పారని పన్నాగం.....
- September 30, 2016
రద్దుల పద్దులో శిఖరాగ్ర సమావేశం
భా రత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఐక్యరాజ్య సమితిలో చేసిన ప్రసంగంలో పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డారు. కశ్మీర్ తదితర చోట్ల పాక్ జోక్యాలు, ఆగడాలపై భారత్ ఎంత విసిగిపోయిందో ఆమె ప్రసంగం బట్టి అర్థమవుతోంది. ఉరీలో ఉగ్రవాద ముష్కరుల దాడిలో 19మంది సైనికులు హతమైనప్పటి నుంచి పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భారతీయులు రగిలిపోతున్నారు. మన సైనిక దళాలు కోరిన సమయంలో కోరినచోట పాక్‌ను ఎదురుదెబ్బ తీస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.
పాక్ తన దుందుడుకు చేష్టలను ఎంతకూ కట్టిపెట్టకపోవడంతో భారత్ సహనం నశిస్తోంది. పాకిస్థాన్ మీద ఏదో ఒక చర్య తీసుకోవాలని, ఆ దేశానికి ఇప్పటికైనా గట్టిగా బుద్ధిచెప్పాలని ప్రజలు కోరుకొంటున్నారు. బహుశా, ప్రజాభిమతాన్ని గ్రహించినందుకే కావచ్చు, ప్రభుత్వం తాజాగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాల మీద మెరుపు దాడులు జరిపించింది. భారత సైనిక దళాలు ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినట్లు, పలువురు ఉగ్రవాదులను హతమార్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. క్షేత్రస్థాయిలో ఏమి జరిగిందన్నది వెంటనే తెలియకపోవచ్చు. కానీ, పాక్ దుశ్చర్యలు హద్దు దాటాయనడంలో సందేహం లేదు, అందుకు తగు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఆ దేశం ఇప్పటికీ గ్రహించడం లేదు. ఏవో కొన్ని ప్రభుత్వేతర శక్తులు ఉరీపై దాడి చేసి ఉండొచ్చునని పాక్ బుకాయించింది. కానీ, ఈ దాడిపై ప్రపంచ దేశాలు మండిపడటంతో భారతదేశమే తన మీద తాను దాడి చేసుకొని ఉండొచ్చునని అడ్డగోలు భాష్యం చెప్పింది. మరైతే తీవ్రవాదులు పాక్ భూభాగం నుంచి ఉరీపై దాడి చేయడమేమిటని ప్రశ్నిస్తే సమాధానాన్ని దాటవేస్తోంది. ఈ పరిస్థితుల్లో దక్షిణాసియాలో పాక్‌ను పూర్తిగా ఏకాకిని చేస్తూ తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు ఆ దేశానికి గుణపాఠం నేర్పేవిగా ఉన్నాయి. పాక్‌లో ఈ దఫా జరగాల్సిన 'సార్క్' సమావేశం నాలుగు సభ్యదేశాలు అందులో పాల్గొనేందుకు నిర్ద్వంద్వంగా తిరస్కరించడంతో ఉన్నపళంగా వాయిదా పడింది. పాక్‌కు ఇది చెంపపెట్టు!
ముప్పేట దాడి
యుద్ధానికి దిగడం ఎవరికీ మంచిది కాదు. అలాగని చర్చలతో సమస్యలు పరిష్కారమవుతాయా అంటే అదీ లేదు. పాక్ ఆగడాలతో విసిగిపోయిన భారత్ ఏదో ఒక సమయంలో ప్రతిచర్యకు దిగే అవకాశం ఉందని సుష్మా స్వరాజ్ ప్రసంగం ద్వారానే ముందస్తు సంకేతాలు అందాయి. పాక్‌తో చర్చలు జరిపి పరిష్కారం కనుగొనాలని అనుకోవడం వట్టి అడియాసే. ఉరీ ఘటన తరవాత భారత్ ఎలాంటి చర్య తీసుకొంటుందోనని ప్రపంచం వేయి కళ్లతో చూసింది. పాకిస్థాన్‌పై ఆర్థికంగా, దౌత్యపరంగా, నదీజలాల పరంగా ముప్పేట దాడి వ్యూహానికి భారత్ పదునుపెడుతోంది. ఈ సందర్భంగా సింధు జలాల ఒప్పందాన్ని తిరగదోడాలని భారత్ యోచించడం ఓ ముఖ్యమైన పరిణామం. సింధు, దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి 1960లో నాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాక్ సైన్యాధిపతి అయూబ్ ఖాన్ ఒప్పందం కుదుర్చుకున్నారు. పాక్‌ను సంప్రతించకుండా ఈ ఒప్పందాన్ని సవరించడం యుద్ధానికి దారి తీసే చర్య అని పాక్ విదేశాంగ శాఖ సలహాదారు సర్తాజ్ అజీజ్ వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందం నుంచి భారత్ ఏకపక్షంగా వైదొలగరాదని, అలా చేస్తే తాము అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే ఓ పాకిస్థానీ ప్రతినిధి వర్గం ప్రపంచ బ్యాంకును కలిసి ఒప్పందాన్ని పరిరక్షించాలని కోరింది. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతోనే సింధు జలాల ఒప్పందం కుదరడం ఇక్కడ గమనార్హం. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సింధు నదే జీవగర్ర. ఒప్పందం కింద భారతదేశం సింధు జలాలను 13 లక్షల ఎకరాలకు అందించే వీలున్నా, ఎనిమిది లక్షల ఎకరాలకే ఆ సదుపాయం ఉంది. ఈ జలాలతో 18,600 మెగావాట్ల విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నా, భారత్ 3,034 మె.వాలను మాత్రమే ఉత్పత్తి చేస్తోంది, 2,526 మె.వాల ఉత్పాదన సామర్థ్యంతో కొత్త ప్రాజెక్టులు నిర్మాణంలో ఉండగా, 5,846 మె.వాల సామర్థ్యం గల ప్రాజెక్టులు అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయి. ఇవన్నీ ఉత్పత్తి ప్రారంభించిన తరవాతా భారత్ ఇంకా 7,000 పైచిలుకు మెగావాట్ల విద్యుత్‌ను సింధు జలాల నుంచి ఉత్పత్తి చేసుకోవచ్చు. ప్రస్తుతం చీనాబ్ నదిపై చేపట్టిన మూడు డ్యామ్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 'నీరూ రక్తం కలిసి ప్రవహించ లేవు' అని ప్రధాని మోదీ విస్పష్టంగా ప్రకటించడం పాక్‌కు గంగవెర్రులెత్తిస్తోంది. పాకిస్థాన్‌కు 1996లో ఇచ్చిన అత్యంత ప్రీతిపాత్ర దేశం (ఎం.ఎఫ్.ఎన్) హోదాను ఉపసంహరించాలనీ భారత్ యోచిస్తోంది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) వివాద పరిష్కార సంఘం ముందుకు పాక్‌ను ఈడ్చి ఎం.ఎఫ్.ఎన్. హోదా రద్దుచేయాలని తలపోస్తోంది. పాకిస్థాన్ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ప్రపంచానికి చాటుతూ పాక్‌ను ఆర్థిక, దౌత్యపరంగా ఏకాకిని చేయడానికి భారత్ కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్-పాక్ సంబంధాలు ప్రతిష్ఠంభనకు లోనవుతున్నాయి. ద్వైపాక్షిక సమస్యలను సంప్రతింపులతో పరిష్కరించుకోవాలని విజ్ఞులే కాదు, రెండు దేశాల ప్రజలూ కోరుకుంటున్నారు.
ఉపఖండంలో శాంతి నెలకొనాలంటే కశ్మీర్ సమస్య పరిష్కారంలో ఎంతో కొంత పురోగతి కనబడాలని పాకిస్థాన్ ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ వ్యవహారంలో కేవలం భారత్, పాక్‌లు చర్చించుకొంటేనే సరిపోదు, కశ్మీరీలు తమకూ ప్రాతినిధ్యం ఉండాలని కోరుతున్నారు. ఇటీవల నేను కశ్మీరీ విద్యార్థుల ఆహ్వానంపై శ్రీనగర్ వెళ్లాను. ఆ యువకులు తమకు సొంత, స్వతంత్ర సర్వసత్తాక దేశం కావాలని వాంఛిస్తున్నారు. ఇప్పటికే ఒక ఇస్లామిక్ రాజ్యం (పాకిస్థాన్)తో సమస్యలు ఎదుర్కొంటున్న భారత దేశం తన సరిహద్దులో స్వతంత్ర కశ్మీర్ రూపంలో మరో ఇస్లామిక్ రాజ్యం ఏర్పడటాన్ని అనుమతించదని వారికి తెలియడంలేదు. అయినా వారిలో నిరసనాగ్రహాలు పెల్లుబుకుతున్నాయి. కశ్మీర్‌కు స్వాతంత్య్రం అనే డిమాండుపై రాజీపడటానికి వారు ససేమిరా అంటున్నారు. కానీ, ఆజాదీ (స్వాతంత్య్రం) అనే ఆదర్శం గొప్పదే కాని, అది ఆచరణసాధ్యం కాదని యువత గ్రహించడం లేదు. 1947 ఆగస్టులో బ్రిటిష్‌వారు భారత్‌ను వదిలివెళ్లేటప్పుడు భారత్ లేదా పాకిస్థాన్‌లో చేరడమా లేక స్వతంత్రంగా మనుగడ సాగించాలా అనేది తేల్చుకునే అవకాశాన్ని రాజసంస్థానాలకే వదిలిపెట్టారు. అప్పటి జమ్మూకశ్మీర్ రాజు హరిసింగ్ తాము స్వతంత్ర దేశంగానే కొనసాగుతామని ప్రకటించారు. రెండు దేశాల నడుమ ఉన్న ఈ సంస్థానం బయటి ప్రపంచంతో సంబంధాలు పెట్టుకోవాలంటే అటు పాక్నో ఇటు భారత్నో ఆశ్రయించక తప్పదు. అయినా సరే స్వతంత్ర దేశంగానే కొనసాగాలని రాజా హరిసింగ్ నిశ్చయించారు. సంస్థానంలో ముస్లిముల జనసంఖ్యే ఎక్కువ కాబట్టి అది తమతోనే విలీనమవుతుందని పాకిస్థాన్ ఆశించింది. అది నెరవేరకపోవడంతో తన సైనికుల అండతో గిరిజన తెగలను కశ్మీర్‌పై దాడికి ఉసిగొల్పింది. దానితో రాజా హరిసింగ్ భారత్ సహాయాన్ని అర్థించారు. అప్పుడు భారత్‌తో విలీన ఒప్పందంపై సంతకం చేస్తేనే కశ్మీర్‌కు సాయపడగలుగుతామని మన నాయకులు చెప్పారు. హరిసింగ్ సంతకం చేయక తప్పలేదు. ఏదిఏమైనా ఈ సంస్థానంలోని రెండు ప్రాంతాలు ఆజాదీకి వ్యతిరేకం. అవి స్వతంత్ర రాజ్య ప్రతిపత్తిని కోరుకోలేదు. హిందువుల సంఖ్యాధిక్యత కలిగిన జమ్మూ భారతదేశంలో కలిసిపోవాలని కోరుకొంది. బౌద్ధుల సంఖ్యాధిక్యంలోని లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉండాలని ఆశించింది. కాబట్టి ఆజాదీ డిమాండ్ 98 శాతం ముస్లిములున్న కశ్మీర్ లోయకే పరిమితం.
యుద్ధం అనివార్యమా?
నేడు భారతదేశ పాలక, ప్రతిపక్షాలు కశ్మీర్ స్వాతంత్య్ర డిమాండ్‌ను అంగీకరించే ప్రసక్తే లేదు. రాష్ట్రానికి కొన్ని హక్కులు, అధికారాలు ఇవ్వడానికి మాత్రం కొన్ని పార్టీలకు అభ్యంతరం ఉండకపోవచ్చు. దేశ విభజన జరిగి 70 ఏళ్లయినా, ఆనాటి గాయాలు ఇప్పటికీ మానలేదు. అలాంటప్పుడు మరొక విభజనకు భారతీయులు ఎలా అంగీకరిస్తారు? కశ్మీరీ ప్రజల మనోభావాలు ఎంత బలంగా ఉన్నా ఆ రాష్ట్రాన్ని వదలుకోవడానికి దేశ ప్రజలు ససేమిరా అంటారు. మత ప్రాతిపదిక మీద దేశాన్ని మరొక్కసారి విభజిస్తే భారత్ ఒక లౌకిక రాజ్యంగా మనుగడ సాగించలేదు. దేశంలోని 25 కోట్లమంది ముస్లిములు నేడు భారత పౌరులుగా సమాన హక్కులు అనుభవిస్తున్నారు. వారిని ఎవరూ బలిపశువులను చేయలేరు. కానీ, కశ్మీర్ లోయ కనుక భారత్ నుంచి విడిపోయిందీ అంటే, దేశంలో భీకర పరిణామాలు సంభవిస్తాయి. ముస్లిముల స్థితిగతులపై తీవ్ర ప్రభావం ప్రసరిస్తుంది. భారత రాజ్యాంగం పౌరులందరికీ సమానత్వం ప్రసాదిస్తున్నా మరొక్కసారి దేశ విభజన సంభవిస్తే రాజ్యాంగ హక్కులు ఏమవుతాయో ఎవరూ చెప్పలేరు.
భారత్, పాకిస్థాన్‌లు కశ్మీర్ కోసం రెండు యుద్ధాలు చేశాయి. కార్గిల్ లోనూ మినీ యుద్ధం జరిగింది. పాక్ ఎన్ని దుస్సాహసాలకు తెగబడినా కశ్మీర్‌లోయ ఇప్పటికీ జమ్ముకశ్మీర్ అంతర్భాగంగా ఉంది. కశ్మీర్లో పాక్ ప్రేరణతో తిరుగుబాట్లు జరిగాయి. వాటిని అణచివేసే క్రమంలో భారత సాయుధ బలగాలూ భారీ ప్రాణనష్టాన్ని చవిచూశాయి. ఉరీ ఘటనకు ముందు ఉగ్రవాదులు ఎన్నోసార్లు పాక్ నుంచి సరిహద్దు దాటి వచ్చి కశ్మీర్ భూభాగంలో దాడులకు పాల్పడ్డారు. గతంలో జుబిన్ మెహతా సంగీత కచేరి జరుగుతున్న సమయంలో దక్షిణ కశ్మీర్లో సీఆర్పీ స్థావరంపై ఉగ్రవాదులు రాకెట్లతో దాడి చేశారు. శ్రీనగర్‌లో హర్తాళ్ జరిగింది. ఇలాంటి ఘటనలు తరచూ పునరావృతమవుతున్నాయి. ఐరాసలో సుష్మా స్వరాజ్ చేసిన హెచ్చరికను ఈసారి కూడా పాక్ ఖాతరు చేయడం లేదు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. భారత్ దాడికి దిగితే అణ్వస్త్రాలు ప్రయోగిస్తానని బెదిరిస్తోంది. ఇలాంటప్పుడు పాక్‌కు గుణపాఠం నేర్పాల్సిందే. అందుకోసం భారత్ కొంత తెగింపు ప్రదర్శించక తప్పదు!
పారని పన్నాగం
స మస్యను పక్కదారి పట్టించడానికని పాకిస్థాన్ పదేపదే కశ్మీర్ సమస్యను లేవనెత్తుతోంది. కశ్మీర్‌పై తాను మొదలుపెట్టే చర్చల ప్రక్రియలో భారత్ పాల్గొనాలని సెలవిస్తోంది. ఇస్లామాబాద్‌లో నవంబరులో దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (సార్క్) శిఖరాగ్ర సభ జరగబోతున్నందున అక్కడ కశ్మీర్‌పై మళ్ళీ యాగీ చేయాలని పాక్ పన్నాగంలా ఉంది. తాను ఈ సభకు హాజరవడం లేదని సార్క్ ప్రస్తుత ఛైర్మన్ నేపాల్‌కు భారత్ చెప్పింది. బంగ్లాదేశ్, భూటాన్, అఫ్గానిస్థాన్‌లు కూడా తాము ఈ సభకు రాలేమని ప్రకటించాయి. ఇలా నాలుగు సభ్యదేశాలు గైర్హాజరయ్యేటట్లయితే సార్క్ సభ రద్దయిపోతుందని నిబంధనలు సూచిస్తున్నాయి. తమ కోర్టుల నిర్ణయాల్లో పాకిస్థాన్ పదే పదే జోక్యం చేసుకోవడం, తమ దేశంలోని ఉగ్రవాదులకు అది వత్తాసు ఇవ్వడం బంగ్లాదేశ్‌కు కోప కారణమైంది. అందుకే సార్క్ సభకు రావడంలేదని ప్రకటించింది. అసలు భారత్ ఎప్పుడైతే సార్క్ సభకు వచ్చేది లేదని ప్రకటించిందో అప్పుడే అది రద్దయిపోయింది. 31 ఏళ్ల క్రితం భారత్ చొరవతోనే సార్క్ ఏర్పడింది. ఇన్నేళ్లలో సార్క్ సభను భారత్ బహిష్కరించడం ఇదే మొదటిసారి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







