డిజిటల్ యుగంలోనూ పుస్తకాలపై Gen Z, Gen Alpha ఆసక్తి..!!

- November 29, 2026 , by Maagulf
డిజిటల్ యుగంలోనూ పుస్తకాలపై Gen Z, Gen Alpha ఆసక్తి..!!

కువైట్: స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా, డిజిటల్ స్క్రీన్లకు ఎక్కువ సమయం కేటాయించే Gen Z, Gen Alpha తరాల యువత ఇప్పుడు ముద్రిత పుస్తకాల వైపు ఆసక్తి చూపుతున్నారు. కువైట్‌లో జరుగుతున్న 49వ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో ఇంగ్లీష్ పుస్తకాల స్టాళ్ల వద్ద యువత పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. అనంతరం అరబిక్ ప్రచురణకర్తల స్టాళ్లను కూడా సందర్శిస్తున్నారు. శనివారంతో ఈ పుస్తక ప్రదర్శన ముగియనుంది. పుస్తక ప్రదర్శన డైరెక్టర్ ఖలీఫా అల్ రబా KUNA వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ఈ ఫెయిర్ కుటుంబ సభ్యులందరికీ అనువైన వేదికగా నిలుస్తోందన్నారు. తల్లిదండ్రులతో పాటు పిల్లలకు నచ్చే పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 

ఈ ఏడాది పాల్గొన్న కువైట్ ప్రచురణ సంస్థల సంఖ్య 14.3 శాతం పెరిగిందని, గతంలో సుమారు 70 సంస్థలు ఉండగా ఈసారి 80కు చేరాయని వెల్లడించారు. మొత్తంగా 34 దేశాలకు చెందిన 594 మంది ప్రదర్శకులు పాల్గొనగా, వారిలో 380 మంది ప్రైవేట్ ప్రచురణకర్తలు ఉన్నారు. సందర్శకుల సంఖ్యకు సంబంధించిన గణాంకాలను ప్రదర్శన ముగిసిన తర్వాత ప్రకటించనున్నారు.

విద్యార్థుల్లో పఠన అలవాటుకు ప్రోత్సాహం

కువైట్ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన లైబ్రరీల డైరెక్టర్ అహ్మద్ అల్ మజ్దీ మాట్లాడుతూ.. గల్ఫ్ డిజిటల్ ఎడ్యుకేషనల్ లైబ్రరీని మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌కు అనుసంధానించినట్లు తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పరిశోధకుల కోసం లైబ్రరీల్లోని 1,417 సమాచార వనరులను డిజిటలైజ్ చేసినట్లు వెల్లడించారు. పాఠశాలలు, కిండర్ గార్టెన్లలో ఉచిత పఠన సమయాలను అమలు చేయాలని అక్టోబర్‌లో సర్క్యులర్ జారీ చేసినట్లు చెప్పారు.

 విద్యార్థులకు పుస్తక పఠనంపై ఆసక్తి పెంచేందుకు పాఠశాలల నుంచి బుక్‌ఫెయిర్ సందర్శనలను కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ కువైట్‌లో సాహిత్యం చదువుతున్న యూసుఫ్ మొహమ్మద్ మాట్లాడుతూ, ఐన్‌స్టీన్ రచనలు, క్లాసిక్ సాహిత్య పుస్తకాలను చదవడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. తన తోటి విద్యార్థుల్లో చాలామందికి ఇంగ్లీష్ కవిత్వం, నవలలపై ఆసక్తి ఉందన్నారు.

విదేశీ పుస్తకాల ధరలు తక్కువ

పుస్తకాల ముద్రణ ఖర్చులు కూడా విదేశీ పుస్తకాలపై పాఠకుల ఆసక్తికి ఒక కారణమని ప్రచురణకర్తలు చెబుతున్నారు. 15 నుంచి 29 ఏళ్ల వయసు పాఠకులను లక్ష్యంగా చేసుకున్న ప్రచురణ సంస్థ డైరెక్టర్ హమ్దాన్ అల్ జుబైరీ మాట్లాడుతూ, అరబిక్ పుస్తకాలను సాధారణంగా 1,000 నుంచి 3,000 కాపీల వరకు మాత్రమే ముద్రిస్తారని తెలిపారు. అదే విదేశీ పుస్తకాల ముద్రణ సంఖ్య 10,000 కాపీల వరకు ఉంటుందని వివరించారు.

ఎక్కువ సంఖ్యలో పుస్తకాలను ముద్రించడం వల్ల ఒక్కో పుస్తకంపై ఉత్పత్తి ఖర్చు తగ్గుతుందని, తద్వారా డిజైన్‌పై ఎక్కువ పెట్టుబడి పెట్టడంతో పాటు ధరలను కూడా పోటీ స్థాయిలో ఉంచవచ్చని చెప్పారు. సౌదీ ప్రచురణ సంస్థ స్టాల్ నిర్వహిస్తున్న అహ్మద్ ఖాలెద్ మాట్లాడుతూ.. విదేశీ పుస్తకాలకు అధిక ఉత్పత్తి బడ్జెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అయితే అరబిక్ స్టాళ్లతో పోలిస్తే విదేశీ ప్రచురణకర్తల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల అక్కడ సందర్శకుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుండవచ్చని అభిప్రాయపడ్డారు. డిజిటల్ ప్రపంచంలో పెరిగిన యువత కూడా పుస్తక పఠనంపై ఆసక్తి చూపుతుండటం కువైట్ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com