భారీ వర్షానికి రెక్కలు తెగిన హైదరాబాద్ 'ట్రాఫిక్'
- September 16, 2016
మహానగరానికి బ్రేక్ పడింది! జంక్షన్లన్నీ జామ్ అయ్యాయి. హైదరాబాద్ చరిత్రలో మొదటిసారిగా ట్రాఫిక్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చింది. శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో నగరం అతలాకుతలమైంది. చెరువులను తలపించిన రహదారులు, పొంగిపొర్లిన నాలాలు, అడుగడుగునా గుంతలతో వాహనదారులు రోడ్లపై నరకం చూశారు. కిలోమీటరు ప్రయాణానికే ఏకంగా మూడు గంటల సమయం పట్టింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి అర్ధరాత్రి వరకు వాహనదారులు రోడ్లపైనే ఉండిపోయారు. నగర చరిత్రలో ఇంత భారీ ట్రాఫిక్ జామ్ ఎప్పుడూ చూడలేదని అధికారులే వ్యాఖ్యానించారు.పరిస్థితి దారుణంగా మారడంతో నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి ట్రాఫిక్ ఎమర్జెన్సీ ప్రకటించారు. పోలీసు శాఖలోని అన్ని స్థాయిల అధికారులు, సిబ్బంది రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ఆదేశించారు. ఇన్స్పెక్టర్ నుంచి డీసీపీ వరకు ప్రతి ఒక్కరూ రోడ్లపైకి వచ్చి విధులు నిర్వహించాలని కోరారు. ట్రాఫిక్ క్లియర్ అయ్యేదాకా డ్యూటీ కొనసాగించాలన్నారు.
స్తంభించిన జనజీవనం : నగరంలో వరుసగా ఆరు రోజులుగా కురుస్తోన్న కుండపోత వర్షంతో జనజీవనం స్తంభించింది. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు అత్యధికంగా బాలానగర్‌లో అత్యధికంగా 6.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నగరవ్యాప్తంగా సగటున 6 సెం.మీ. వర్షం కురిసింది. ఆబిడ్స్, కోఠి, నాంపల్లి, ఖైరతాబాద్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, సికింద్రాబాద్, మలక్‌పేట్, మెహిదీపట్నం, మాదాపూర్, లక్డీకాపూల్, చార్మినార్, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, రాజేంద్రనగర్, హైదర్షాకోట్, కిస్మత్పూర్, గోషామహల్, ధూల్‌పేట్ ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై నడుము లోతు వరదనీరు పోటెత్తింది. సుమారు వంద జంక్షన్ల వద్ద ట్రాఫిక్ స్తంభించింది.సాయంత్రం కార్యాలయాలు, విద్యాసంస్థల నుంచి బయటికి వచ్చిన ఉద్యోగులు, విద్యార్థులు నాలుగు నుంచి ఐదు గంటలపాటు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకొని విలవిల్లాడారు. పీవీ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ వర్షానికి రహదారి కనిపించక నాలుగు కార్లు ఒకదాని వెనక మరొకటి ఢీకొన్నాయి. ఇందులో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మీరాలం చెరువు ఉప్పొంగి వరదనీరు ప్రవేశించడంతో జూపార్క్‌కు శనివారం సెలవు ప్రకటించారు. సుమారు వంద లోతట్టు ప్రాంతాల బస్తీలు నీటమునిగినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల్లోకి ప్రవాహాలు పెరుగుతుండడంతో నీటిమట్టాలు ఐదు అడుగుల మేర పెరిగాయి.
జిల్లాల్లో వానలే వానలు..
జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో మూడ్రోజులుగా కురుస్తున్న వానలతో చెరువులు, కుంటలు అలుగెత్తాయి. మెదక్ జిల్లాలో శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సిద్దిపేట డివిజన్ లో అత్యధికంగా 3.2 సెం.మీ. వర్షం కురిసింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు తూప్రాన్ మండలంలో అత్యధికంగా 13.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. సింగూరులోకి వర్షం నీరు వచ్చి చేరుతోంది. మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ వర్షానికి గద్వాల, కొల్లాపూర్, అలంపూర్, మక్తల్, కొడంగల్, కల్వకుర్తి ప్రాంతాల్లో పత్తి, మొక్కజొన్న, జొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గద్వాల ప్రాంతంలో సీడ్ పత్తి అనేక హెక్టార్లలో మునిగిపోయింది. జిల్లావ్యాప్తంగా 900 ఎకరాల పంటలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. కరీంనగర్ జిల్లాలో గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు 2 సెం.మీ. సగటు వర్షపాతం నమోదరుుంది. మహాముత్తారంలో అత్యధికంగా 6.9 సెం.మీ. వర్షం కురిసింది.రైళ్ల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి: జీఎం భారీ వర్షాల దృష్ట్యా రైళ్ల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా సూచిం చారు. శుక్రవారం రైల్ నిల యంలో జరిగిన డివిజనల్ రైల్వే మేనేజర్ల సమావేశంలో భద్రతాపరమైన అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. అన్ని కాపాలా ఉన్న, కాపలా లేని గేట్ల వద్ద తరచుగా తనిఖీలు నిర్వహించాలని, రైళ్ల మరమ్మతులకు కావలసిన విడిభాగాలను నిల్వ ఉంచుకోవాలని చెప్పారు. సమయానుకూలంగా చేపట్టాల్సిన భద్రతాకార్యక్రమాలను కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో అదనపు జనరల్ మేనేజర్ ఏకే గుప్తా, ప్రిన్సిపాల్ చీఫ్ ఇంజనీర్ ఎస్ఎన్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.
'లేక్'వ్యూ..
ఇది లేక్‌వ్యూ గెస్ట్ హౌస్ రోడ్డు.. శుక్రవారం నగరంలోని ప్రతిరోడ్డూ 'లేక్'వ్యూ(చెరువు)నే తలపించింది.. నడుం లోతు నీళ్ల మధ్య నగరవాసి దాదాపు ఈదుతూనే ఇంటికి చేరుకున్నాడు..
హై'డొక్కు' రోడ్డు..
ఇది హైటెక్ సిటీ ప్రాంతంలోని మాదాపూర్ ప్రధాన రహదారి స్థితి. అక్కడ నడుం లోతు నీళ్లతో ఇబ్బంది పడితే.. ఇక్కడేమో నడుం విరగ్గొట్టుకునే పరిస్థితి.. గుంతల మధ్య రోడ్డు వెతుక్కునే దుస్థితి.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్‌కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







