నటుడు హీరో ఆర్ నారాయణమూర్తికి శ్రీశ్రీ పురస్కారం

- June 15, 2017 , by Maagulf
నటుడు హీరో  ఆర్ నారాయణమూర్తికి శ్రీశ్రీ పురస్కారం

అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే శోకాన మరుగున జేరి సుఖమున్నదిలే, కలకానిదీ విలువైనదీ బతుకు కన్నీటి ధారలలోనే’.. అన్న మహాకవి శ్రీశ్రీ రచన ఇచ్చిన స్ఫూర్తితోనే సినీరంగంలో ఇంతవరకు రాణించినట్లు సినీనటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. మహాకవి శ్రీశ్రీ వర్థంతి పురస్కరించుకుని ఎక్స్రే, టి.కృష్ణ మెమోరియల్ నాగార్జున పరిషత్ సంస్థల ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో నారాయణమూర్తిని శ్రీశ్రీ పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్రాసు పాండీబజార్లో సినిమా వేషాలు దొరక్క తిరిగి ఇంటికిపోలేక మానసికవ్యధలో ఉన్నప్పుడు శ్రీశ్రీ గీతం కలకానిదీ విన్నానని అది ఎంతో ధైర్యాన్నిచ్చినట్లు తెలిపారు. ఆ తరువాత సినీపరిశ్రమకు దాసరి తనను పరిచయం చేసినట్లు తెలిపారు. ‘­రు మనదిరా ఈ వాడ మనదిరా... దొర ఎందిరో వాడి పీకుడేందిరో’ అన్న పాట పాడి నృత్యం చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఎక్స్రే సంస్థ అధ్యక్షులు కొల్లూరి, నారాయణమూర్తి సామాన్య జీవితాన్ని వివరించారు.
కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు సుబ్బరాజు, దేవినేని కిషోర్, ఆదాయపన్నుశాఖ సంయుక్త కమిషనర్ సత్యానందం, ఆంజనేయరాజు, సురేష్బాబు, తదితరులు పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి తరపున ఆర్.రాజేష్ బృందం ఆలపించిన విప్లవగీతాలు, జానపద గీతాలు శ్రోతలను రంజింపజేశాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com