యెమెన్‌లో వైమానిక దాడులు, బాంబు పేలుళ్లతో ప్రజాజీవనం అస్తవ్యస్తం..

- September 18, 2016 , by Maagulf
యెమెన్‌లో  వైమానిక దాడులు, బాంబు పేలుళ్లతో ప్రజాజీవనం అస్తవ్యస్తం..

యెమెన్‌లో ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారింది. వైమానిక దాడులు, బాంబు పేలుళ్లతో ఆ ప్రాంత ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మాజీ అధ్యక్షుడు అలీ అబ్దుల్లా సాలెV్‌ా మద్దతుదారులతో పాటు షీత్‌ తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకుని సౌదీ సంకీర్ణదళాలు గతేడాది మార్చి25 నుంచి వైమానిక దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. సౌదీ నేతృత్వం వహిస్తున్న ప్రత్యేక ఆపరేషన్‌లో లక్షా50 వేల మంది సైనికులు పాల్గొంటున్నారు. కువైట్‌, బహ్రెయిన్‌, ఖతార్‌, సుడాన్‌, ఈజిప్ట్‌ దేశాలు అరేబియన్‌ కింగ్‌డమ్‌కు మద్దతుగా నిలిచాయి.

సైనిక సహకారంతో పాటు యుద్ధ విమానాలు, క్షిపణులు, ఆయుధ సామాగ్రిని అందజేస్తున్నాయి. మొరాకో, జోర్డాన్‌లు సౌదీ సంకీర్ణదళాలకు పరోక్షంగా సహకరిస్తున్నాయి. వైమానిక దాడుల నిర్వహణకు అవసరమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అమెరికా సమకూర్చుతోందని వైట్‌హౌజ్‌ అధికార ప్రతినిధి ఎరిక్‌ స్కల్జ్‌ వెల్లడించారు. 
యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల శిబిరాలు, క్షిపణి స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సౌదీ సంకీర్ణ దళాలు జరిపిన దాడుల్లో సామాన్య ప్రజలు దుర్మరణం పాలవుతున్నారని గార్డియన్‌ తాజా సర్వేలో వెల్లడించింది. సౌదీ దాడుల్లో మూడింట ఒక భాగం ఆస్పత్రులు, పాఠశాలలు, మసీదులపై జరిగినట్టు ఆధారాలు సేకరించినట్టు తెలిపింది. కాగా, సౌదీ అరేబియా మాత్రం గార్డియన్‌ రిపోర్ట్‌ను తప్పుపడుతోంది. 
వైమానిక దాడులకు సంబంధించిన వివరాలను యెమెన్‌ డాటా ప్రాజెక్టు సంస్థ నుంచి సేకరించినట్టు గార్డియన్‌ పేర్కొంది. దానిలోని వివరాల ప్రకారం...సౌదీ సంకీర్ణదళాలు యెమెన్‌లో గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు 8,600 వైమానిక దాడులు నిర్వహించాయి. వాటిలో కేవలం 3,577 దాడులు మాత్రమే తిరుగుబాటుదారుల శిబిరాలను లక్ష్యంగా చేసుకొని జరిగాయి. అంతేగాకుండా, యెమెన్‌లోని ఎన్‌జీవో సంస్థలు అందించిన వివరాల ప్రకారం... 942 వైమానిక దాడులు పౌరుల ఇళ్లపై జరిగాయి. సౌదీ సంకీర్ణదళాలు పాఠశాలలు, ఆస్పత్రులు, మసీదులపై వైమానిక దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో 147 పాఠశాలలు, 26 విశ్వవిద్యాలయాలు, 34 మసీదులు దెబ్బతిన్నాయి. అంతేగాకుండా, సౌదీ బలగాలు ప్రజా రవాణా వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రయత్నించాయని గార్డియన్‌ పేర్కొంది. సౌదీ సంకీర్ణదళాలు జరిపిన దాడుల్లో రద్దీగా ఉండే 114 మార్కెట్లు ధ్వంసమయ్యాయి. ఒకే పాఠశాలపై తొమ్మిదిసార్లు వైమానిక దాడులు జరిగినట్టు యెమెన్‌ డాటా ప్రాజెక్టు వెల్లడించింది. అంతేగాకుండా, మరో మార్కెట్‌పై 24 సార్లు దాడులు జరిగాయని తెలిపింది. సౌదీ సంకీర్ణదళాలు పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నాయని గార్డియన్‌ విడుదల చేసిన నివేదికను సౌదీ విదేశాంగ మంత్రి ఆదెల్‌ అల్‌జుబేర్‌ ఖండించారు. హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్‌లో హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారని చెప్పారు. అంతేగాకుండా, పాఠశాలలు, ఆస్పత్రులను తమ స్థావరాలుగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ క్రమంలో స్కూళ్లు, మసీదులు, రద్దీ ప్రాంతాల్లో వైమానిక దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. పౌర జీవనానికి విఘాతం కల్గించే ఉద్దేశం సౌదీ సంకీర్ణదళాలలకు లేదన్నారు. యెమెన్‌లో చొరబాటుకు ప్రయత్నిస్తున్న తిరుగు బాటుదారులను తరిమివేసేందుకు వైమానిక దాడులు కొనసాగిస్తామని ఆదెల్‌ పునరుద్ఘాటించారు. ఇదిలా ఉండగా, సౌదీ సంకీర్ణదళాలకు ఆయుధాల సరఫరా నిలిపివేయాలని బ్రిటన్‌ ఇంటర్నేషనల్‌ అండ్‌ బిజినెస్‌ కమిటీని కోరినట్టు గార్డియన్‌ ప్రకటించింది. యెమెన్‌లో వైమానిక దాడులు ప్రారంభమైనప్పుడు సౌదీ 3.7 మిలియన్‌ డాలర్ల (రూ.24,81,77,315) విలువైన ఆయుధాలను లండన్‌ నుంచి కొనుగోలు చేసిందని తెలిపింది. సౌదీ అరేబియా చర్యలతో అంతర్జాతీయ మానవ హక్కులకు విఘాతం వాటిల్లే ప్రమాదముందని అభి ప్రాయపడింది. సౌదీ సంకీర్ణదళాలకు తక్షణమే ఆయుధాల సరఫరా నిలిపివేయాలని 64 మంది అమెరికా ఎంపీలు కోరారు. ఈ మేరకు ఓ విజ్ఞాపన పత్రంపై సంతకాలు చేసి అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు అందజేసినట్టు గార్డియన్‌ ప్రకటించింది.
మన్సూర్‌ హాదీ గతేడాది మార్చిలో తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన సున్నీ ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి. దీంతో, హాదీకి తిరిగి అధికార పగ్గాలు దక్కాలని సౌదీ అరేబియా భావిస్తోంది. ఈమేరకు హాదీకి మద్దతుగా స్వదేశీ బలగాలను యెమెన్‌కు పంపింది. అక్కడి తిరుగు బాటుదారులపై ఒత్తిళ్లు పెంచింది. ఈనేపథ్యంలో సౌదీ సైన్యం గతేడాది వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 10వేల మంది మృతి చెందారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఐక్యరాజ్య సమితి సుదీర్ఘ శాంతి చర్చలు జరిపినప్పటికీ ఆ చర్చలు నిరాశాజనకంగా మారాయి. దీంతో, యెమెన్‌లో వైమానిక దాడులు తిరిగి ప్రారంభమయ్యాయి. సౌదీ సంకీర్ణదళాలకు మద్దతుగా పలుదేశాలు నిలిచాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com