ఘనంగా ముగిసిన 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2026

- November 29, 2026 , by Maagulf
ఘనంగా ముగిసిన 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2026

ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో సత్తా చాటాలని క్రీడాకారులకు డీజీపీ సీవీ ఆనంద్ పిలుపు

నిజామాబాద్: తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జంకంపేటలో నిర్వహించిన 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2026 ఘనంగా ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రీడా పోటీల ద్వారా పోలీసు సిబ్బందిలో స్నేహభావం, పోటీతత్వం, సమిష్టి సహకారం మరింత బలపడతాయని ఆయన పేర్కొన్నారు.

ఈ ఏడాది నిర్వహించిన క్రీడా పోటీల్లో కీలక మార్పులు తీసుకొచ్చినట్లు డీజీపీ తెలిపారు. ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ క్యాలెండర్‌కు అనుగుణంగా ఐదు క్లస్టర్లుగా విభజించి పోటీలు నిర్వహించడం ఈసారి ప్రత్యేకతగా నిలిచిందన్నారు. ఈ నూతన విధానం కారణంగా గత ఏడాదితో పోలిస్తే పాల్గొన్న వారి సంఖ్య దాదాపు రెట్టింపైందని వెల్లడించారు.

రాబోయే ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో తెలంగాణ పోలీస్ క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. క్రీడా పోటీలు, డ్యూటీ మీట్లు, పోలీస్ బ్యాండ్లు, మౌంటెడ్ యూనిట్లు పోలీస్ శాఖ గర్వించదగిన వారసత్వంలో అంతర్భాగమని డీజీపీ పేర్కొన్నారు.

అనంతరం వివిధ క్రీడా విభాగాల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు డీజీపీ బహుమతులు, పతకాలను అందజేశారు. అలాగే ఆల్ ఇండియా బ్యాండ్ కాంపిటీషన్-2026లో రజత పతకం సాధించిన తెలంగాణ పోలీస్ బ్యాండ్ బృందానికి ప్రత్యేకంగా రూ.1 లక్ష నగదు బహుమతిని ప్రకటించారు.

పోలీసు సిబ్బందిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శాఖలో ఐక్యత, సమన్వయం, ప్రతిభను ప్రోత్సహించే దిశగా ఈ క్రీడా పోటీలు విజయవంతంగా ముగిశాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com