హ్యాపీబర్త్‌డే: రామ్‌చరణ్‌

- March 26, 2017 , by Maagulf
హ్యాపీబర్త్‌డే: రామ్‌చరణ్‌

మెగా వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి.. స్టార్‌ హీరోగా ఎదిగిన నటుడు రామ్‌చరణ్‌. తొలి చిత్రం ‘చిరుత’తోనే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. రెండో చిత్రం ‘మగధీర’తో బాక్సాఫీసు వద్ద రికార్డు సృష్టించి.. తక్కువ కాలంలోనే నటుడిగా సత్తా చాటుకున్నారు. ఆయనంటే.. ‘మెరుపు’లాంటి డ్యాన్స్‌తో పాటు మెగాస్టార్‌ వారసత్వం గుర్తుకొస్తుంది. గాలి కన్నా వేగంగా ప్రయాణించే గుర్రాలు గుర్తుకొస్తాయి. చిరంజీవిని చూసిన కళ్లతోనే రామ్‌చరణ్‌ని చూస్తారు ప్రేక్షకులు. అందుకే ఆయనపై తొలి అడుగుల్లోనే మాస్‌ ముద్ర పడింది. ఒక పక్క మాస్‌ కథలతో అలరిస్తూ.. మరో పక్క కొత్త రకమైన ప్రయత్నాలు చేయడంపై మెగ్గుచూపుతున్నారు.
తొలి రెండు చిత్రాలకే నంది అవార్డులు అందుకున్నారు. ఇలా చిరంజీవి ఇమేజ్‌ను, అసంఖ్యాకమైన అభిమాన గణం అంచనాలను చరణ్‌ భుజంపై మోసుకొంటూ ప్రయాణం సాగిస్తున్నారు. సోమవారం ఆయన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు చెబుదాం.
బాల్యం గురించి చరణ్‌ మాటల్లో.. 
‘చిన్నప్పుడు వేసవికాలం నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. డాడీతో ఎక్కువ రోజులు గడిపే అవకాశం అప్పుడే వచ్చేది. వేసవిలో దాదాపుగా శీతల ప్రాంతాల్లో షూటింగ్‌ చేసేవారు. వూటీ, కొడైకెనాల్‌.. ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్లేవాళ్లం. లేదంటే విదేశాలకు వెళ్లేవాళ్లం. పగటిపూట డాడీ షూటింగ్‌లో ఉండేవారు. ఒక్కోసారి మేం కూడా ఆ ప్రదేశానికి వెళ్లేవాళ్లం. లేకపోతే మేం చుట్టుపక్కల ప్రాంతాలు తిరిగి వచ్చేవాళ్లం. సాయంత్రం షూటింగ్‌ ముగించుకొని వచ్చి మాతో ఆడేవారు. సినిమాల్లో ఉన్నప్పుడు నెలకు కనీసం నాలుగు రోజులైనా ఇంటిపట్టున ఉండేవారు. కనీసం ఫొన్‌లో అయినా మాట్లాడుతుండేవారు. నాన్న అంటే గౌరవం, భయం ఉండేది. ఇప్పుడు నాన్న మాకు చాలా దగ్గర, స్నేహితుడిలా ఉంటారు. తనతో అన్ని విషయాలు షేర్‌ చేసుకుంటా’ అన్నారు చరణ్‌.
2007లో చరణ్‌ సినీరంగ ప్రవేశం చేశారు. ‘చిరుత’లో తండ్రిని చంపిన వ్యక్తిపై పగ తీర్చుకునే కుమారుడిగా.. ప్రేమించిన అమ్మాయిని కాపాడుకునే యువకుడిగా కనిపించి మెప్పించారు. ఈ చిత్రంతో నటనపరంగా చరణ్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో నటించిన ‘మగధీర’ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ మైలురాయిలా నిలిచింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కాసులు కురిపించడమే కాదు చరణ్‌కు స్టార్‌ ఇమేజ్‌ను తెచ్చేసింది. 2010లో విడుదలైన ‘ఆరెంజ్‌’ చిత్రంలో ప్రేమికుడిగా కనిపించారు. ఇది పెద్దగా విజయం సాధించకపోయినా.. మంచి ప్రేమకథా చిత్రంగా నిలిచింది.
‘అవును.. ఉపాసనే ఎక్కువ ప్రేమిస్తుంది’ 
2012 జులై 14న చరణ్‌ తన స్నేహితురాలు ఉపాసనను మనువాడారు. తన కుటుంబ సభ్యులతో ఉపాసన బాగా కలిసిపోయిందని చరణ్‌ ఓ సందర్భంగా పేర్కొన్నారు. ‘చరణ్‌ ఉపాసనను ప్రేమించిన దానికంటే ఉపాసన చరణ్‌ను ఎక్కువ ప్రేమిస్తుందని అంటారు. నిజమేనా?’ అన్న ప్రశ్నకు.. ‘నిజమే.. ఓ స్నేహితురాలిగా తెలుసు. కానీ భార్యగా మా ఇంటికి వచ్చాక అంతలా కలిసిపోతుందని వూహించలేదు. తను కూడా పెద్ద కుటుంబం నుంచి వచ్చింది. మా ఇంట్లో అమ్మానాన్నతో స్నేహంగా మెలుగుతుంది. ముఖ్యంగా మా నాన్న గారికి బెస్ట్‌ ఫ్రెండ్‌. మా నాన్న గారితో మేం రెండు నిమిషాలు మాట్లాడటానికి ఆలోచిస్తాం. అలాంటిది ఉపాసన నేరుగా వెళ్లిపోయి.. ‘ఏం మామయ్య ఎలా ఉన్నావు’ అంటూ మాట్లాడేస్తుంది’ అని సతీమణిని ఉద్దేశించి చరణ్‌ చెప్పారు.
2012లో ‘రచ్చ’, 2013లో ‘నాయక్‌’, ‘తుఫాన్‌’, 2014లో ‘ఎవడు’, ‘గోవిందుడు అందరివాడేలే’, 2015లో ‘బ్రూస్‌లీ’ చిత్రాలతో చరణ్‌ సందడి చేశారు.
తమిళ రీమేక్‌గా వచ్చిన ‘ధృవ’ చిత్రం చరణ్‌ సినీ కెరీర్‌లో మరో విజయాన్ని అందించింది. పోలీసు అధికారిగా చరణ్‌ కనిపించిన తీరు, నటన అభిమానులతో పాటు సినీ ప్రముఖులను కూడా ఆకట్టుకుంది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్స్‌ను రాబట్టింది. ఈ చిత్రం కోసం బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ సలహాతో ఆయన శిక్షకుడు రాకేష్‌ ఉడియార్‌ మార్గదర్శంలో సిక్స్‌ప్యాక్‌ చేశారు. చరణ్‌ వసూళ్ల గురించి పెద్దగా ఆలోచించరు. ప్రేక్షకులని మెప్పించేందుకు ఏం చేయాలనే విషయాన్ని పరిగణలోకి తీసుకుని పనిచేస్తారు.
కథే ముఖ్యం.. 
‘నేనెప్పుడూ పెద్ద దర్శకుల చుట్టూ తిరగలేదు. ‘రచ్చ’ నుంచి చూసుకున్నా.. నేను కథను నమ్ముకొని సినిమాలు చేశాను. వినాయక్‌ సక్సెస్‌లోనే ఉన్నాడనుకోండి.. ఆయన సినిమా కూడా కథ నచ్చే చేశాను. నాకు కథే ముఖ్యం. ఏ దర్శకుడి కథ నచ్చితే ఆ దర్శకుడితో చేస్తా’ అని ఓ సందర్భంగా చరణ్‌ అన్నారు. ఇక ప్రస్తుతం రామ్‌చరణ్‌ సుకుమార్‌ దర్శకత్వంలో ఓ విభిన్న కథలో నటిస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో చిత్రం సాగుతుందట. ఇందులో చరణ్‌ వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా కనిపిస్తారని సమాచారం.
నిర్మాతగా.. 
చిరంజీవి చాలా సంవత్సరాలు గ్యాప్‌ తీసుకుని నటించిన చిత్రం ‘ఖైదీ నంబర్‌ 150’. ఇనాళ్లుగా నటుడుగా అలరించిన చరణ్‌ ఈ చిత్రంతో నిర్మాత అవతారం ఎత్తారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సంస్థను నిర్మించి ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం నిర్మాతగా ఆయనకు విజయాన్ని అందించింది.
చెర్రీ అనే పేరు ఎలా వచ్చిందంటే.. 
చరణ్‌ అక్కయ్య ముద్దుపేరు ముని, చెల్లి ముద్దుపేరు స్వీటీ. మరి తనకెందుకు ముద్దుపేరు పెట్టలేదని అడుగుతుండే వాడట. అందురూ చరణ్‌ అని పిలిచేవారట. దీంతో ఆయన ఫీల్‌ అవడంతో నాన్న చిరంజీవి చెర్రీ అని పిలిచేవారట. ఆ తర్వాత పెద్దయ్యాక.. ఇంటర్నెట్‌ కారణంగా అది పాపులర్‌ అయిపోయిందని చరణ్‌ తెలిపారు.
చరణ్‌ ఇష్టాయిష్టాలు.. అభిప్రాయాలు 
* గుర్రపుస్వారీ.. ఫామ్‌లో ఆరు గుర్రాల వరకూ ఇన్నాయి. ప్రతి ఆదివారం రైడింగ్‌ చేస్తారు. 
* ఇష్టమైన నటి శ్రీదేవి. 
* ఎక్కువగా యానిమల్‌, డిస్కవరీ ఛానెల్స్‌ చూస్తుంటారు. 
* రాజకీయాలపై ప్రత్యేకమైన ఆసక్తిలేదు. కానీ అవగాహన ఉండాలి కాబట్టి తెలుసుకుంటాను. 
* ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఫాలో అయ్యేది చాలా తక్కువ. 
* గాసిప్స్‌, రూమర్స్‌ అసలు పట్టించుకోను. వాటిని ఆపలేం కూడా. ఓ నటుడిగా ఉన్నప్పుడు ఇవన్నీ సాధారణమే. 
* మంచి కథ దొరికితే మల్టీ స్టారర్‌ కచ్చితంగా చేస్తా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com