ఖతార్‌లో ఊపందుకుంటున్న సినీ పరిశ్రమ..!!

- November 27, 2026 , by Maagulf
ఖతార్‌లో ఊపందుకుంటున్న సినీ పరిశ్రమ..!!
దోహా: ఖతార్‌లో సినీ పరిశ్రమ గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందని దోహా ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ (DFI) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫాత్మా హసన్ అల్ రుమైహీ తెలిపారు. స్థానిక సినీ ప్రతిభను ప్రోత్సహించడం, సినిమా నిర్మాణ అవకాశాలను విస్తరించడం, అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయడం ద్వారా పరిశ్రమను మరింత ముందుకు తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు.
 
దోహా ఫిల్మ్ ఫెస్టివల్ 2026 సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత 16 ఏళ్లుగా ఖతార్‌లో స్థిరమైన సినీ పరిశ్రమ అభివృద్ధికి దోహా ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ కృషి చేస్తోందని చెప్పారు. ఈ ఏడాది ఫెస్టివల్‌లో 'మేడ్ ఇన్ ఖతార్' విభాగంలో 8 సినిమాలు ప్రదర్శనకు ఎంపికయ్యాయని తెలిపారు. వీటితో పాటు ఖతార్‌లో నిర్మించిన, ఖతారీ దర్శకులు రూపొందించిన 4 పూర్తి నిడివి చిత్రాలు కూడా ప్రదర్శనకు వచ్చాయని పేర్కొన్నారు.
 
ఖతార్ సినీ పరిశ్రమ సరైన దిశలోనే పయనిస్తోందని, అయితే ఆశించిన స్థాయికి చేరుకోవడానికి ఇంకా సమయం పడుతుందని ఫాత్మా అల్ రుమైహీ అన్నారు. స్థానికంగా, అంతర్జాతీయంగా సినిమా నిర్మాణాలు పెరుగుతుండటం పరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతోందని చెప్పారు. కొత్తగా సినీ రంగంలోకి వచ్చే వారికి శిక్షణ, వృత్తిపరమైన నైపుణ్యాల అభివృద్ధికి అవకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు.
 
ఒక సినిమా నిర్మాణం పూర్తి కావడానికి కొన్నేళ్లు పట్టవచ్చని, చివరకు షార్ట్ ఫిల్మ్‌ల నిర్మాణంలోనూ అనేక సవాళ్లు ఉంటాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా DFI డిప్యూటీ సీఈఓ అబ్దుల్లా అల్ ముసల్లం మాట్లాడుతూ.. ఈ ఏడాది ఫిల్మ్ ఫెస్టివల్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని తెలిపారు. గల్ఫ్ సినిమా, క్లాసిక్ సినిమాల కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రవేశపెట్టడం ద్వారా ప్రేక్షకులకు విభిన్నమైన సినీ అనుభవాలను అందిస్తున్నట్లు చెప్పారు.
 
'ది బ్యాటిల్ ఆఫ్ అల్జీర్స్' వంటి ప్రముఖ చిత్రాల ప్రదర్శనకు మంచి ఆదరణ లభించిందని పేర్కొన్నారు. పాత గొప్ప సినిమాలను పునరుద్ధరించి, నేటి ప్రేక్షకులకు అందించే కార్యక్రమాలపైనా సంస్థ దృష్టి సారిస్తోందని వెల్లడించారు. మరోవైపు, మజెద్ అల్ రుమైహీ మాట్లాడుతూ.. మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, గ్లోబల్ సౌత్ ప్రాంతాల నుంచి వినూత్నమైన కథలు, విభిన్నమైన సినీ ప్రతిభను వెలుగులోకి తీసుకురావడమే ఫెస్టివల్ లక్ష్యమని తెలిపారు. అయితే దీనివల్ల యూరప్, పాశ్చాత్య దేశాల సినిమాలను పక్కనపెట్టడం లేదని స్పష్టం చేశారు. భౌగోళిక ప్రాంతాల కంటే సినిమా కళాత్మక విలువ, ఫెస్టివల్ లక్ష్యాలకు అనుగుణంగా ఉందా అనే అంశాల ఆధారంగా చిత్రాలను ఎంపిక చేస్తున్నట్లు వివరించారు.
 
ఈ విధానం ఫిల్మ్ ఫెస్టివల్‌కే పరిమితం కాకుండా DFI గ్రాంట్ కార్యక్రమాలు, ప్రతిష్ఠాత్మక 'ఖుమ్రా' చొరవతో పాటు ఏడాది పొడవునా నిర్వహించే ఇతర కార్యక్రమాల్లోనూ కొనసాగుతోందని చెప్పారు. ప్రస్తుతం ఇన్‌స్టిట్యూట్‌కు సుమారు 2,000 సినిమా ఎంట్రీలు వస్తున్నాయని, వాటిని పరిశీలించి నాణ్యమైన చిత్రాలను ఎంపిక చేయడం సవాలుగా మారుతోందని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో అవసరమైన వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటే పూర్తి నిడివి సినిమాలకూ ఓపెన్ సబ్మిషన్లను విస్తరించే అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com