స్వాగతం శ్రీ హేవళంబి నామ సంవత్సరానికి

- March 28, 2017 , by Maagulf
స్వాగతం శ్రీ హేవళంబి నామ సంవత్సరానికి

తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే తెలుగువారి తొలి పండుగ చెప్పగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది 'ఉగాది' పండుగ. ఉగాది నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఈరోజు కొత్త సంవత్సరంలో రాశిఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలసుకొని ఆనందించడం తెలుగువారి సాంప్రదాయం.
శాలివాహన చక్రవర్తి శాతకర్ణి పట్టాభిషిక్తుడైన రోజు అవడంతో ఈ ఉగాదికి అత్యంత ప్రాముఖ్యత ఏర్పడింది. "ఉగ" అనగా నక్షత్ర గమనం. నక్షత్రగమనానికి 'ఆది' 'ఉగాది' అని అంటారు. ఒక్క తెలుగు సాంప్రదాయంలోనే కాకుండా మరాఠీలు గుడి పడ్వాగా, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు పేరుతో, సిక్కులు వైశాఖీ గా ఈ ఉగాదిని వేరువేరు పేర్లతో ఆయా ప్రాంతాలలో జరుపుకుంటారు.
చైత్ర శుద్ధ పాడ్యమినాడు వచ్చే తెలుగువారి మొదటి పండుగ 'ఉగాది' ఇది వసంతకాలంలో వస్తుంది. ఈ పండుగ మనకు చైత్రమాసంలో మొదలవుతుంది కనుక ఆ రోజు నుంచి తెలుగు సంవత్సర మొదటి దినంగా పరిగణిస్తాం. వసంత లక్ష్మిని స్వాగతిస్తూ షడ్రుచులతో కూడిన ఉగాది ప్రసాదాన్ని పంచాంగానికి, దేవతలకు నైవేద్యం చేసి తమ భవిష్యత్ జీవితాలు ఆనందంగా సాగాలని కోరుతూ ఉగాది పచ్చడి తింటారు.
ఆయుర్వేద వైద్య పరంగా ఈ పచ్చడి వ్యాధినిరోధక శక్తిని కలిగిస్తుందంటారు. ఈరోజు ఉదయంవేళ కాని లేదా సాయంత్రం సమయాలలో కానీ పంచాంగ శ్రవణం చేస్తారు. ఉగాది పండుగరోజున అందరూ కలిసి పండితులను ఆహ్వానించి వారిని సన్మానించి పంచాంగ శ్రవణం చేయటం కూడా మన సాంప్రదాయం. పంచాంగ శ్రవణం అంటే అయిదు అంగాలని అర్ధం చెపుతారు. ఇందులో తిధి, వార, నక్షత్ర, యోగం, కరణం అని అయిదు అంగాలుంటాయి. వరుసగా ఇవి మానవునికి సంపద, ఆయుష్షు, పాప ప్రక్షాళన, వ్యాధి నివారణ, గంగాస్నాన పుణ్యఫలం వస్తాయని మన విశ్వాసం.
వసంత ఋతువు కూడా ఉగాదితోనే మొదలవుతుంది. అంతవరకూ బీడు పడి ఉన్న భూమి మొలకలు ఎత్తి పచ్చదనాన్ని సంతరించుకుంటుంది. అందుకే కొత్త జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటున్నాం. ఉగాది మనిషికి కొత్త ఆశలను చిగురింప చేస్తుంది. మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంపద కోరేవాడు తిధి విషయంలో జాగ్రత్త వహించాలి. దీర్ఘాయువు కోరేవారు వారం విషయంలో జాగ్రత్త వహించాలి. రోగాల నుంచి రక్షణ కోరేవారు యోగం విషయంలో శ్రద్ధ పెట్టాలి. ఇక చివరిగా పాపం నుండి విముక్తి కోరేవారు నక్షత్ర విషయంలో జాగ్రత్త వహించాలి. ఇలా మనకు సంబంధించిన అన్నిసమస్యలకు సందేహాలకు పరిష్కారంగా పంచాంగం ఉంటుంది కాబట్టి పంచాంగ శ్రవణం ద్వారా 'ఉగాది' ని ప్రారంభించడం అత్యంత శ్రేయస్కరం.
'శ్రీ దుర్ముఖి' నామ సంవత్సరం పూర్తి చేసుకుని ఈరోజు మన జీవితాలలోకి అడుగుపెడుతున్న 'శ్రీ హేవళంబి' నామ సంవత్సరం ప్రపంచంలోని తెలుగు వారందరికీ సకల శుభాలను కలిగించాలని కోరుకుంటూ మీ ఎపి హెరాల్డ్ ప్రపంచంలోని తెలుగు వారందరికీ 'ఉగాది' పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తోంది..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com