సినీ పరిశ్రమను కుదిపేస్తున్న మోడీ నిర్ణయం
- November 11, 2016
సినిమా ఇండస్ట్రీని పారదర్శకత లేని వ్యాపారంగా చెబుతుంటారు. ఇక్కడ వచ్చేది, పోయేది అంతా గోప్యమే. ఒకవేళ చెప్పినా నిజమైన సంఖ్యలకు, వాళ్లు ప్రకటించే వాటికీ సంబంధం ఉండదు. ఈ క్రమంలో మోదీ తీసుకున్న 500, 1000 నోట్ల రద్దు నిర్ణయం ఫిల్మ్ ఇండస్ట్రీపై స్పష్టమైన ప్రభావం చూపించనుంది. చెక్ లు, డీడీలు, ఆన్ లైన్ వ్యవహారాలు నడిపే పెద్ద నిర్మాణ సంస్థలకు ఇదేమీ భారమవదు. అంటే కార్పొరేట్ సంస్థలు చిత్ర నిర్మాణంలో ముందున్న బాలీవుడ్ కు నష్టం తక్కువే. కానీ దశాబ్దాల మూస దారిలో వెళ్తున్న తెలుగు, తమిళ పరిశ్రమలకు వాతలు తప్పకపోవచ్చు.
ప్రధాని తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశీయ సినిమా పరిశ్రమ లో తాత్కాలిక ఇబ్బందు లను సృష్టిస్తోంది.
ఒక్కో సినిమా కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణమ య్యే ఈ రంగం ఎక్కువ ప్రభావానికి లోనయ్యే అవకాశాలు న్నాయి. నేరుగా సాధారణ ప్రజలపై ఆధారపడిన పరిశ్రమ కా బట్టి.తక్షణ నష్టం సినీ పరిశ్రమలో కనిపిస్తోంది. ప్రేక్షకుల ఆసక్తే సినిమాకు ఆదాయ మార్గం. వినోదానికి మించిన ఎన్నో అవసరాలు కళ్లముందుంటే సినిమాలకు వెళ్లేందుకు వాళ్లు ఇష్టపడటం లేదు. దేశీయ సినీ పరిశ్రమకు వెన్నెముక లాంటి బాలీవుడ్ ప్రస్తుత పరిస్థితి చూస్తే..మెట్రో నగరాలైన ముంబై, ఢిల్లిd, కోల్‌కతా, బెంగళూరు, పూణ లో నివసించే వాళ్లు 'బుక్ మై షో' లాంటి ఆప్ ల ద్వారా ఆన్ లైన్ లో సినిమా టికెట్లను తీసుకుంటారు. వాళ్ల సినీ వినోదానికి పెద్ద నోట్ల రద్దు అడ్డంకి కాదు. ఈ నగరాల్లో మల్టిdఫ్లెక్సులు ఎక్కువగా ఉంటాయి కాబ ట్టి.సినిమా ఆధారిత ఆదాయానికి లోటు ఉండదు. ఈ నగరాల్లో సినిమాల ప్రదర్శన, పంపిణీదారులు రాబడికి ఇబ్బందులు ఉండవు. అయితే ఇక్కడ నివసించే జనాభా చిన్న పట్టణాలు, పల్లెలతో చూస్తే తక్కువ. ఈ ప్రాంతాల్లోని ప్రజలకు క్రెడిట్ కార్డులు వాడకం, ఆన్ లైన్ వ్యవహారాలు ఇంకా అలవాటు కాలేదు. ఏదైనా రుసుములు కట్టాలన్నా బ్యాంకులకు వెళ్లి డబ్బులతోనే చెల్లిస్తుంటారు. వందనోట్లు మాత్రమే చెలామణిలో ఉన్న ప్రస్తుత సమయంలో సినిమాలకు వెళ్లి ..ఆ కాస్త డబ్బు ఖర్చుపెట్టరు. దీంతో మెట్రో నగరాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో బాక్సాఫీస్ కలెక్షన్లు అడుగంటుతున్నాయి.
ఇక బాలీవుడ్ సినిమా నిర్మాణంపై మోడీ నిర్ణయం చూపించే ప్రభావం తక్కువే అన్నది విశ్లేషకుల మాట. హిందీ సినిమాకు మాఫియా ఆర్థిక సాయం చేయడం, బ్లాక్ మనీని ఉపయోగించడం అన్నది 80 దశకంలో ఎక్కువగా జరిగేది. ఈ కాలంలో ఓ హీరో డేట్స్ కావాలంటే సూట్ కేసుల్లో బ్లాక్ మనీ తీసుకెళ్లి ఒప్పించేవాళ్లు. కాలక్రమేణా బాలీవుడ్ లో ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. 'రిలయన్స్', 'ఫాక్స్ స్టార్', 'ఈరోస్', 'వయాకామ్ 18' లాంటి కార్పొరేట్ సంస్థలు చిత్ర నిర్మాణ రంగంలోకి వచ్చాక అంతా లీగల్ గానే జరుగుతోంది. ఈ సంస్థల్లో ఆర్థిక వ్యవహారాలన్నీ ఆన్ లైన్ లోనే జరుగుతుంటాయి కాబట్టి అవినీతికి, బ్లాక్ మనీకి ఆస్కారం ఉండదు.
ప్రాంతీయ చిత్ర పరిశ్రమల పరిస్థితి భిన్నం.
బాలీవుడ్ తర్వాత తెలుగు, తమిళం, మళయాల, కన్నడ పరిశ్రమలు ముఖ్యమైనవి. వీటిలో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలు హిందీ సినిమాతో పోటీ పడుతుంటాయి. వీటిలో బాలీవుడ్ లో ఉన్న ఫ్రొఫెషనలిజం తక్కువే. ఇక్కడ ఇంకా మూస పద్ధతులే కొనసాగుతున్నాయి. మిగతా సెక్టార్లలోని వ్యాపార సంస్థలు, కంపెనీలు తమ త్రైమాసిక , అర్థ వార్షిక, వార్షిక ఫలితాలను ఎక్కువ చేసి చూపినట్లే.సినిమా నిర్మాతలు కూడా తమ పెట్టుబడిని, రాబడిని గోరంతలు కొండంతలు చేసి చూపిస్తుంటారు. ఘనమైన పేరు ఉంటేనే మరో నలుగురు హీరోలను, ఫైనాన్షియర్లను ఆకర్షించగలం అనే ఆలోచనపై నిర్మాతలు ఇలా తప్పుడు ఆర్థిక సమాచారమిస్తుంటారు. కేవలం సమాచారమే కాదు 'షార్ట్ కట్' దారుల్లో వెళ్తుంటారు. హీరోల డేట్స్ 'బ్లాక్ ' చేసుకునేందుకు వాళ్లు కోరినట్లు పారితోషికం ఇస్తుంటారు నిర్మాతలు. పదికోట్ల రూపాయలు తీసుకునే ఒక హీరోకు చెక్‌లు కాకుండా మొత్తం నగదుగానే చెల్లిస్తుంటారు. బ్యాంక్ అక్కౌంట్ లో వేసే డబ్బు లీగల్. ఇలా సూట్ కేసుల్లో ఇచ్చేది లెక్కా పత్రం లేని సొమ్ము. పన్ను కట్టకుండా ఎలాగైనా దాచుకునే వీలయ్యేది. దీనికి 'బ్లాక్ మనీ' అని నిరభ్యంతరంగా పిలవవచ్చు. ఇలా బ్లాక్ లో హీరోలను దక్కించుకునే నిర్మాతలు చాలా మందే ఉన్నారు. వీళ్లకు ఉన్నఫలంగా ఇంత సొమ్ము కొత్త కరెన్సీలోకి మార్చుకోవడం కష్టమే. ఇన్నాళ్లూ ఈ పద్ధతిలో పన్ను రహిత డబ్బు తీసుకున్న కథానాయకులు దారికి రావాల్సిన పరిస్థితి వస్తుంది. బ్యాంకులో జమచేసి కొత్త నగదు తీసుకోవాల్సిందే. ఇళ్లూ, స్థలాలూ తీసుకున్నా.వాటికి టాక్స్ చెల్లించాలి. ఇలా హీరోల దొంగసొమ్ము ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. గత కొన్నేళ్లలో సినీ తారలపై ఆదాయపన్ను అధికారుల దాడులు అధికమయ్యాయి. మహేష్ బాబు, నాగార్జున, అనుష్క, దిల్ రాజు, 14 రీల్స్ నిర్మాణ సంస్థ తదితర సంస్థలతో పాటు చివరకు సుమ, ఉదయభాను, ఝాన్సీ లాంటి టీవీ వ్యాఖ్యాతలకు సోదాలు తప్పలేదు. పక్కా సమాచారం లేనిదే ఇన్‌కం ట్యాక్స్ వాళ్లు సోదాలకు ఎందుకొస్తారు.?
ఇక ప్రధాని తీసుకున్న తాజా నిర్ణయం సినిమా రూపకల్పనపై కూడా ప్రభావం చూపించబోతోంది. ఫైనాన్షియర్ల దగ్గర తెచ్చిన అప్పుల తోనే సినిమా నిర్మాణాలు జరుగుతుంటాయి. ఫైనాన్షియర్లూ నోట్లు మార్చుకోవాలి కాబట్టి కనీసం రెండు వారాల పాటు ఈ అప్పులు పుట్టే పరిస్థితి ఉండదు. ఈ లోగా నటీనటులు, సాంకేతిక నిపుణుల దగ్గర తీసుకున్న డేట్స్ లో మార్పులు చేయాలి. ఈ మార్పు చికాకులతో పాటు డిమాండ్ ఉన్న కళాకారులు అ'ధనం' కోరే అవకాశం ఉంది. దీంతో నిర్మాతలపై భారం పడుతుంది. 24 విభాగాల వాళ్లకు రోజు వారీ చెల్లింపులకు ఇబ్బంది తప్పదు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమాల సంగతి అటుంచితే.ఈ శుక్రవారం తెరపైకి రానున్న సినిమాలు ఎక్కువ నష్టపోనున్నాయి. ఈ నెల 11న నాగచైతన్య ' సాహసం శ్వాసగా సాగిపో' సినిమా విడుదలవుతోంది. ఇదే రోజున తెరపైకి రావాల్సిన అల్లరి నరేష్ 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' వాయిదా పడింది. తమిళంలో గత వారం ప్రేక్షకుల ముందుకొచ్చిన 'కాశ్మోరా', 'కొడి' సినిమాలకు ఈ వారం వసూళ్ల దెబ్బ పడుతోంది. ఓపెనింగ్స్ ప్రాణవాయువులా మారిన నేటి వాణిజ్య పరిస్థితుల్లో విడుదలయ్యే సినిమాలకు తీవ్ర నష్టం కలిగే అవకాశాలున్నాయి. ప్రేక్షకులు నిత్యవసరాల తర్వాతే వినోదాలకు ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి సినిమాలకు వెళ్లే ఆలోచన చేయరు. ఈ నోట్ల మార్పిడి గోలలో సినిమాలకు వెళ్లడం ఎందుకని భావిస్తారు. ఫలితంగా తొలి రోజు, తొలి వారం బాక్సాఫీస్ కలెక్షన్లు తగ్గిపోతాయి.
ఇలాంటి ఇక్కట్లు ఉన్నా.సినిమా తారలంతా ప్రధాని నిర్ణయాన్ని స్వాగతించారు. జాతీయ భావం దృష్ట్యా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం గొప్పదని ప్రశంసించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







