ఇక ఎయిర్ పోర్ట్ లలో క్యూలు కట్టనవసరం లేదు.!

- September 02, 2016 , by Maagulf
ఇక ఎయిర్ పోర్ట్ లలో క్యూలు కట్టనవసరం లేదు.!

విమాన ప్రయాణమంటే.. ట్యాక్సీలోనో, ప్రత్యేక బస్సులోనో ఎయిర్ పోర్టుకు వెళ్లి, నడుచుకుంటూ లాంజ్ లోకి వెళ్లి, కాసేపు క్యూలో నిలబడి, చెక్ఇన్ అయి.. విమానంలోకి వెళ్లి సీట్లో కూర్చున్నాక గానీ కాస్త రిలాక్సేషన్ దొరకదు. అయితే ఇప్పుడీ సుదీర్ఘ నడక ప్రక్రియకు స్వస్తి పలకాల్సిన సమయం వచ్చింది. ఎంచక్కా కారులో నుంచి నేరుగా విమానంలోకి ఎక్కేయొచ్చు. ఒక్క కారేంటి? బస్సు, రైలు.. ఎందులో నుంచైనా సరాసరి విమానంలోకి వెళ్లిపోవచ్చు. ఎలాగంటారా?

'క్లిప్ ఎయిర్' పేరుతో స్విట్జర్లాండ్ పరిశోధకులు తయారుచేసిన ఆధునిక ప్రయాణవిధానంతో! ఆ దేశానికి చెందిన ఫెడరల్ పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్ ఈ విధానాన్ని రూపొందించింది.

భారీ క్యాప్సుల్స్ ఆకారంలో ఉండే పాడ్ ప్యానెల్స్ లోకి మనం నేరుగా కార్లలో వెళ్లిపోవచ్చు. హైడ్రాలిక్స్ సాయంతో ఈ ప్యానెల్స్ ను విమాన ప్రధాన భాగానికి అనుసంధానం చేస్తారు. రైల్వే బోగీల మాదిరిగానూ పాడ్ ప్యానెల్స్ ను తయారుచేశారు. ఒక్కో క్యాప్సూల్‌లో 150 మంది కూర్చోవచ్చునని, అవసరాన్ని బట్టి ఒక్కో విమానం మూడు క్యాప్సూల్స్‌ను మోసుకెళ్లగలదని రూపకర్తలు చెబుతున్నారు. ఒకటే క్యాప్సూల్ ఉంటే చిన్న విమానాన్ని, ఎక్కువ ఉంటే పెద్ద విమానాన్ని వినియోగిస్తామని, ఏకకాలంలో ప్రయాణికులను, సరుకులను కూడా మోసుకెళ్లవచ్చని పేర్కొన్నారు. 

క్యాప్సుల్స్ లో విమానాలకు సంబంధించిన కాక్‌పిట్, ల్యాండింగ్ గేర్ వంటివి ఏవీ ఉండవు కాబట్టి వీటి నిర్మాణ వ్యయమూ తక్కువగానే ఉంటుందన్నమాట. రెండు నెలల క్రితం ప్యారిస్‌లో జరిగిన ఓ ప్రదర్శనలో క్లిప్ ఎయిర్ కాన్సెప్ట్‌కు మంచి మద్దతు లభించింది. ఈ నేపథ్యంలో తాము త్వరలోనే కొంచెం చిన్నసైజు క్లిప్ ఎయిర్ విమానాన్ని తయారు చేస్తామని ఈపీఎఫ్‌ఎల్ ప్రతినిది లియోనార్డీ అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com