'ఐఎస్‌' వ్యతిరేక నిరసనలు అఫ్ఘాన్‌లో....

- January 04, 2017 , by Maagulf
'ఐఎస్‌' వ్యతిరేక నిరసనలు అఫ్ఘాన్‌లో....

కాబుల్‌ : అఫ్ఘనిస్తాన్‌లో ఐఎస్‌ వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. వేలాది మంది వీధుల్లోకి చేరుకుని నిరసన గళమెత్తారు. ఐఎస్‌ దాడుల్లో మృతి చెందిన షీత్‌ ముస్లింల ఫొటోలు, ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. ఉగ్రవాదం నశించాలంటూ ఐఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కాబుల్‌ నుంచి హెరాత్‌ నగరంలోని గవర్నర్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ తీశారు.స్థానిక మీడియా సంస్థ పజ్వక్‌ తెలిపిన వివరాల ప్రకారం...2వేల మంది నిరసనకారులు ర్యాలీలో పాల్గొన్నారు. షీత్‌ ముస్లింల మత పెద్దలు ఈ ర్యాలీలో మాట్లాడారు. విద్యాలయాలు, మసీదులపై ఐఎస్‌ అరాచకాలకు పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు. ఐఎస్‌ దాడులను తిప్పిగొట్టేందుకు అఫ్ఘాన్‌ బలగాలు ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహిస్తున్నాయని హెరాత్‌ గవర్నర్‌ మొహ్మద్‌ ఆసిఫ్‌ రహీమీ తెలిపారు.

ఇటీవలి కాలంలో నాన్‌గర్హార్‌ సరిహద్దుల్లో ఉగ్రవాదుల ప్రాబల్యం బాగా పెరిగిపోయిందన్నారు. ఆ ప్రాంతంలో అఫ్ఘాన్‌ బలగాలు కూంబింగ్‌ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నాయని చెప్పారు. పౌరుల భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెడతామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఆదివారం ఐఎస్‌ దాడుల్లో ఓ మసీదు ఇమామ్‌ మృతి చెందారు.

ఇమామ్‌ మృతి పట్ల గవర్నర్‌ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అఫ్ఘాన్‌లో అల్లర్లు సృష్టించేందుకు ఐఎస్‌ కుట్ర పన్నిందని అంతర్గత వ్యవహారాల మంత్రి నజీబుల్లా మనీ తెలిపారు. అఫ్ఘనిస్తాన్‌లో మొత్తం 34 ప్రావిన్స్‌లు ఉండగా, 11 ప్రావిన్స్‌ల్లో ఐఎస్‌ పాగా వేసిందన్నారు. హెరాత్‌ నగరంలో జరిగిన దాడులన్నింటిలోనూ ఐఎస్‌ హస్తముందని అనుమానిస్తున్నామని చెప్పారు.

ఇదిలా ఉండగా, గతేడాది అక్టోబర్‌లో మజారే షరీఫ్‌ మసీదులోకి ఓ సాయుధుడు చొరబడి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 14 మంది షీత్‌ ముస్లింలు మృతి చెందారు. జులైలో జరిగిన మరో దాడిలో 80 మంది మృతి చెందారు. 130 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com