రంగంలోకి దిగిన ట్రంప్.!
- November 11, 2016
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయ ఢంకా మోగించిన డొనాల్డ్ ట్రంప్ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధానాలను అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అమెరికా ఇమిగ్రేషన్ సిస్టమ్ సమగ్రతను పునరుద్ధరించేందుకు 10 అంశాల ప్రణాళిక రూపకల్పన, మెక్సికోతో సరిహద్దుల్లో గోడ కట్టడం, కొన్ని దేశాల నుంచి వచ్చేవారికి వీసాల మంజూరును నిలిపేయడం, లీగల్ ఇమిగ్రేషన్ సిస్టమ్‌ను సంస్కరించడం వంటి చర్యలు తీసుకోబోతున్నారు. వీటికి సంబంధించిన ప్రణాళికను డొనాల్డ్ ట్రంప్ తరపున పని చేస్తున్న ట్రాన్సిషన్ టీమ్ రూపొందిస్తోంది. రాడికల్ సిద్ధాంతాలు, అణ్వాయుధాలు, సైబర్ దాడులపై డొనాల్డ్ ట్రంప్ పాలనలో ప్రధానంగా దృష్టి పెట్టబోతున్నట్లు ట్రాన్సిషన్ టీమ్ తెలిపింది.
దేశ భద్రతకు ఈ మూడింటి వల్ల ముప్పు కలుగుతోందని పేర్కొంది. ఇమిగ్రేషన్ సంస్కరణలకు 10 అంశాల ప్రణాళికను రూపొందించినట్లు పేర్కొంది. అయితే వివరాలు ప్రస్తుతం స్పష్టంగా లేవని తెలిపింది. దక్షిణ సరిహద్దులో గోడ కట్టడం, వలసదారులను పట్టుకుని, వదిలేయడానికి ముగింపు పలకడం, నేరస్థులపై కొంచెం కూడా సంయమనం పాటించకపోవడం, డాక్యుమెంట్లు లేనివారిపై చర్యలు తీసుకోని నగరాలకు నిధుల మంజూరును నిలిపేయడం, రాజ్యాంగ విరుద్ధమైన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను రద్దు చేయడం, ఇమిగ్రేషన్ చట్టాలను అమలు చేయడం వంటివి ట్రంప్ పాలనలో జరుగుతాయని వివరించింది.
తగిన పరిశీలనకు అవకాశం లేని దేశాల నుంచి వచ్చేవారికి వీసాల జారీని నిలిపేయడానికి నిబంధనలను ట్రాన్సిషన్ టీమ్ రూపొందిస్తోంది. దీనిని కొందరు విమర్శిస్తూ ట్రంప్ ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా ముస్లింలను దేశంలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకే ఈ ప్రయత్నం జరుగుతున్నట్లు చెప్తున్నారు. అమెరికా నుంచి బహిష్కరించినవారిని, వారి మాతృ దేశాలు తిరిగి వారిని తమ దేశాల్లోకి అనుమతించాలని పిలుపునివ్వాలని కోరబోతున్నట్లు ఈ టీమ్ తెలిపింది. హెచ్1బి వీసాలు సహా లీగల్ ఇమిగ్రేషన్ సిస్టమ్‌ను సంస్కరించడం గురించి చర్చలు జరుపుతున్నట్లు ఈ టీమ్ పేర్కొంది.
అమెరికా, దాని వర్కర్ల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. ప్రైమరీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ట్రంప్ ప్రచారకర్తలు విడుదల చేసిన ప్రకటనలో ఇమిగ్రేషన్ విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. హెచ్1బీ వీసాల జారీకి కనీస వేతనం 1 లక్ష డాలర్లు ఉండాలని పిలుపునిచ్చారు. దీనిని భారతీయ కంపెనీలు ఆక్షేపించాయి.
ప్రస్తుతం అమెరికాలో ఏటా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మాథమెటిక్స్ ఉద్యోగాల కన్నా రెట్టింపు సంఖ్యలో గ్రాడ్యుయేట్లు అవుతున్నారని, అయితే ఐటీ జాబ్స్ కోసం ఎంట్రీ లెవెల్ నియామకాల్లో మూడింట రెండొంతులు హెచ్1బీ ప్రోగ్రామ్ ద్వారానే జరుగుతున్నాయని ప్రచారం చేశారు. హెచ్1బీ వీసాల్లో సగానికి పైగా ఈ ప్రోగ్రామ్‌లో అనుమతించదగిన అతితక్కువ స్థాయి వేతనం పొందేవారికి జారీ చేస్తున్నారన్నారు. వీటి వేతన పరిమితిని పెంచడం వల్ల దేశంలోని నిరుద్యోగులకు ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు వస్తాయని వివరించారు. ప్రస్తుతం ట్రాన్సిషన్ టీమ్ రూపొందిస్తున్న ప్రణాళిక వల్ల అమెరికాపై ఆశలు పెట్టుకున్న భారతీయులకు ఇబ్బందులు రావచ్చునని ఆందోళన వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







