ఎవరెస్టు శిఖరంపై ఆంధ్రప్రదేశ్ తెలుగు తేజాలు
- May 13, 2017
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. 8848 మీటర్ల ఎత్తైన ఈ మంచుకొండ పైకి ఆరుగురు విద్యార్థులు శనివారం ఉదయం చేరుకున్నారు. ప్రస్తుత వసంత రుతువు పర్యటనకు సంబంధించి పర్వత శిఖరానికి చేరుకున్న తొలి వ్యక్తులు వీరే కావడం విశేషం. వీరంతా పేద కుటుంబాలకు చెందిన వారే. సాహస క్రీడల్లో యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే వీరికి ఎవరెస్ట్ శిఖరం ఎక్కేందుకు అవసరమైన శిక్షణ, ఆర్థిక సహాయాన్ని అందించింది. రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల విభాగం ఆధ్వర్యంలో 13 మంది, యువజన సంక్షేమ విభాగం తరఫున ఆరుగురు విద్యార్థులను ఎంపిక చేశారు. మొత్తం 19 మంది ఏప్రిల్ 8వ తేదీన విజయవాడ నుంచి బయలుదేరి కాఠ్మాండు మీదుగా ఏప్రిల్ 13న టిబెట్ రాజధాని లాసాకు చేరుకున్నారు. అక్కడి నుంచి వీరంతా మంచుకొండలపై ప్రయాణం ప్రారంభించి తొలుత 5,182 మీటర్ల ఎత్తులో ఉన్న బేస్ క్యాంప్‌నకు చేరుకున్నారు. వాతావరణం అనుకూలంగా ఉండడంతో అక్కడి నుంచి 6,492 మీటర్ల ఎత్తులో ఉన్న అడ్వాన్స్డ్ బేస్ క్యాంపు వరకూ 19 మంది కలిసే వెళ్లారు. అక్కడి నుంచి రెండు బృందాలుగా విద్యార్థులను విభజించారు.
తొలుత ఆరుగురిని ఒక బృందంగా ఎవరెస్ట్‌కు పంపించారు. వీరిలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు చెందిన వూయక కృష్ణారావు(శ్రీకాకుళం), కుంజా దుర్గారావు(తూర్పుగోదావరి), జి.సురేష్‌బాబు(కర్నూలు), యువజన సంక్షేమ విభాగం తరఫున వెళ్లిన సత్యారావు కారె(విశాఖపట్నం), సుందరాన నాగరాజు(విశాఖపట్నం), తమ్మినేని భరత్(కర్నూలు) ఉన్నారు. తొలుత ఉదయం 8.20 గంటల ప్రాంతంలో సుందరాన నాగరాజు శిఖరానికి చేరుకున్నారు. విశాఖపట్నానికి చెందిన ఆయన మారథాన్ పరుగుపందెం క్రీడాకారుడు కూడా.
ఆయన తల్లిదండ్రులు దినసరి కూలీలు కావడం గమనార్హం. 20 నిమిషాల తరువాత సత్యారావు వెళ్లారు. ఆయన తండ్రి మత్స్యకారుడు. చివరి వ్యక్తి 9.20 గంటలకు శిఖరంపైకి వెళ్లారు.
ఆరుగురు విద్యార్థులు ఒకేసారి ఎవరెస్ట్‌ను అధిరోహించడం ఇదే తొలిసారి. ఎవరెస్ట్‌ను ఎక్కేందుకు 45 రోజుల సమయం పడుతుందని, మన విద్యార్థులు కేవలం 30 రోజుల్లోనే అధిరోహించారని వీరికి శిక్షణ సమన్వయకర్తగా వ్యవహరించిన యు.రఘునాథ్‌రెడ్డి వెళ్లడించారు. చైనా కాలమానం ప్రకారం.. శనివారం ఉదయం 8.20గంటలకు ఈ ఆరుగురు విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరంపైకి చేరుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ట్రాన్స్‌సెండ్ అడ్వంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ పర్వతారోహకులు శేఖర్‌బాబు నేతృత్వంలో విద్యార్థులు ఎవరెస్ట్‌ను అధిరోహించారు. మిగతా 13మంది విద్యార్థులు ప్రస్తుతం అడ్వాన్స్డ్ బేస్‌క్యాంపులో ఉన్నారు.
దారి చూపిన హైదరాబాద్ సంస్థ: అడ్వాన్స్ బేస్ క్యాంపు నుంచి పర్వతాన్ని అధిరోహించేందుకు ముందుగా మార్గాన్ని వేయాల్సి ఉంటుంది. ఏటా ఎవరెస్టు ఉత్తరంవైపు నుంచి ‘చైనా-టిబెట్ మౌంటనీరింగ్ అసోసియేషన్’ ఈ దారిని వేసేది.
దారి ఎంపిక, తోవంటా తాళ్లను సిద్ధపరచడం, అత్యవసర పరిస్థితుల్లో త్వరగా కిందికి చేరుకునేలా ఏర్పాట్లు చేయడం వంటి బాధ్యతలుంటాయి. అయితే ఈ అవకాశం ఈ ఏడాది హైదరాబాద్‌కు చెందిన ట్రాన్సెండ్ అడ్వెంచర్ సంస్థకు దక్కింది.
తాజా వార్తలు
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్‌లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్‌లో డ్రైవర్‌కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్







