రేపే అమెరికా అధ్యక్ష-2016 ఎన్నికలు..
- November 06, 2016
ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియకు మరో 24 గంటల్లో తెరలేవనుంది. ప్రధాన పార్టీలు డెమొక్రాటిక్, రిపబ్లికన్ పార్టీల తరపు అభ్యర్థులుగా బరిలో నిలిచిన మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, రియలెస్టేట్ దిగ్గజం డొనాల్డ్ ట్రంప్ ఆద్యంతం హోరాహోరీ ప్రచారాన్ని నిర్వహించారు. వీరిరువురి ప్రచారంలో ప్రధానంగా దేశ ఆర్థిక వ్యవస్థ కేంద్ర బిందువుగా నిలవటం విశేషం. పన్నుల విధానం, ప్రభుత్వ వ్యయం, రక్షణాత్మక విధానాల వంటి పలు అంశాలు ఈ ప్రచారంలో అమెరికా ఓటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాయి.హిల్లరీ తన రాజకీయానుభవంతో ఆయా అంశాలపై ప్రజలను ఆకర్షిస్తూ ప్రచారంలో ముందుకు దూసుకుపోతుండగా ట్రంప్ మాత్రం బెదిరింపులు, అసందర్భ వ్యాఖ్యల వంటి వాటితో ఓటర్లలో వ్యతిరేకత మూటకట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ఆర్థిక వేత్తలు, ఇతర అధ్యయన సంస్థలు ట్రంప్ ఎన్నిక వెనుక దేశ ఆర్థిక వ్యవస్థకు పొంచివున్న ముప్పుపై ఆందోళన వ్యక్తం చేశాయి. ట్రంప్‌ను గట్టిగా సమర్థించి ఆర్థిక అండదండలు సమకూర్చిన పెట్టుబడిదారులు, వాణిజ్య వర్గాలు సైతం ఇదే తరహా ఆందోళనను వ్యక్తం చేయటం గమనార్హం. ఆయా అధ్యయన సంస్థలు నిర్వహించిన సర్వేలలో సైతం ఇద్దరు నేతలూ పోటాపోటీగా దూసుకు రాగా కొద్దిరోజుల నుండి ఇరువురికి లభిస్తున్న మద్దతులో వ్యత్యాసం స్పష్టంగా కన్పిస్తోంది.
వాల్‌స్ట్రీట్ వర్గాలు క్లింటన్‌కు గట్టి మద్దతు ప్రకటిస్తుండగా మెయిన్ స్ట్రీట్ (చిన్న పారిశ్రామిక, వాణిజ్య సంస్థలు) ట్రంప్‌ను సమర్థించేందుకు ప్రయత్నించాయి. ప్రముఖ రాజకీయ, ఆర్థిక అధ్యయన సంస్థ సిఇడి (కమిటీ ఫర్ ఎకనామిక్ డెవలెప్‌మెంట్) తరపున స్టీవ్ ఆడ్‌లాండ్ తదితరులు నిర్వహించిన అధ్యయన ఫలితాలు సిఎన్‌బిసి వంటి మీడియా సంస్థల అధ్యయనాల ఫలితాలతో సరిపోలుతుండటం విశేషం. సిఎన్‌బిసి అధ్యయనంలో 82 శాతం మంది క్లింటన్ విజేతగా నిలుస్తారన్న అభిప్రాయం వ్యక్తం చేయగా 46 మంది వ్యతిరేకఅభిప్రాయం వెలిబుచ్చారు. అయితే 39 శాతం మంది మాత్రం ట్రంప్ సూచిస్తున్న ఆర్థిక విధానాలు అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
పెప్పర్‌డైన్, గ్రాజియాడియో బిజినెస్ స్కూల్ ఆఫ్ లాస్‌ఏంజెల్స్ నిర్వహించిన మరో ఒపీనియన్ పోల్‌లో ట్రంప్‌కు మద్దతు లభించింది. ఆరోగ్యబీమా, పన్నులు వాణిజ్య విధానాలపై ట్రంప్ ప్రకటించిన వైఖరి ఆధారంగా ఈ మద్దలు లభించటం విశేషం. అయితే రాజకీయ నాయకుల వాగ్దానాలు నీటిమీద మూటలేనన్న సామెతను కొందరు గుర్తు చేస్తూ ఇరువురు అభ్యర్థుల హామీలపై పెదవి విరుస్తున్నారు. సంపన్నులపై పన్నుపోటును పెంచటంతో పాటు దేశవ్యాప్తంగా కనీస వేతనాన్ని పెంచటం, గ్రాట్యుటీ సౌకర్యంతో పాటు పేద వర్గాలకు స్థానిక యూనివర్శిటీలలో అవకాశం కల్పించటం వంటి అంశాలపై హిల్లరీ క్లింటన్ తన ప్రచారాన్ని కేంద్రీకరించి హామీలు గుప్పించారు.
ఆర్థిక రంగ నిపుణులు, నోబుల్ పురస్కార గ్రహీతలు, దాదాపు 370 మంది ప్రముఖ విద్యావేత్తలు వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో ప్రచురించిన బహిరంగలేఖలో ట్రంప్‌కు బదులుగా మరో అభ్యర్థిని ఎన్నుకోవాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ట్రంప్ తన ప్రచారంలో ప్రస్తావించిన రక్షణాత్మక విధానాలు, బ్రెగ్జిట్ వ్యతిరేకత వంటి అంశాలు ప్రపంచ ప్రగతికి పెనుముప్పుగా భావిస్తున్నట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేయటం విశేషం. విజేత ఎవరైనా అమెరికాతో సహా ప్రపంచాన్ని గత ఎనిమిదేళ్లుగా పట్టి పీడిస్తున్న ఆర్థిక సంక్షోభం పీడకలకు తెరదించి అమెరికాను ప్రపంచాన్ని సరైన దిశలో నడిపించే వారు ఎన్నిక కావాలని ప్రపంచ దేశాలతో పాటు పరిశీలకులు కూడా కోరుకుంటున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







