నరేంద్ర మోదీ జులైలో ఇజ్రాయెల్‌కు

- March 23, 2017 , by Maagulf
నరేంద్ర మోదీ జులైలో ఇజ్రాయెల్‌కు

ప్రధాని నరేంద్ర మోదీ జులైలో రెండు రోజులపాటు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. ఆ దేశంలో పర్యటన చేపడుతున్న మొదటి భారత ప్రధాని ఆయనే కావడం విశేషం! 1992 నుంచి పాతికేళ్లుగా ఇజ్రాయెల్‌తో భారత్‌ దౌత్య సంబంధాలు నెరపుతున్నా మన ప్రధానులు ఎవ్వరూ అక్కడ పర్యటించలేదు. జులై రెండో వారంలో జర్మనీలోని హాంబర్గ్‌లో జీ-20 శిఖరాగ్ర సదస్సు ఉందని, సదస్సు నుంచి భారత్‌కు తిరిగి వచ్చేటప్పుడు మోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించే అవకాశముందని భారత దౌత్యవేత్త ఒకరు వెల్లడించారు. ఇజ్రాయెల్‌తో సుదీర్ఘకాలంగా తీవ్రస్థాయి వివాదమున్న పాలస్తీనాలో ప్రధాని పర్యటించబోవడం లేదు. అయితే ఈ పర్యటనకు ముందు, లేదా దీనిని చేపట్టిన వెంటనే పాలస్తీనా అధ్యక్షుడు మొహమ్మద్‌ అబ్బాస్‌కు ప్రభుత్వం దిల్లీలో ఆతిథ్యం ఇవ్వనుంది.
యూదులు అత్యధికంగా ఉండే ఇజ్రాయెల్‌తో వాణిజ్య, రక్షణ సంబంధాల విషయంలో గత ప్రభుత్వాలు ఆచితూచి వ్యవహరించేవి. ముస్లిం ప్రాబల్య పాలస్తీనాతో ఇజ్రాయెల్‌కు చిరకాల వైరం ఉండటం, ఇజ్రాయెల్‌తో సంబంధాలను పెంపొందించుకోవడం దేశంలోని ముస్లిం మైనారిటీలకు తప్పుడు సంకేతాలను పంపొచ్చనే ఉద్దేశం దీనికి ఒక ముఖ్య కారణం. పరిస్థితులు మారడంతో భారత్‌ వైఖరిలోనూ మార్పు వచ్చింది. 2014 మేలో మోదీ ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత ఇజ్రాయెల్‌తో వ్యూహాత్మక, గూఢచర్య సంబంధాల బలోపేతంపై దృష్టి సారించింది.
జిహాదీ ఉగ్రవాదం, సీమాంతర ఉగ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కోవడం లాంటి లక్ష్యాలు దీని వెనక ఉన్నాయి.
మోదీ పర్యటన ముగిశాక విన్యాసాల్లో పాల్గొననున్న ఐఏఎఫ్‌: జులైలో మోదీ ఇజ్రాయెల్‌ పర్యటన ముగిశాక ఆ దేశంలో నిర్వహించే వైమానిక పోరాట విన్యాసాల్లో భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) పాల్గొననుంది. ‘బ్లూ ఫ్లాగ్‌’ పేరుతో రెండు వారాలపాటు సాగే ఈ విన్యాసాల్లో అమెరికా, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్‌, పోలండ్‌, గ్రీస్‌ కూడా పాల్గొననున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com