తెలుగు సినిమాకు గర్వ కారణం--మెగాస్టార్

- April 16, 2017 , by Maagulf
తెలుగు సినిమాకు గర్వ కారణం--మెగాస్టార్

మన తెలుగు సినిమాకు జాతీయస్థాయిలో గుర్తింపు రావడమనేది గర్వంగా ఉందన్నారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌’ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించిన చిత్రం ‘శతమానం భవతి’. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ఇటీవల ఈ సినిమాను జాతీయ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. ‘గీతాంజలి’, ‘శంకరాభరణం’ చిత్రాల తర్వాత ఈ ఘనత సాధించిన తెలుగు సినిమా ‘శతమానం భవతి’. చక్కటి కుటుంబ కథతో, తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను.. బంధాలను తెలియజెప్పింది. ‘శతమానం భవతి’ని నిర్మించిన దిల్‌రాజును ‘అల్లు అకాడమీ ఆఫ్‌ ఆర్ట్స్‌’ సంస్థ తరఫున నిర్మాత అల్లు అరవింద్‌ సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ.. ‘దిల్‌రాజు, సతీష్‌ వేగేశ్న కృషితోనే చిత్రం పెద్ద విజయం సాధించింది. ఇలాంటి అరుదైన గౌరవాన్ని తెచ్చిపెట్టిన దిల్‌రాజుకి, దర్శకుడు సతీష్‌ వేగేశ్నకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అని అన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ.. ‘జీవితంలో ఎంతో సాధించిన సందర్భంలోనే మరెంతో కోల్పోయాను. ఆ బాధ ఎలాంటిదో నాకు చాలా దగ్గరగా ఉండే అరవింద్‌గారికి తెలుసు. ఈ అవార్డు కంటే 15 ఏళ్లుగా అరవింద్‌లాంటి మంచి వ్యక్తితో చేసిన స్నేహం గొప్పదిగా భావిస్తున్నాను. లైఫ్‌లో మనం అనుకున్న వాటిలో కొన్నింటిని సాధించినప్పుడు ఆనందం వేరుగా ఉంటుంది. ఆ కొన్నింటిలో ‘శతమానం భవతి’ ఒకటి. మా ప్రయత్నం సఫలమై జాతీయ అవార్డు రావడం ఆనందంగా ఉంది’ అన్నారు.
కార్యక్రమంలో కల్యాణ్‌రామ్‌, శర్వానంద్‌, నాని తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com