తెలంగాణలో ‘ఆపరేషన్ ముస్కాన్’..
- August 02, 2026
హైదరాబాద్: బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ ముస్కాన్(Operation Muskan) కార్యక్రమం అద్భుత ఫలితాలను అందించింది. జులై 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నెల రోజుల పాటు రాష్ట్ర పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలిసి హోటళ్లు, టీ కొట్లు, ఇటుక బట్టీలు, భవన నిర్మాణ ప్రాంతాలు, మెకానిక్ షాపులు, కిరాణా దుకాణాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. నిబంధనలను ఉల్లంఘించి చిన్నారులతో పనిచేయిస్తున్న ప్రాంతాలపై దాడులు చేసి, ప్రమాదకర పరిస్థితుల్లో నలిగిపోతున్న వేలాది మంది చిన్నారులకు విముక్తి కల్పించారు.
6,307 మంది చిన్నారులకు పునరావాసం:
ఈ ప్రత్యేక సోదాల్లో పోలీసులు మొత్తం 6,307 మంది చిన్నారులను సురక్షితంగా రక్షించారు. వీరిలో 5,892 మంది బాలురు కాగా, 415 మంది బాలికలు ఉన్నారు. కాపాడబడిన వారిలో తెలంగాణకు చెందినవారు 3,447 మంది ఉండగా, పొరుగు దేశమైన నేపాల్‌కు చెందినవారు 2,860 మంది ఉన్నారు. రక్షించిన చిన్నారుల్లో 5,737 మందిని వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చి, వారి ముఖాల్లో చిరునవ్వులు పూయించారు. మిగిలిన 570 మంది చిన్నారులను మెరుగైన భద్రత, విద్య కోసం వివిధ శిశు సంరక్షణ కేంద్రాలకు తరలించారు.
నిందితుల పై కఠిన చర్యలు, జరిమానాలు:
బాల కార్మికులను అక్రమంగా పనుల్లో కుదుర్చుకున్న యజమానులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలో మొత్తం 1,705 కేసులు నమోదు చేసి 1,710 మంది నిందితులను అరెస్టు చేశారు. అంతేకాకుండా కనీస వేతనాల చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను చట్టపరంగా రూ.37.95 లక్షల మేర జరిమానా విధించారు. పిల్లల భవిష్యత్తుతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని, చిన్నారులను బడికి పంపాలే తప్ప పనుల్లోకి పంపవద్దని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







