కులభూషణ్ జాదవ్ అనే భారతీయుడిపై పాక్ లో మరణ శిక్ష
- April 10, 2017
పా కిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. తప్పుడు విచారణతో, అడ్డగోలు పద్ధతిలో ఓ భారతీయుడికి మరణశిక్ష వేసింది. కులభూషణ్ జాదవ్(46) అనే భారతీయుడిపై గూఢచర్యం ఆరోపణలు మోపి మరణశిక్ష విధించింది. బలూచిస్థాన్, కరాచీల్లో గూఢచర్యం, విద్రోహచర్యలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సైనిక కోర్టు రహస్య విచారణ జరిపి ఉరిశిక్షను ఖరారు చేసింది. ఈ చర్యపై భారత్ మండిపడింది. తప్పుడు విచారణతో, పథకం ప్రకారం చేసిన హత్యగా భావించాల్సి వస్తుందని పేర్కొంది. ఫీల్డ్ జనరల్ కోర్టు మార్షల్(ఎఫ్‌జీసీఎం) పాకిస్థాన్ సైనిక చట్టం ప్రకారం విచారణ జరిపి, అన్ని అభియోగాలపై జాదవ్‌ను దోషిగా గుర్తించి, మరణశిక్ష విధించగా, అనంతరం పాక్ సైనికాధిపతి జనరల్ ఖమర్ జావేద్ బజ్వా ఆమోదించినట్లు సైనిక మీడియా విభాగం ఐఎస్పీఆర్ వెల్లడించింది. జాదవ్ భారత నావికాదళంలో కమాండర్‌గా పనిచేసినట్లు మేజిస్ట్రేట్ ముందు అంగీకరించారనీ, భారత గూఢచర్య సంస్థ ‘రా’ ప్రణాళిక మేరకు పాక్‌లో అస్థిర కార్యకలాపాల లక్ష్యంగా గూఢచర్యం, విద్రోహచర్యల సమన్వయం, నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించినట్లు ఆరోపించింది. బలూచిస్థాన్, కరాచీల్లో శాంతి పునరుద్ధరణ చర్యలకు ప్రతిబంధకం కలిగించే చర్యలకు పాల్పడినట్లు పేర్కొంది.
ఎవరీ జాదవ్..: ఇరాన్ నుంచి ప్రవేశించిన జాదవ్‌ను గత ఏడాది మార్చి 3న బలూచిస్థాన్ ప్రావిన్సులో తమ భదతా దళాలు అరెస్టు చేసినట్లు పాక్ తెలిపింది. అతను భారత నావికాదళంలో పనిచేస్తున్న అధికారి అని ఆరోపించింది. జాదవ్‌కు సంబంధించిన నేరాంగీకార వీడియోను విడుదల చేసింది. తమ దౌత్యాధికారి జాదవ్‌ను కలిసేందుకు అనుమతించాలని భారత్ డిమాండ్ చేయగా పాక్ తిరస్కరించింది. జాదవ్ అలియాస్ హుస్సేన్ ముబారక్ పటేల్‌కు చట్టబద్ధంగా న్యాయ సహాయాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించింది. అయితే.. జాదవ్ నావికా దళం నుంచి ముందస్తుగా పదవీ విరమణ చేశారనీ, ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత ఏడాది మార్చిలోనే ప్రకటించింది.
భారత్ మండిపాటు: పాకిస్థాన్ నిర్ణయంపై భారత్ తీవ్రంగా ప్రతిస్పందించింది. విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ దిల్లీలోని పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్‌ను పిలిపించి నోటీసు ఇచ్చారు. నమ్మదగిన ఆధారాలేవీ లేకుండానే తప్పుడు విచారణతో మరణశిక్ష విధించారని అందులో పేర్కొన్నారు. జాదవ్‌ను గత ఏడాది ఇరాన్ నుంచి అపహరించారనీ, ఆ తర్వాత పాక్‌లో అతని ఉనికిపై నమ్మదగిన వివరణ ఇవ్వలేదన్నారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం ఇస్లామాబాద్‌లోని తమ దౌత్యకార్యాలయం ద్వారా జాదవ్‌ను కలుసుకునేందుకు 13సార్లు యత్నించినా పాక్ అనుమతించలేదని పేర్కొన్నారు. విచారణకు సంబంధించి సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. చట్టంప్రకారం విధివిధానాలు పాటించకుండా భారత పౌరుడికి వేసిన శిక్షను అమలుచేస్తే, ఓ పథకం ప్రకారంచేసిన హత్యగా తమ ప్రభుత్వం, భారతీయులు భావించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
సంబంధాలపై దెబ్బ: పఠాన్‌కోట్, ఉరీ దాడుల అనంతరం దెబ్బతిన్న భారత్-పాక్ సంబంధాలు తాజా పరిణామాలతో మరింతగా క్షీణించినట్లు భావిస్తున్నారు. ఉరీ దాడుల అనంతరం భారత్ మెరుపు దాడులు సైతం చేపట్టింది. బుర్హాన్ వనీ మృతిపై పాక్ రెచ్చగొట్టే ప్రకటనలు చేయడంపై ఇరుదేశాల మధ్య మాటలయుద్ధం సైతం సాగింది. పాక్ తీసుకున్న తాజా చర్యతో ఇక్కడి జైళ్లలో ఉన్న పాక్ ఖైదీలను విడుదల చేయకూడదని భారత్ నిర్ణయించింది. వీరిని బుధవారం వదిలిపెట్టాల్సి ఉంది. పాక్ జైలులో మగ్గి మరణించిన సరబ్‌జిత్‌సింగ్ సోదరి దల్బీర్‌కౌర్ స్పందిస్తూ.. భారత ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని సంప్రదించాలనీ, జాదవ్ మరణశిక్షను అమలు చేయకుండా చూడాలని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









