సౌదీలో వారం రోజుల్లో 9,169 మంది అరెస్ట్..!!
- November 29, 2026
రియాద్: సౌదీ అరేబియాలో నివాస, కార్మిక, సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన 9,169 మందిని అధికారులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా వారం రోజులపాటు నిర్వహించిన సంయుక్త భద్రతా తనిఖీల్లో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అరెస్టయిన వారిలో 4,797 మంది నివాస నిబంధనలు ఉల్లంఘించినవారు కాగా, 2,623 మంది సరిహద్దు భద్రతా నిబంధనలు, 1,749 మంది కార్మిక చట్టాలను ఉల్లంఘించినవారు ఉన్నారు.
అలాగే అక్రమంగా సౌదీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన 1,373 మందిని, సరిహద్దులు దాటి అక్రమంగా దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించిన మరో 21 మందిని అధికారులు పట్టుకున్నారు. అక్రమ వలసదారులకు రవాణా సౌకర్యం కల్పించడం, ఆశ్రయం ఇవ్వడం, ఉద్యోగాలు కల్పించడం, దాచిపెట్టడం వంటి చర్యలకు పాల్పడిన 23 మందిని కూడా అరెస్టు చేశారు.
38,483 మంది ప్రవాసులపై చర్యలు
సౌదీ చట్టాలను ఉల్లంఘించిన మొత్తం 38,483 మంది ప్రవాసులపై ప్రస్తుతం చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో 36,378 మంది పురుషులు, 2,105 మంది మహిళలు ఉన్నారు. వారిలో 24,022 మందిని ప్రయాణ పత్రాలు పొందేందుకు సంబంధిత అధికారులకు పంపించారు. మరో 8,840 మందికి ప్రయాణ టికెట్ల బుకింగ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 13,935 మందిని దేశం నుంచి బహిష్కరించారు.
భారీ జరిమానాలు
సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించి దేశంలోకి ప్రవేశించే వారికి సహకరించడం, దేశంలో రవాణా చేయడం, ఆశ్రయం కల్పించడం లేదా ఎలాంటి సహాయం, సేవలు అందించినా కఠిన చర్యలు తప్పవని హోం శాఖ హెచ్చరించింది. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారికి గరిష్ఠంగా 15 ఏళ్ల జైలు శిక్షతో పాటు SR1 మిలియన్ వరకు జరిమానా విధించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
నేరాలకు ఉపయోగించిన వాహనాలు, అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించిన భవనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితుల పేర్లను బహిరంగంగా ప్రకటించే చర్యలు కూడా ఉంటాయని తెలిపింది. ఈ నేరాలను తీవ్రమైన నేరాలుగా పరిగణించి నిందితులను నిర్బంధంలో ఉంచుతామని, ఇవి గౌరవానికి భంగం కలిగించే, నమ్మకద్రోహానికి సంబంధించిన నేరాలుగా కూడా పరిగణించబడతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ప్రజలకు హోం శాఖ విజ్ఞప్తి
నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని ప్రజలను కోరింది. మక్కా, మదీనా, రియాద్, తూర్పు ప్రాంతాల్లో 911 నంబర్‌కు, మిగిలిన ప్రాంతాల్లో 999 లేదా 996 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించింది. ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తిగా రహస్యంగా ఉంచుతామని, సమాచారం అందించిన వారిపై ఎలాంటి బాధ్యత లేదా చట్టపరమైన ఇబ్బందులు ఉండవని మంత్రిత్వ శాఖ భరోసా ఇచ్చింది.
తాజా వార్తలు
- ఖతార్ లో పిల్లల డిజిటల్ భద్రతపై పేరెంట్స్ కు కీలక సూచనలు..!!
- సౌదీలో వారం రోజుల్లో 9,169 మంది అరెస్ట్..!!
- డిసెంబర్ 5 నుంచి బహ్రెయిన్ రైతుల మార్కెట్ సీజన్ ప్రారంభం..!!
- ఒమన్ జాతీయ దినోత్సవ సెలవుల్లో సందడే సందడి..!!
- బిగ్ టికెట్ లక్కీ డ్రా.. నలుగురు భారతీయ ప్రవాసులకు తలా Dh25,000..!!
- డిజిటల్ యుగంలోనూ పుస్తకాలపై Gen Z, Gen Alpha ఆసక్తి..!!
- వందే భారత్ స్లీపర్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 55th Eid Al Etihad Team announces nationwide celebration venues
- బహ్రెయిన్‌లో ఫుడ్ ట్రక్కుల వ్యాపారంపై కొత్త చట్టం..!!
- దోహా మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్..!!







