మన తెలుగు చిత్రంగా బాహుబలి 2

- June 15, 2017 , by Maagulf
మన తెలుగు  చిత్రంగా బాహుబలి 2

 

భారతీయ చలనచిత్ర చరిత్రలో చిరస్మరణీయమైన రికార్డులను సాధించిన, నేటికీ సాగిస్తున్న బాహుబలి 2 విడుదలై నేటికి 50 రోజులు. ఇలాంటి సినిమాను చూడటానికే నేను కలకన్నాను అని వెండితెర ఆనందిస్తోందంటూ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేసిన ప్రశంస నుంచి, హాలీవుడ్ ప్రముఖ హీరోలనుంచి కోట్లాది సగటు ప్రేక్షకులు బాహుబలి 2 ని ఇంకా తమ స్మతి పథంలో పదిలిపర్చుకుంటూనే ఉన్నారు.
సినిమాలు చూడటం ఎప్పుడో మానేసిన ముసలి తల్లులు సైతం బాహుబలి 2 కోసం  థియేటర్లకు వచ్చి మరీ చూసి ఇలాంటి సినిమా చూడటానికే ఇంకా బతికి ఉన్నామేమో అనిపించేంత ఉద్వేగాన్ని జన హృదయాల్లో ముద్రించిన అపరూప చిత్రం బాహుబలి 2. 
 రికార్డ్ కలెక్షన్లు సాధించి బిగెస్ట్ ఇండియన్ ఫిలింగా అవతరించిన బాహుబలి సంచలనాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో జాతీయ అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శితమైన ఈ సినిమాను మరో సుప్రసిద్ధ  ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించనున్నారు. ఈ నెల 22న ప్రారంభం కానున్న మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో బాహుబలి 2ను ప్రారంభ చిత్రంగా ప్రదర్శించనున్నారు.
 ఇటీవల జరిగి కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌తోపాటు రొమేనియా ఫిలిం ఫెస్టివల్ లోనూ బాహుబలి 2కు మంచి స్పందన వచ్చింది. రొమేనియా ఫిలిం ఫెస్టివల్లో అయితే తెలుగు వెర్షన్‌ను ఇంగ్లీష్ టైటిల్స్‌లో చూస్తూ జనం కొట్టిన కేరింతలు మర్చిపోలేము. మాస్కోలోనే బాహుబలికి అదే స్పందన వస్తుందని ఆశిస్తున్నారు. 
 తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలోనూ హైయ్యస్ట్ గ్రాస్ సాధించిన సినిమాగా రికార్డ్ సృష్టించిన బాహుబలి 2 ఇప్పటి వరకు 1650 కోట్లకు పైగా వసూలు చేసింది. త్వరలో చైనాతో పాటు మరికొన్ని దేశాల్లో రిలీజ్‌కి ప్లాన్ చేస్తుండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
 ఒక ప్రాంతీయ భాషా చిత్రం జాతీయముద్రను పొంది తెలుగు రాష్ట్రాలకంటే హిందీప్రాంతంలోనే కలెక్షన్ల వరదను సృష్టించిన చరిత్ర ఇప్పటికైతే బాహుబలి 2కే దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో గత 50 రోజుల్లో 198 కోట్లు సాధించిన బాహుబలి2 అనితర సాధ్యం అనిపించుకోగా, హిందీ వెర్షన్ నేటికి 510 కోట్ల రూపాయలతో సాగుతోంది. ఈరోజుకీ బాహుబలి2 ఉత్తరాదిలో రోజుకు కోటి రూపాయల కలెక్షన్ ఆర్జిస్తోందంటే నమ్మశక్యంగా లేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com