లోక రక్షకుడైన బాలఏసు జనన ఆరాధనే క్రిస్మస్

- December 24, 2016 , by Maagulf

క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం అని అర్థం. క్రై స్ట్‌ అంటే అభిషిక్తుడు (క్రీస్తు), మస్‌ అంటే ఆరాధన. అభిషిక్తుడిని ఆరాధించడం అనేది క్రిస్మస్‌ పరమార్థం. క్రీస్తు జననం వల్ల రెండు అపూర్వ ఘట్టాలు మానవ చరిత్రలో ఆవిష్కరించాయి. క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకంగా గుర్తింపులోకి వచ్చాయి. క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకొని క్రైస్తవులు తమ ఇళ్లపై ’ స్టార్‌ ’ను ఏర్పాటు చేయడం వెనుక ఓ చారిత్రక సత్యం దాగి ఉంది. . క్రీస్తు పుట్టుక కు నక్షత్రాన్ని సూచికగా పరిగణిస్తారు. బెత్లెహెం దేశంలో తూర్పున భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రాన్ని నాటి ఖగోళ శాస్త్రజ్ఞులు, జ్ఞానులు గుర్తిస్తారు. నక్షత్రం కొత్తగా ఏర్పడటం గ్రహించిన జ్ఞానులు నక్షత్ర వెలుగు ఆధారం గా బాలయేసు జన్మించిన పశువుల పాక వద్దకు చేరుకుంటారు. బాలయేసును ప్రార్థిస్తారు. ప్రేమ, ఆప్యాయతలను పెంచు.. శాంతిని పంచు.. అంటూ పాపాల నుంచి ప్రజలను విముక్తి చేయడానికి జన్మించిన క్రీస్తు ఆ ప్రజలకోసమే ముళ్ల కిరీటాన్ని ధరించి, సిలువపై రక్తం చిందించాడు... నా కోసం ఏడ్వకండి.. మీ కోసం మీ పిల్లల కోసం ఏడ్వండంటూ చివరి క్షణంలోనూ చెప్పిన యేసు క్రీస్తు జననం గురించి బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలోను, మరియు క్రీస్తు కాలంలో వ్రాయబడిన క్రొత్త నిబంధనలోను పలు చోట్ల ప్రస్తావించబడింది. ముఖ్యముగా క్రీస్తు పూర్వం, అనగా 700 B.C లో ప్రవక్త యోషయా 7:14 తన గ్రంథంలోని 7:14 లో యేసు క్రీస్తు గురించి పరోక్షంగా ప్రవచించడం గమనార్హం. అలాగే యోషయా 53 వ అధ్యాయం కూడా యేసు ప్రభువు గురించి ప్రరోక్షంగా ప్రవచించడం విశేషం.యోషయా ప్రవక్త్ మరణించిన 700 సంవత్సరాల తర్వాత ఏసు బెత్లహేము అను గ్రామంలో జన్మించడం జరిగింది. బైబిలు ప్రక్రారం కన్యక యైన మరియకు స్వప్నంలో దేవదూత యేసు జన్మము గురించి మత్తయి, లూకా సువార్తలలో చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు జన్మించి ఇప్పటికి రెండు వేల సంవత్సరాలు దాటిపోయింది. ఆ కాలంలో అంటే రెండు వేల సంవత్సరాల కిందట రోమా సామ్రాజ్యాన్ని ఆగస్టస్‌ సీజర్‌ అనే చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఆయన తన రాజ్యంలో ఎంత మంది ప్రజలు ఉన్నారో ప్రజా గణన  నమోదు చేయించలనుకున్నాడు. అందుకు వీలుగా ప్రజలందరు ఎవరి స్వగ్రామాలకు వాళ్ళు డిసెంబరు 25 తేదీలోగా వెళ్ళాలని ఆజ్ఞాపించాడు. అప్పుడు ‘నజరేతు ’ అనే పట్టణంలో ఉన్న  మేరీ, జోసఫ్‌ లు  నివసిస్తున్నారు. మేరీకి జోసెఫ్‌తో వివాహం జరిపేందుకు ఏర్పాటు చేశారు. ఒక రోజున మేరీకి గాబ్రియేల్‌ అనే దేవదూత కనబడి ‘ఓ మేరీ! నీవు దేవుని వలన అనుగ్రహం పొందావు. నీవు కన్యగానే గర్భవతివి అవుతావు. నీవు ఒక కుమారుని కంటావు. అతనికి ‘యేసు’ అని పేరు పెట్టు. అతడు దేవుని కుమారుడు ’ అని చెప్పాడు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. మేరీ గర్భవతి అయింది. ఇది తెలిసి జోసెఫ్‌ ఆమెను పెండ్లాడరాదని, విడిచి పెట్టాలని ఆలోచించసాగాడు. అయితే ఒక రాత్రి కలలో అతనికి దేవదూత కనపడి ‘మేరీని నీవు విడనాడవద్దు. ఆమె భగవంతుని వరం వలన గర్భవతి అయింది. ఆమెకు పుట్టే పుత్రుడు దేవుని కుమారుడు. ఈ లోకానికి ఆయన కాపరి  తన్ను నమ్మిన ప్రజలందరిని వాళ్ళ పాపాల నుండి రక్షిస్తాడు.’ అని చెప్పాడు. జోసఫ్‌ న్యాయవంతుడు భక్తుడు. కనుక మేరీని ప్రేమతో స్వీకరించాడు .జోసఫ్‌ స్వగ్రామం బెత్లేహం. జనాభా లెక్కల కోసం  అక్కడకు చేరుకొనేందుకు  గాడిద మీద నిండు చూలాలైన మేరీ తో ఎంతో ప్రయాసతో ఆ రాత్రి  అక్కడకు చేరుకొన్నారు. తీరా వాళ్ళు బెత్లేహేము చేరుకునే సరికి వాళ్ళకక్కడ ఉండటానికి వసతి దొరకలేదు. చివరకు ఒక సత్రం యజమాని వారి పరిస్థితికి జాలిపడి  తన పశువుల పాకలో ఉండనిచ్చాడు. అక్కడే మేరీ ఒక శిశువును ప్రసవించింది. ఆమె ఆ బిడ్డను పొత్తిళ్ళలో చుట్టి పశువుల తొట్టిలో పడుకోపెట్టింది. ఆ రాత్రి బెత్లేహేము ప్రక్కనున్న పొలాల్లో కొందరు పశువుల కాపరులు తమ గొర్రెల మందలను కాపలా కాస్తున్నారు. అప్పుడు ఒక దేవదూత ఆకాశం నుంచి వారి ముందుకు ప్రత్యక్షమయ్యాడు . ఆ దేవదూత చుట్టూ ఉన్న మిరుమిట్లు గొలిపే వెలుగుకు గొర్రెలకాపరులు ఎంతో భయపడ్డారు. దేవదూత వాళ్ళతో, భయపడకండి. ఇదిగో మీకొక సంతోషకరమైన శుభవార్త. ఇవ్వాళ బెత్లెహేములోని ఒక పశువులపాకలో, లోక రక్షకుడు పుట్టాడు. ఆయనే అందరికీ ప్రభువు. ఒక పసికందు పొత్తిగుడ్డల్లో చుట్టబడి, పశువుల తొట్టిలో పడుకొని ఉంటాడు. ఇదే మీకు ఆనవాలు. అతడే లోకరక్షకుడు అని చెప్పాడు. దేవదూత ఇలా చెబుతుండగా పొలమంతా ఆకాశం నుండి దిగివచ్చిన దేవదూతలతో నిండిపోయింది. వాళ్ళంతా దేవునికి స్తుతి గీతాలు పాడి మాయమైనారు. గొర్రెల కాపరులు హుటాహుటిన వెళ్ళి దేవదూత చెప్పిన పశువుల పాకను చేరుకున్నారు. అక్కడ పశువుల తొట్టిలో పండుకొని ఉన్న శిశువును, మేరీ, జోసెఫ్‌ లను చూశారు. వారు తాము చూచింది, దేవదూత తమకు చెప్పింది అందరికి తెలియజేశారు. అలా రెండు వేల సంవత్సరాల క్రిందట డిసెంబరు 24వ తేదీ అర్థరాత్రి యేసు క్రీస్తు జన్మించాడు. అందుచేత ఆ మరునాడు అంటే డిసెంబరు 25వ తేదీ క్రిస్‌మస్‌ పండుగను ప్రపంచవ్యాప్తంగా  ఆచరిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com