్ మూవ్స్ 2026’ ప్రారంభం..సుస్థిర రవాణాకు కార్పొరేట్ల ప్రతిజ్ఞ
- త్వరలో 25 వేల ఉద్యోగాలు..సీఎం రేవంత్ కీలక ప్రకటన
- సొంతూరి అభివృద్ధికి చిత్తర్వు కుటుంబీకుల సంకల్పం







