ఐసీసీకి 400 మిలియన్ ఆఫర్
- April 28, 2017
ఐసీసీలో అనూహ్యంగా ఒంటరైన భారత క్రికెట్ బోర్డు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 2014 బిగ్3 ఫార్ములా ప్రకారం ఐసీసీ నుంచి రూ. 3666 కోట్ల ఆదాయం పొందిన బీసీసీఐ, తాజా ఆర్థిక విధానంతో కేవలం రూ. 1865 కోట్లకు పరిమితం కానున్నది. ఐసీసీ చైర్మెన్ మరో 100 మిలియన్ డాలర్ల అధిక మొత్తం ఆఫర్ చేసినా.. తొలుత నుంచి ఉన్న ఆదాయన్నే కోరుకున్న భారత బోర్డు.. ఓటింగ్‌లో ఒంటరిగా మిగిలిపోయిన విషయం తెలిసిందే. తొమ్మిది సభ్య దేశాలు అనుకూలంగా ఓటు వేయగా, కేవలం భారత్ మాత్రమే వ్యతిరేక ఓటు వేసింది. రాజీకి అంగీకరించని నేపథ్యంలో అధికంగా ఆఫర్ చేసిన మరో రూ. 650 కోట్లు సైతం బీసీసీఐ కోల్పోయింది!. తాజా పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టింది. బీసీసీఐ ఏజిఎంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం దుబారు సమావేశంలో వ్యవహరించిన అమితాబ్ చౌదరి.. ప్రత్యేక సర్వ సభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. త్వరలో జరిగే ఈ భేటీలో బీసీసీఐ నిరసనను ఏ రూపంలో తెలియజేయాలనే విధానాన్ని ఖరారు చేయనున్నారు. ఐసీసీ నిబంధనల ప్రకారం జూన్ 1 నుంచి జరగాల్సిన చాంపియన్స్ ట్రోఫీకి ఏప్రిల్ 25నే జట్టును ప్రకటించాలి. కానీ భారత బోర్డు ఇంకా జట్టును ప్రకటించలేదు. ప్రపంచ క్రికెట్‌కు సుమారు 70 శాతం ఆదాయం కేవలం భారత మార్కెట్ నుంచే వస్తోంది. దీంతో ఏ విధంగా చూసినా ఐసీసీ మనుగడకు భారత్ అత్యంత కీలకం. ఐసీసీతో తీవ్రమైన విభేదాలకు తోడు ఓటింగ్‌లో అనూహ్యంగా ఒంటరైన బీసీసీఐ..చాంపియన్స్ ట్రోఫీని బహిష్కరించే అవకాశం ఉన్నది. నిరసన కేవలం చాంపియన్స్ ట్రోఫీ బహిష్కరణకు మాత్రమే పరిమితమా? మిగతా టోర్నీల్లోనూ కొనసాగుతుందా? అనేది ఎస్‌జిఎంలో తేల్చాల్సి ఉన్నది. పాలకుల ప్యానల్ చైర్మెన్ వినోద్ రారు ఈ చర్యలకు వ్యతిరేకమైనా, బీసీసీఐ సభ్యులు తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకించే అవకాశం లేనట్టే. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత క్రికెట్ ప్రయోజనాలు కాపాడుకునేందుకు బోర్డుకు మిగిలన అస్త్రం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ బహిష్కరణే అని చెప్పనక్కర్లేదు.
ఇప్పటికీ మనమే కీలకం
ఓటింగ్‌లో ఒంటరైనా ప్రపంచ క్రికెట్‌ను శాసించే శక్తి బీసీసీఐకి ఉంది. 2007 ప్రపంచ కప్ విషయానికి వస్తే ఆ ఐసీసీ ఈవెంట్‌లో భారత్ గ్రూప్ దశలోనే నిష్క్రమించటంతో ఐసీసీకి కనీవినీ ఎరుగని రీతిలో నష్టం వాటిల్లింది. భారత్ ఆరంభంలోనే నిష్క్రమించటంతో టెలివిజన్ రేటింగ్స్ అమాంతం పడిపోయాయి. పదేండ్ల క్రితమే సుమారు రూ. 2500 కోట్ల విలువైన బిజినెస్ దెబ్బతిన్నదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత స్థితిలోనూ భారత జట్టు లేని ఏ టోర్నీ కళావిహీనమే, కాసుల్లేని కార్యక్రమమే అవుతుంది. భారత్ తప్పుకుంటే మన ఖజానా ఖాళీ అయ్యే పరిస్థితి వస్తుందనే విషయం ఐసీసీకి తెలుసు. భారత్ అండతో ఐసీసీ పీఠం అధిష్టించి, భారత ప్రయోజనాలకే తిలోదకాలు ఇచ్చిన ఘనుడు శశాంక్ మనోహర్.. అన్ని దేశాలకు సమాన వాటా ఇవ్వటం న్యాయం అని చెబుతున్నాడు. అయితే ఇక్కడో విషయం గమనంలో ఉంచుకోవాలి. బీసీసీఐ ఇతర దేశాల ఆదాయం కోరుకోవటం లేదు. భారత్ నుంచే ఐసీసీకి మెజార్టీ భాగం ఆదాయం సమకూరుతున్నందున, తనకు అధిక వాటా తీసుకున్న హక్కు ఉందని అంటోంది. మన దగ్గర ఆదాయాన్ని దండుకొని, ఇతర దేశాలకు పంచిపెట్టడం ఏ విధంగా సమ న్యాయం అవుతుందో వృత్తిగతంగా న్యాయవాది అయిన మనోహరే చెప్పాలి!.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్‌పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్‌లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్‌లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్‌లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







