ఒమన్ జాతీయ దినోత్సవ సెలవుల్లో సందడే సందడి..!!
- November 29, 2026
మస్కట్: ఒమన్ జాతీయ దినోత్సవం సందర్భంగా వరుసగా నాలుగు రోజుల సెలవులు రావడంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఉత్సాహంగా గడిపారు. క్యాంపింగ్, బీచ్ సందర్శనలు, పిక్నిక్లు, సంగీత కార్యక్రమాలు, సాంస్కృతిక ఉత్సవాలతో కుటుంబాలు, స్నేహితులు సందడి చేశారు. నవంబర్ 25 బుధవారం నుంచి నవంబర్ 28 శనివారం వరకు సెలవులు ఉండటంతో ప్రజలు వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. సముద్ర తీర ప్రాంతాలు సందర్శకులతో కళకళలాడాయి. కొందరు కుటుంబాలతో కలిసి బీచ్‌లకు వెళ్లగా, మరికొందరు ప్రకృతి అందాల మధ్య క్యాంపింగ్ చేస్తూ సెలవులను ఆస్వాదించారు. పర్యాటక ప్రాంతాలు, వినోద కేంద్రాల్లోనూ సందర్శకుల రద్దీ కనిపించింది.
మస్కట్‌లో ప్రత్యేక వేడుకలు
మస్కట్‌లోని అల్ సహ్వా పార్క్ జాతీయ దినోత్సవ వేడుకలకు ప్రధాన వేదికగా నిలిచింది. నవంబర్ 26 నుంచి 28 వరకు మూడు రాత్రులపాటు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించారు. సంప్రదాయ వారసత్వ కళలు, హస్తకళా వస్తువులు, స్థానిక ఆహార పదార్థాలు, విక్రయ స్టాళ్లతో పాటు వినోద కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.
ముత్రా కోటలో కళలు, సంగీతం, ఆటలు, వారసత్వ కార్యక్రమాలు నిర్వహించారు. చారిత్రక కట్టడం నేపథ్యంలో జరిగిన ఈ వేడుకలు పర్యాటకులు, కుటుంబాలకు ప్రత్యేక అనుభూతిని అందించాయి. అల్ ఖువైర్ స్క్వేర్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు, స్కౌట్స్ ప్రదర్శనలు, గాన బృందాల ప్రదర్శనలు, వినోద కార్యక్రమాలు జరిగాయి. రాజధాని వెలుపల నిజ్వా కోటలో నవంబర్ 25 నుంచి 28 వరకు జానపద కళలు, సంప్రదాయ ప్రదర్శనలు, వారసత్వ కార్యక్రమాలు, పిల్లలు, కుటుంబాల కోసం ప్రత్యేక వినోద కార్యక్రమాలు నిర్వహించారు.
అల్ బురైమీలో అల్ బురైమీ వింటర్ సందడి
అల్ బురైమీ ఒయాసిస్‌లో నాలుగో ఎడిషన్ అల్ బురైమీ వింటర్ సీజన్లో భాగంగా జాతీయ దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. నాలుగు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమాల్లో సంగీత ప్రదర్శనలు, వివిధ వయసుల వారికి వినోద కార్యక్రమాలు, స్థానిక ఉత్పత్తులు తయారు చేసే కుటుంబాల కోసం ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేశారు.
ప్రారంభ వేడుకల్లో స్కౌట్ బ్యాండ్ ప్రదర్శన అనంతరం గాయకుడు హామెద్ సుహైల్ సంగీత కార్యక్రమం నిర్వహించారు. దీనికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. గాలిపటాల ఎగురవేత కార్యక్రమంతో పాటు గాయని అమల్ అల్ ఒబైదానీ, వయొలిన్ కళాకారుడు ఇబ్రహీం అల్ బలూషీ సంగీత ప్రదర్శన కూడా ఆకట్టుకుంది.
అలాగే ఇంటరాక్టివ్ కార్యక్రమాలు, పోటీలు, బహుమతుల పంపిణీతో పాటు మరో రెండు సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమాల ద్వారా జాతీయ, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు స్థానిక ఉత్పత్తిదారులైన కుటుంబాలకు తమ వస్తువులను విక్రయించుకునే అవకాశాలు కల్పించామని అల్ బురైమీ మున్సిపాలిటీ డైరెక్టర్ జనరల్ ఇంజినీర్ మూసా బిన్ సయీద్ అల్ అబ్రీ తెలిపారు.
35 కుటుంబాలకు వ్యాపార అవకాశాలు
అల్ బురైమీలో నిర్వహించిన 'ఫ్రమ్ హోమ్' ప్రదర్శనలో 35 ఉత్పత్తిదారుల కుటుంబాలు పాల్గొన్నాయి. అల్ బురైమీ, మహ్దా, అల్ సునైనా ప్రాంతాల్లోని ఒమానీ మహిళా సంఘాల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గృహ ఆధారిత వ్యాపారాలు నిర్వహిస్తున్న కుటుంబాలు తమ ఉత్పత్తులను ప్రదర్శించి, నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే అవకాశం కల్పించారు. స్థానికంగా తయారైన హస్తకళా వస్తువులు, ఇతర ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- ఒమన్ జాతీయ దినోత్సవ సెలవుల్లో సందడే సందడి..!!
- బిగ్ టికెట్ లక్కీ డ్రా.. నలుగురు భారతీయ ప్రవాసులకు తలా Dh25,000..!!
- డిజిటల్ యుగంలోనూ పుస్తకాలపై Gen Z, Gen Alpha ఆసక్తి..!!
- వందే భారత్ స్లీపర్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 55th Eid Al Etihad Team announces nationwide celebration venues
- బహ్రెయిన్‌లో ఫుడ్ ట్రక్కుల వ్యాపారంపై కొత్త చట్టం..!!
- దోహా మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్..!!
- ఇరాన్ దాడిలో గాయపడిన వారికి పరామర్శించిన రక్షణ మంత్రి..!!
- ధోఫర్ గవర్నరేట్‌లో అత్యవసర వైద్య తరలింపు ఆపరేషన్..!!
- సౌదీ, టర్కీ రక్షణ మంత్రుల మధ్య కీలక చర్చలు..!!







