'ఇంట్లో దెయ్యం.. నాకేం భయం' సినిమా రివ్యూ

- December 30, 2016 , by Maagulf
'ఇంట్లో దెయ్యం.. నాకేం భయం' సినిమా రివ్యూ

సినిమా పేరు: ఇంట్లో దెయ్యం.. నాకేం భయం 
నటీనటులు: నరేష్‌.. కృతిక మౌర్యాని.. రాజేంద్రప్రసాద్‌.. బ్రహ్మానందం.. చలపతిరావు.. షకలక శంకర్‌ తదితరులు 
సంగీతం: సాయి కార్తీక్‌ 
ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర 
నిర్మాత: బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ 
దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి
న రేష్‌ అంటే ఇది వరకు 'నవ్వులు గ్యారెంటీ' అనే భరోసా ఉండేది.

ఎందుకో అది రాను రాను తగ్గిపోతోంది. ఈమధ్య వరుస పరాజయాలు అల్లరోడి క్రేజ్‌పై విపరీతమైన ప్రభావం చూపించాయి. దాంతో నరేష్‌ జోనర్‌ మార్చాడు. తొలిసారి హారర్‌ కామెడీ జోనర్‌ ఎంచుకొన్నాడు. పైగా తనకు అచ్చొచ్చిన దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డితో మరోసారి జట్టు కట్టాడు. ఆ సినిమానే.. 'ఇంట్లో దెయ్యం నాకేం భయం'. మరి ఈసారైనా అల్లరోడి కష్టం నెరవేరిందా? జోనర్‌ మారింది కదా.. ఫలితం ఎలా ఉందన్నది చూస్తే..
కథేంటంటే..: నరేష్‌(అల్లరి నరేష్‌) ఓ బ్యాండు మేళం నడిపిస్తుంటాడు. ఇందుమతి (కృతిక) ప్రేమలో పడిపోతాడు. ఓ పాప ప్రాణాలు కాపాడడానికి మూడు లక్షల రూపాయలు అప్పు చేయాల్సి వస్తుంది. అయితే ఆ డబ్బుని పోగొట్టుకొంటాడు. అదే సమయంలో తనకో ఇంటి నుంచి ఫోన్‌ వస్తుంది. 'మా ఇంట్లో దెయ్యం ఉంది.. వచ్చి కాపాడాలి. పది లక్షలిస్తా' అని ఫోన్లో బేరాలాడేస్తాడో పెద్దాయన.
డబ్బు అవసరంతో.. బ్యాండ్‌ మేళం బ్యాచ్‌ కాస్త భూత వైద్యుల బృందంగా మారి ఆ ఇంట్లోకి ప్రవేశిస్తారు. అక్కడ తమకు తెలిసిన కనికట్టు విద్యలన్నీ చూపించి డబ్బులు సంపాదించాలన్నది నరేష్‌ ప్లాన్‌. కానీ నిజంగానే అక్కడో దెయ్యం ఉంటుంది. ఆ దెయ్యాన్ని తరిమేస్తే గానీ.. డబ్బులు రావు. అప్పుడు నరేష్‌ ఏం చేశాడు? ఇంతకీ ఆ ఇంట్లో ఉన్న ఆత్మ ఎవరిది? అనేదే కథ.
 
ఎలా ఉందంటే..: ఆత్మకథలన్నీ ఇంచుమించు ఒకేలా ఉంటాయనడానికి ఈ సినిమా మరో ఉదాహరణ. కథ.. కథనాల విషయంలో దర్శకుడు పెద్దగా దృష్టి పెట్టలేదు. సినిమా చూస్తున్నప్పుడు.. హారర్‌ కథలతో వచ్చిన సినిమాల్లోని సీన్లు అప్రయత్నంగా గుర్తుకొచ్చే అవకాశం ఉంది. దీంతో.. కథలోనే కాదు.. కథనంలోనూ కొత్తదనం ఎక్కడా కనిపించదు. నరేష్‌ ప్రేమకథ బోర్‌ కొట్టిస్తుంది.
భూత వైద్యుల్లా ఇంట్లోకి ప్రవేశించడంతో కథలో వేగం రావాల్సింది. కానీ అక్కడే పాత సన్నివేశాలు పునరావృతం కావటంతో వినోదం పండలేదు. షకలక శంకర్‌.. ఛమ్మక్‌చంద్ర కాంబినేషన్‌లో వచ్చిన దెయ్యం సీన్‌ ఒక్కటే నవ్విస్తుంది.
ద్వితీయార్థంలోనూ కథ ముందుకు సాగదు. దెయ్యం ఫ్లాష్‌ బ్యాక్‌ అయిపోయినా.. సినిమాకి శుభం కార్డు పడదు. పతాక సన్నివేశాలు సా..గినట్లు ఉండటం ఇబ్బంది కలిగిస్తుంది. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్లు.. అవీ నరేష్‌ చేశాడు కాబట్టి కొన్ని నవ్వులు పంచాయంతే. అంతకు మించి దెయ్యం పంచిన వినోదం పెద్దగా ఉండదు.
ఎవరెలా చేశారంటే..: నరేష్‌కి ఇదే తొలి హారర్‌ కామెడీ సినిమా. తనకు తెలిసిన విద్యలన్నీ మరోసారి ప్రదర్శించాడు. కాకపోతే నరేష్‌ నుంచి పేలాల్సిన పంచ్‌లు ఈ సినిమాలో వినిపించలేదు. కృతిక కేవలం పాటలకు మాత్రమే దర్శనమిచ్చింది. దెయ్యం పాత్రలో కనిపించిన మౌర్యాని నటన కూడా అంతంత మాత్రమే. రాజేంద్ర ప్రసాద్‌ లాంటి అనుభవజ్ఞుడున్నా ఉపయోగం లేకుండా పోయింది. బ్రహ్మానందం రెండు సీన్లలో కనిపించాడు. సాయి కార్తీక్‌ పాటలు ఎలా ఉన్నా.. వాటి ప్లేస్‌మెంట్‌ మాత్రం అతికినట్లు కనిపించదు.
బలాలు 
+ కొన్ని కామెడీ సీన్లు
బలహీనతలు 
- కథ.. కథనం
చివరగా.. ఇంట్లో దెయ్యం భయపెట్టదు.. నవ్వించదు. 

ఈ సినిమా కి మాగల్ఫ్ వారి రేటింగ్ ​2.75/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com