తాత్కాలికంగా వీసా పనుల నిలిపివేసిన అమెరికన్‌ కాన్సులేట్‌

- December 05, 2016 , by Maagulf
తాత్కాలికంగా వీసా పనుల నిలిపివేసిన అమెరికన్‌ కాన్సులేట్‌

తమిళనాడు ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి విషమించిన నేపథ్యంలో చెన్నైలోని అమెరికన్లు అప్రమత్తంగా ఉండాలని అమెరికన్‌ కాన్సులేట్‌ అత్యవసర సందేశం జారీచేసింది. వ్యక్తిగత భద్రతకు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని తన అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తెలిపింది. ప్రస్తుతానికి ప్రజలు శాంతంగా ఉన్నా.. ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పే అవకాశాలు ఉన్నాయి. ర్యాలీలు, ఆందోళనలు జరిగే ప్రదేశాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. స్థానిక ప్రసార మాధ్యమాల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మీ జాగ్రత్తలో మీరు ఉండండి.. అని పర్యాటకులకు సూచించింది.

యూఎస్‌ కాన్సులేట్‌ ప్రస్తుతం కొంతమంది సిబ్బందితోనే పనిచేస్తోంది. వీసా ప్రాసెసింగ్‌ పనులు తాత్కాలికంగా నిలిపివేశామని, అవి పునరుద్ధరించిన అనంతరం ఈ-మెయిల్‌ ద్వారా తెలియజేస్తామని ప్రకటన జారీ చేసింది. గత కొద్దిరోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత నిన్న రాత్రి గుండెపోటుకు గురికావటంతో ఆమెను అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులు పెద్ద సంఖ్యలో అపోలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఆసుపత్రి పరిసరాల్లో, తమిళనాడులోని కొన్ని సున్నితమైన ప్రదేశాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com