'గుంటూరోడు' ఆడియో విడుదల...

- January 29, 2017 , by Maagulf
'గుంటూరోడు' ఆడియో విడుదల...

''కా వాలని ఎవ్వరూ ఫ్లాప్‌ సినిమాలు తీయరు. కథ నచ్చకపోతే పరాజయం పాలవుతుంది. మంచి కథలకు ఎప్పటికీ విజయాలు దక్కుతాయి. 'గుంటూరోడు' అలాంటి చిత్రమే'' అన్నారు మంచు మోహన్‌బాబు. ఆయన తనయుడు మనోజ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ప్రగ్యా జైస్వాల్‌ కథానాయిక. ఎస్‌.కె.సత్య దర్శకత్వం వహించారు. శ్రీవరుణ్‌ అట్లూరి నిర్మాత. డిజె వసంత్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని గీతాలు ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. తొలిసీడీని మోహన్‌బాబు ఆవిష్కరించారు. అనంతరం మోహన్‌ బాబు మాట్లాడుతూ ''ఈ చిత్ర నిర్మాత ఓ సారి మా ఇంటికొచ్చారు.
'సినిమాకి ఎంతైంది?' అని అడిగా. ఆయనో అంకె చెప్పారు. 'ఎందుకింత ఖర్చుపెట్టారు' అని అడిగా. కథే నడిపించిందని చెప్పారు నిర్మాత.

ఆయన ధైర్యానికి హ్యాట్సాఫ్‌. సంగీత దర్శకుడు సత్యం మా సంస్థలో ఎన్నో చిత్రాలకు పనిచేశారు. ఆయన దగ్గరే రెహమాన్‌, ఇళయరాజా పనిచేశారు. ఆయన మనవడు వసంత్‌ ఈ చిత్రానికి సంగీతం అందించడం ఆనందంగా ఉంది.

ఈ సినిమా కోసం ఏసుదాసు కుమారుడు విజయ్‌ ఏసుదాస్‌ ఓ పాట పాడారు. రికమెండేషన్లతో చాలామందికి అవార్డులు వస్తాయి. కేవలం ప్రతిభతో ఏసుదాసు పద్మ విభూషణ్‌ అవార్డుని అందుకొన్నారు. ఆయనకు అభినందనలు'' అన్నారు.

మంచు మనోజ్‌ చెబుతూ ''కొత్తగా సినిమాలు చేద్దామని ప్రయత్నిస్తుంటావు.. కమర్షియల్‌ చిత్రాలు చేయొచ్చు కదా, అని నా సన్నిహితులు అడుగుతుంటారు. 2004లో కథానాయకుణ్ని అయ్యా. 18 సినిమాలు చేశా.

'విజయం కాదు.. మంచి పాత్ర చేశానన్న ఆత్మ సంతృప్తి అవసరం' అని నాన్న చెప్పారు. అందుకే నాకు నచ్చిన సినిమాలు నేను చేసుకొంటూ వెళ్తున్నా. ఒకే మూసలో నాలుగు ఫైట్లూ, ఆరు పాటలతో సినిమాలు చేసుకొంటూ వెళ్తే కొంతకాలానికి అక్కడే ఆగిపోతామనిపించింది.

నాకు వ్యాపారం చేయడం రాదు. సినిమాలు తప్ప మరో ప్రపంచం తెలియదు. నేను ఎంచుకొన్న బాట కష్టమైంది. కానీ సంతోషంగా ఉన్నా.

సూపర్‌ స్టార్‌ అయిపోవాలన్న ఆశలేదు. వయసు చాలా ఉంది. కంగారు లేదు. అభిమానుల కోసం వాణిజ్య పరమైన చిత్రాలు అప్పుడప్పుడూ చేస్తుంటా'' అన్నారు.

''ఈ సినిమా విజయం సాధించాలని కోరుకొనేవాళ్లలో మొదటి వ్యక్తి నేను. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు మనోజ్‌. తన ఎనర్జీలో కొంచెం అయినా మాకు రావాలని కోరుకొంటున్నా''నని శర్వానంద్‌ తెలిపారు. మనోజ్‌తో కలిసి 'బిల్లా రంగా' రీమేక్‌లో నటించాలనివుందన్నాడు సాయిధరమ్‌ తేజ్‌.

విష్ణు మాట్లాడుతూ ''మనోజ్‌ మ్యూజిక్‌ సెన్స్‌ బాగుంటుంది. పాటల విషయంలో తాను తీసుకొనే జాగ్రత్త నేనూ తీసుకోను. నా తదుపరి సినిమా పాటల బాధ్యత తనకి అప్పగిస్తా'' అన్నారు. కార్యక్రమంలో సురభి, పరశురామ్‌, కొండా విజయ్‌ కుమార్‌, రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, జెమిని కిరణ్‌, కాశీ విశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com