ఉత్తరకొరియా సరిహద్దుల్లో మరో క్షిపణి ప్రయోగం

- May 13, 2017 , by Maagulf
ఉత్తరకొరియా సరిహద్దుల్లో మరో క్షిపణి ప్రయోగం

కొరియా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరాయి. నేడు ఉత్తరకొరియా మరోసారి ఖండాంతర క్షిపణిని పరీక్షించింది. దక్షిణకొరియా అధ్యక్షుడిగా మూన్‌ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఈ పరీక్షను నిర్వహించడం గమనార్హం. కుసాంగ్‌ సమీపంలో ఈ క్షిపణి పరీక్షను నిర్వహించారు. కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన క్షిపణి జపాన్‌ సముద్రజలాల్లో కూలిపోవటం గమనార్హం. గత నెలలో నిర్వహించిన రెండు క్షిపణి పరీక్షలు విఫలం కావడంతో నేటి పరీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇది ఏ రకం క్షిపణో తెలియాల్సి ఉంది. దీనిపై జపాన్‌ రక్షణ మంత్రి స్పందిస్తూ.. ఉత్తరకొరియా తూర్పుతీరానికి 400 కిలోమీటర్ల దూరంలో ఈ క్షిపణి కూలిపోయిందని తెలిపారు. ఇది కొత్త శ్రేణికి చెందిన క్షిపణి అని ఆయన తెలిపారు.
దక్షిణకొరియా నూతన అధ్యక్షుడిపై ఒత్తిడి పెంచేందుకే ఈ చర్య తీసుకున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. మూన్‌ ఎన్నికల్లో ఉత్తరకొరియాతో సత్సంబంధాలు పెంచుకుంటానని ప్రచారం చేశారు. నేటి పరీక్షను ఆయన ఖండించారు. ఇదో రెచ్చగొట్టే చర్య అని అభివర్ణించారు. ఉత్తర కొరియాతో చర్చలు చేపట్టాలంటే దాని వైఖరిలో కచ్చితంగా మార్పు రావాలని ఆయన అన్నారు.
ఉత్తరకొరియా క్షిపణి పరీక్షను అమెరికా పశ్చిమ కమాండ్‌ తేలిగ్గా కొట్టిపారేసింది. ఈ క్షిపణికి అమెరికాను భూభాగాన్ని తాకేంత శక్తిలేదని పేర్కొంది. మరో పక్క ఉత్తరకొరియా మిత్ర దేశమైన చైనా ఈ పరీక్షపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com