పతంజలి ఆయుర్వేద కంపెనీకి జరిమానా ...

- December 14, 2016 , by Maagulf
పతంజలి ఆయుర్వేద కంపెనీకి జరిమానా ...

యోగా గురు రామ్‌దేవ్‌ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద కంపెనీకి హరిద్వార్‌లోని జిల్లా మేజిస్ట్రేట్‌ కోర్టు జరిమానా విధించింది. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, తప్పుడు ప్రకటనల ద్వారా వినియోగదారులను పక్కదోవ పట్టించిందన్న అభియోగాలు నిరూపణ కావడంతో రూ.11 లక్షలు జరిమానాగా చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇతర సంస్థలు తయారు చేసిన వస్తువులను తమ బ్రాండ్‌ పేరిట ప్రకటనల్లో పేర్కొని వినియోగదారులను పక్కదోవ పట్టించి ఆదాయాన్ని పెంచుకోవాలని కంపెనీ చూస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. సెక్షన్‌ 52, 53 కింద తప్పుడు ప్రకటనలు, వినియోగదారులను పక్కదోవ పట్టించడం వంటి నేరాలతో పాటు ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించని నేరం కింద జరిమానా విధిస్తూ..నెల రోజుల్లో ఆ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆహార నాణ్యత ప్రమాణాల శాఖను ఆదేశించింది.
2012 ఆగస్టు 16న నిర్వహించిన ఆహార భద్రతా ప్రమాణ పరీక్షల్లోపతంజలి వస్తువులు విఫలం కావడంతో అదే ఏడాది నవంబర్‌లో ఈ వ్యవహారంపై కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనికి సంబంధించి ఈ నెల 1న తీర్పు వెలువడగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com