నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం
- May 13, 2017
దేవుడు అన్ని చోట్ల ఉండటం సాధ్యం కాక ..ప్రతి ఒక్కరి కోసం ' అమ్మ ' ను సృష్టించాడంట ! పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం 'అమ్మ' ఆమె చల్లని ఒడిలో మొదలైంది మన జీవనం !! ఈ 'జన్మ'మనసుకు మారు పేరు అమ్మ. బిడ్డ మనసెరిగి నడిపిస్తూ మనసు దోచేస్తుంది అమ్మ. ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగినా.. అమ్మ నుంచి నేర్చుకున్నదే...అమ్మ పై అంతస్తులో ఉంటుంది. జీవితాంతం ఏదో ఒక రూపంలో అమ్మ పాఠం ఉపయోగపడుతూనే ఉంటుంది. కనిపించే దైవం అమ్మ. ఆత్మీయతకు, అనురాగానికి, త్యాగానికి చిరునామా. అమ్మ అనే పిలుపులోనే తీయదనం ఉన్నది. తన కడుపు మాడ్చుకొని మరీ మన కడుపు నింపుతుంది. రెక్కలు ముక్కలు చేసుకొని మనల్ని పెంచి పెద్ద చేస్తుంది. బుడిబుడి అడుగుల నుంచే మన నడతను, ఆ తర్వాత భవితను నిర్దేశిస్తుంది. ఏ చిన్న తప్పు చేసినా కడుపులో దాచుకొని, కనికరిస్తుంది. కొడుకులు చెట్టంత ఎదిగి దూర తీరాలకేగినా, బిడ్డలు అత్తవారిళ్లకు వెళ్లినా ఆ తల్లి హృదయం వారి క్షేమం కోసమే పరితపిస్తూనే ఉంటుంది. కన్నపేగుకు ఏ చిన్న కష్టమొచ్చినా నిలువెల్లా తల్లడిల్లిపోతుంది. ఇలా తమ కోసం సర్వస్వం ధారపోసి, పెంచి పెద్ద చేసిన తల్లులను వారి జీవిత చరమాంకంలో కళ్లల్లో పెట్టుకొని కాపాడడం ప్రతి ఒక్కరి విద్యుక్త ధర్మం. సృష్టికి మూలం అమ్మ.. ఈ పదంలో అంతులేని అనురాగ ఆత్మీయతలు.. తన పేగును తెంచుకొని పుట్టిన బిడ్డలే తన ప్రాణంగా భావిస్తూ తాను ఓ కొవ్వొత్తిలా వెలిగిపోతూ కుటుంబానికి వెలుగునిచ్చే మమతల దీ పం. అమ్మ లేనిదే లోకం లేదు.. తన ప్రాణాలను ఫణంగా పెట్టి పెంచి పెద్దచేసి తనకు హాని చేసినా తన బిడ్డలు బాగుండాలని పరితపించేది అమ్మ మాత్రమే. ఆ అమ్మ ప్రత్యేకతను చాటే మదర్స్‌డే వేడుకలను ప్రతి ఏటా మే 2వ వారంలో నిర్వహిస్తారు. ఈ ఏడాది మే 14 వ తేదీ రెండవ ఆదివారం ప్రపంచవ్యాప్తంగా మాతృ దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. ఇదీ మాతృదినోత్సవ నేపథ్యం . . వివాహం జరిగినప్పటి నుంచి తన కలలకు ప్రతి రూపాలైన బిడ్డలకు జన్మనివ్వాలని, వారిని పెంచి పెద్దచేసి ప్రయోజకులుగా రూపొందించి ఈ సమాజానికి అందించాలని ప్రతి తల్లి ఆశ. తాను అవసరమైతే పస్తులుండి కూడా తన బిడ్డల కడుపులను నింపేందుకు రెక్కలను ముక్కలను చేసుకుంటుంది. తన బిడ్డలకు ఏమాత్రం ప్రమాదం దాపురించినా కాపాడుకునేందుకు తన ప్రాణాలను అడ్డుపెడుతుంది. అటువంటి తల్లి గొప్పతనాన్ని ప్రతి ఏటా జ్ఞప్తికి తెచ్చుకోవడానికి మాతృ దినోత్సవ వేడుకను నిర్వహిస్తారు. మన దేశంలో అమ్మా, నాన్నలను దైవాలుగా భావిస్తూ ఆదరించే సంప్రదాయం ఉన్నా పాశ్చాత్య దేశాలలో బిడ్డలు ఎదిగిన తర్వాత వారు తల్లిదండ్రులను వదిలిపెట్టి స్వతంత్రంగా జీవించడం మొదలు పెడతారు. తమకు జన్మనిచ్చిన అమ్మను రోజు చూసుకునే పరిస్థితులు వారికి లేకపోవడంతో కనీసం ఏడాదికి ఒక్కసారైనా తన తల్లిని చూసుకోవాలనే ఉద్దేశంతో ఒక్కరోజును అమ్మకోసం కేటాయించాలని ప్రపంచంలోని పలువురు బిడ్డలు భావించారు. ఏటా మే నెల రెండో ఆదివారం నిర్వహిస్తున్న ప్రపంచ మాతృదినోత్సవానికి సుదీర్ఘ చరిత్ర, నేపథ్యం ఉన్నాయి. గ్రీస్‌లో రియా అనే దేవతను మదర్ ఆఫ్ గాడ్స్‌గా భావించి ఏడాదికోసారి నివాళులర్పించేవారు. 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో తల్లులకు గౌరవంగా మదరింగ్ సండే పేరిట ఉత్సవాన్ని జరిపారు. జూలియవర్డ్ హోవే అనే మహిళ అమెరికాలో 1872లో తొలిసారిగా ప్రపంచ శాంతి కోసం మదర్స్‌డే నిర్వహించాలని ప్రతిపాదించింది. బోస్టన్‌లో ఇందు కోసం సమావేశాన్ని నిర్వహించింది. అన్న మేరీ జర్విస్ అనే మహిళ మదర్స్ ఫ్రెండ్‌షిప్ డే జరిపించేందుకు చాలా కృషి చేసింది.ఆమె 1905 మే 9న మృతి చెందగా, ఆమె కూతురు మిస్ జెర్విస్ మాతృదినోత్సవం కోసం విస్తృతంగా ప్రచారం చేసింది. ఇలా 1911 నాటికి అమెరికాలోని అన్ని రాష్ర్టాల్లో మాతృదినోత్సవం జరపడం మొదలైంది. ఫలితంగా 1914 నుంచి దీన్ని అధికారికంగా నిర్వహించాలని అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ నిర్ణయించాడు. కాలక్రమేణా ప్రపంచమంతా వ్యాపించింది. అప్పటి నుంచి ఏటా మే నెల రెండో ఆదివారం మాతృదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. అమెరికాలో ఈ విధానాన్ని మొట్టమొదట 1914లో అధ్యక్షునిగా ఉన్న ఉడ్రో విల్సన్ ఈ వేడుకలను నిర్వహించాలని ప్రతిపాదన చేశారు.ఆ తర్వాత అమెరికాతోపాటు యూరప్‌లోని అన్ని దేశాలకు ఈ మంచి సంప్రదాయం పాకింది. మన దేశంలోనూ కొన్నేళ్లుగా ఈ వేడుకలను గౌరవంగా జరుపుకుంటున్నారు. పల్లెటూళ్లలో బిడ్డలు తల్లిదండ్రుల వద్దే ఉంటూ రోజు మాతృ దినోత్సవ మాధుర్యాలను అనుభవిస్తుండగా పట్టణ ప్రాంత వాసులు బతుకుదెరువు, చదువు, ఉద్యోగాల పేర్లతో తల్లిదండ్రులకు దూరమవుతున్నారు. ఈ కారణంగా మాతృ దినోత్సవ వేడుకల ప్రాధాన్యత మన దేశంలోనూ ప్రత్యేకతను సంతరించుకునే స్థాయికి చేరింది.దాదాపు 10 ఏళ్ల నుంచి మన ప్రాంతాల లోనూ మాతృ దినోత్సవ వేడుకలను కొంత మంది తమ తల్లి చెంతకు చేరుకొని జరుపుకుంటున్నారు. తన రక్తం పంచుకొని పుట్టి న బిడ్డలు ప్రయోజకులైనప్పుడు ఆ తల్లి పొందే ఆనందం అంతా.. ఇంతా కాదు. తనకు కడుపునిండా అన్నం పెట్టకపోయినా తన పిల్లలు బాగుంటే చాలని భావిస్తుంది. అందుకే మాతృదినోత్సవ వేడుకల సందర్భంగా " మా గల్ఫ్ డాట్ కామ్ " తరుపున అమ్మలందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









