నేడు ఎన్టీఆర్ 21వ వర్ధంతి...
- January 18, 2017
నాయకుడు నిస్వార్థంగా బతకాలి.. జనం కోసం జీవించాలి... జనహితమే తన అభిమతం కావాలి. అసలు ఇలాంటి నాయకులు ఉన్నారా? ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం దొరక్కపోవచ్చు. కానీ రెండు దశాబ్దాలు వెనక్కెళితే.. తెలుగుజాతి గర్వించదగ్గ నాయకుడు కనిపిస్తాడు. ఆ మహనీయుడే ఎన్టీఆర్. మన ముందు లేకపోయినా.. తెలుగుజాతి గుండెల్లో ఆయన ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచే ఉంటారు. నేడు ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఆయన సేవలను ఓ సారి స్మరించుకుందాం.
తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్.. ఓ సినిమా నటుడిగా ప్రస్థానం ప్రారంభించిన.. ఎన్టీఆర్.. సినిమాల్లో ఉండగానే అశేష అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన వేసిన ఎన్నో పాత్రలు.. ఎన్టీఆర్‌ను అందరివాడుగా మార్చాయి. ఆయన ప్రతి సినిమాలో అంతర్లీనంగా చెప్పిన కుటుంబ, సామాజిక సందేశాలు... ప్రజలను ఎంతో ప్రభావితం చేశాయి.
ఎన్టీఆర్ వేసిన పౌరాణిక పాత్రలు... జనంలో ఆయనకు గౌరవ భావాన్ని తీసుకొచ్చాయి. నటుడిగానే కాక నిర్మాతగా, దర్శకుడిగా కూడా సత్తా చాటిన రామారావులో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని గుర్తించారు. అందుకే అందరూ అన్నగారు అని పిలుచుకున్నారు. కొందరు ఎన్టీవోడు అన్నారు. ఎవరు ఎలా పిలిచినా ప్రజలే నా దేవుళ్లు అని ఆయన అన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవం నినాదంతో గర్జించి, తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగుజాతి ఆత్మగౌరవ నినాదం ఓ ప్రభంజనమైంది. ఆ నినాదానికి జనం బ్రహ్మరథం పట్టారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ఆ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. అప్పుడు రాష్ట్రంలో యువ నాయకత్వం పుట్టుకొచ్చింది. వారసత్వాలకతీతంగా పాతికేళ్ల యువకులు కూడా అసెంబ్లీలో అడుగుపెట్టారు. విద్యావంతులు, యువ మేధావులు చట్టసభలకు వచ్చారు. బడుగులకు పార్టీలో పెద్ద పీట దక్కింది. ఆర్థిక బలం ఏ మాత్రం లేని వారు కూడా అన్నగారి అండతో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.
ఆనాడు ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు ఎన్టీఆర్. తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించారు. పేదలకు మేలు చేసే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారు. జనతా వస్త్రాలు, రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారు. రూపాయి జీతంతో ముఖ్యమంత్రిగా పనిచేశారు. నిజాయితీ, నిస్వార్థంతో తెలుగువాడి మేలు కోసం పని చేశారు.
ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్‌ను గడగడలాడించిన తెలుగోడు ఎన్టీఆర్. నేషనల్ ఫ్రంట్ పేరుతో కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను కూడగట్టడంలో విజయం సాధించారు. ఎన్టీఆర్ హయంలోనే తెలుగుజాతికి గుర్తింపు వచ్చింది. ఢిల్లీలో తెలుగువాడికి గౌరవం పెరిగింది. నిత్యం ప్రజల కోసం తపించిన ఆ మహానాయకుడు తెలుగుజాతి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించారు. ఆయనలోని నిజాయితీ, నిస్వార్థం, రాజకీయ ప్రయోజనాలతో నిమిత్తం లేకుండా ప్రజల కోసం వేసిన అడుగులు ఒక్కసారి స్మరించుకుందాం. ఆ స్ఫూర్తిగా ముందుకు నడుద్దాం.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







