తెలుగు విద్యార్థుల హవా గేట్‌ 2017 లో

- March 26, 2017 , by Maagulf
తెలుగు విద్యార్థుల హవా గేట్‌ 2017 లో

 గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌)-2017 ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. తొలుత ప్రకటించినదానికంటే ఓ రోజు ముందుగానే రూర్కీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ) ఈ ఫలితాలను విడుదల చేసింది. గత నెలలో గేట్‌ను నిర్వహించారు. స్కోర్‌ కార్డును మే 5లోగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఐఐటీ రూర్కీ తెలిపింది. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్‌, ఎంఈ కోర్సులతో పాటు నేరుగా పీహెచ్‌డీలో ప్రవేశానికి, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)ల్లో ఉద్యోగాల కోసం నిర్వహిస్తున్న గేట్‌లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి ముందంజలో నిలిచారు.
పలు సబ్జెక్టుల్లో 10 లోపు ర్యాంకులను సొంతం చేసుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌(ఈసీఈ)లో ఈసారి 1, 2, 4, 6, 9 ర్యాంకులు తెలుగు విద్యార్థులకే దక్కాయి. మొత్తం 23 ఇంజినీరింగ్‌ సబ్జెక్టుల్లో ఈ పరీక్ష నిర్వహించారు. కంప్యూటర్‌ సైన్స్‌, ఈసీఈ, ఈఈఈ లాంటి ఒక్కో సబ్జెక్టులో దేశవ్యాప్తంగా లక్ష మందికిపైగా విద్యార్థులు రాశారు. ఈఈఈలో 1,17,443 మంది హాజరయ్యారు. సాధారణంగా ఏటా పరీక్ష రాసిన వారిలో 15 శాతం మంది అర్హత సాధిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 1.25 లక్షల మంది హాజరయ్యారని అంచనా. వారిలో 15-20 వేల మంది ఉత్తీర్ణులై ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఐఈఎస్‌ అధికారినవుతా: సాయి ప్రమోద్‌రెడ్డి 
గేట్‌లో 50లోపు ర్యాంకు వస్తుందని భావించాను. కానీ, మొదటి ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. ఐఈఎస్‌ అధికారి కావడమే లక్ష్యం. ప్రభుత్వరంగ సంస్థలో ఉద్యోగంలో చేరతా. 2014లో మా అమ్మ చనిపోయింది. మా నాన్న, చెల్లెలు అందించిన ప్రోత్సాహంతోనే ఈ ర్యాంకు సాధించా.
డీఆర్‌డీఓలో చేరడమే లక్ష్యం: శ్రీకళ్యాణి 
గేట్‌ ఈసీఈ విభాగంలో ద్వితీయ ర్యాంకు వస్తుందని వూహించలేదు. ఇది మొదటి ప్రయత్నంలోనే రావడం చాలా సంతోషకరం. డీఆర్‌డీఓలో చేరతా. 2015లో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి గేట్‌ శిక్షణ తీసుకొని ఈ ర్యాంకు సొంతం చేసుకున్నా.
అమ్మానాన్నల ప్రోత్సాహ ఫలితమే: లిఖిత 
మాది పెద్దపల్లి. నాన్న ఎస్బీహెచ్‌లో మేనేజర్‌, అమ్మ గృహిణి. నాకో చెల్లి. చిన్న నాటి నుంచి నా అభిరుచిని గుర్తించి చదివించారు. ఆంధ్ర వర్సిటీలో గతేడాది బీటెక్‌ పూర్తి చేశా. గేట్‌లో 6వ ర్యాంకు వస్తుందని వూహించలేదు. మా అమ్మనాన్నల ప్రోత్సాహ ఫలితమే ఈ ర్యాంకు. ఐఐఎస్‌లో ఎంటెక్‌ పూర్తి చేస్తా.
ఐఐటీ బాంబే లక్ష్యంతో..: మేఘశ్యామ్‌ 
మాది జగిత్యాల జిల్లా మెట్‌పల్లి. నాన్న దుబాయ్‌ వెళ్లొచ్చి టైలర్‌ పని చేస్తున్నారు. అమ్మ బీడీ కార్మికురాలు. ఒక తమ్ముడు, చెల్లి. హైదరాబాద్‌లో బీటెక్‌ చేయగానే ఐఐటీ బాంబేలో సీటు సాధించాలని గేట్‌ రాశా. 3 వేల ర్యాంకుతో గుజరాత్‌ నిట్‌లో సీటు వచ్చింది. కానీ, బాంబేలోనే చదవాలనే పట్టుదల పెరిగింది. అనుకున్నట్లుగానే సీఎస్‌ఐటీలో 6వ ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా నేరుగా సీటు వస్తుంది.
ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీ పూర్వ విద్యార్థికి మొదటి ర్యాంకు 
కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీకి చెందిన ఇద్దరు పూర్వ విద్యార్థులు, ఇద్దరు ప్రస్తుత విద్యార్థులు ప్రతిభ చూపారు. మెకానికల్‌ విభాగంలో సుధీర్‌ అఖిలభారత స్థాయిలో మొదటి ర్యాంకు సాధించగా.. ఈసీఈలో ఆనంద్‌ 9వ ర్యాంకు సాధించాడు. సివిల్‌లో హరిప్రకాష్‌ 17.. మెకానికల్‌లో సర్పరాజ్‌ 80వ ర్యాంకు సాధించారు. ఆనంద్‌రెడ్డిది విశాఖ జిల్లా భీమిలి. పేద కుటుంబం నుంచి వచ్చిన ఈ విద్యార్థి గతేడాది ఇడుపులపాయలో కోర్సు పూర్తిచేసుకొని ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. సుధీర్‌కుమార్‌ది నెల్లూరు. నిరుపేద కుటుంబానికి చెందిన ఇతనూ సత్తా చాటాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com