మత సామరస్యానికి ప్రతీక ఈదుల్‌ ఫితర్‌

- June 24, 2017 , by Maagulf
మత సామరస్యానికి ప్రతీక ఈదుల్‌ ఫితర్‌

ముందుగా..." మా గల్ఫ్ డాట్ కామ్ " పాఠకులకు ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు...ఈద్-ఉల్-ఫితర్ ఇది తరచుగా ఈద్ అని పిలవబడుతుంది. మూడురోజుల ముస్లిం సెలవుదినాలు, ఉపవాసం (సావ్మ్ ) యొక్క ఇస్లాం పుణ్య మాసం రామదన్ ముగింపుకు గుర్తుగా ఉంటాయి. ఈద్ అనేది ఒక అరబిక్ పదం, దీనర్థం "పండుగ" ఫితర్ అర్థం "ఉపవాసం యొక్క ముగింపు";రామదన్ మాసం మొత్తం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకూ ముఫ్హై రోజులు చేసిన ఉపవాసం యొక్క ముగింపును వేడుక చేసుకుంటారు. ఈద్ యొక్క మొదటిరోజు షావ్వల్ నెల మొదటిరోజున వస్తుంది. ఈద్ అన్న అరబిక్ పదానికి “పండుగ” అనీ, ఫితర్ అన్న అరబిక్ పదానికి “ఉపవాసం యొక్క ముగింపు” అని అర్థాలు. అందువలన ఈద్-ఉల్-ఫితర్ అంటే “ఉపవాసదీక్షకు ముగింపుగా చేసుకునే పండుగ”. వాడుకభాషలో “పెద్ద ఈద్”గా పిలువబడే ఈద్-అల్-అధాతో పోల్చి ఈద్-ఉల్-ఫితర్ ను కొన్నిసార్లు “చిన్న ఈద్”గా పిలుస్తారు. కానీ ఆగ్నేయ ఆసియా దేశాలలో, ఈద్-ఉల్-ఫితర్‌ లేదా రంజాన్ పండుగ ఈద్ అల్-అధా కన్నా ముఖ్యమని అక్కడి ముస్లిములచే భావించబడుతుంది. ఇస్లామ్ దైనందిని (క్యాలెండర్) ప్రకారం రంజాన్ నెల మొదటి రోజున (షవ్వాల్) సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు రోజూ పచ్చి మంచినీళ్ళయినా తాగకుండా ఉపవాసం ఉంటూ, రంజాన్ చివఱి రోజు దాకా రోజూ యిదే విధంగా కటిక ఉపవాసముండాలి. ఇస్లామ్ దైనందిని చాంద్రమానం ప్రకారం ఉండటం వలన గ్రెగోరియన్ దైనందిని ప్రకారం ఈద్-ఉల్-ఫితర్ ఒక్కోసారి ఒక్కో మాసంలో రావచ్చు. (తెలుగు సంప్రదాయ దైనందిని కూడా చాంద్రమానమే పాటిస్తుంది కానీ గ్రెగోరియన్ దైనందినికి సౌరమానం ప్రధానం.) జిబ్రీల్ (వారికి శాంతి కలుగు గాక) ద్వారా ప్రవక్తగా అవతరించిన మహమ్మద్ (వారికి అల్లాహ్ ప్రార్థనలు, శాంతి అందు గాక!) పవిత్రజ్ఞానాన్ని పొందినట్టు చెప్పబడింది. ఈ పవిత్ర జ్ఞానంలో, పద్యాల రూపంలో, అల్లాహ్ తన మనుషులు భూమిమీద ఎలా ప్రవర్తించాలన్న నియమావళి పొందుపఱచబడింది. ఈ గ్రంథమే పవిత్రమైన ఖురాన్‌గా ముస్లిముల అత్యంత పవిత్రమైన గ్రంథమయింది. ఈ జ్ఞానం మహమ్మద్ ప్రవక్త (వారికి అల్లాహ్ ప్రార్థనలు, శాంతి అందు గాక!) పొందిన కాలం రంజాన్ నెల కనుక ఈ మాసాన్నిపవిత్రమయిందిగా భావించి ఉపవాసం, క్రమం తప్పని ప్రార్థనలు, నిమయనిష్ఠలతో గడిపి పండుగ వేడుకతో ముగించాలని ప్రవక్త తన కుటుంబసభ్యులను, అనుచరులను కోరారు. ఆ పండుగే ఈద్-ఉల్-ఫితర్.ఈ పండుగ యొక్క పరమోద్దేశం శాంతిని ప్రోత్సహించడం, సోదరభావనను బలోపేతం చేయడం. నెల రోజుల పాటు నిష్ఠగా, భగవద్ధ్యానంలో గడిపాక సాధారణ జీవితానికి తిరిగివచ్చే క్రమంలో గత సంవత్సరకాలంలో మనస్సులో కలిగిన దురాలోచనలు, శత్రుత్వాలు మఱచిపోయి ఒకరినొకరు క్షమించుకోవాలని కూడా యీ పండుగ పరమార్థం. ఈద్ ప్రార్థనను అనుసరిస్తూ ఖుత్‌బా (మతచర్చ) ఉంటుంది. దేవుని క్షమ, దయ, శాంతి మరియు ఆశీర్వాదాలను ప్రపంచంలోని సకలజీవరాశి అందుకోవాలన్న స్ఫూర్తితో ప్రార్థన (దువా) జరుగుతుంది. ఖుత్‌బా ద్వారా ఈ నెలకి సంబంధించిన నియమనిష్ఠలు, ముస్లిం దైనందిన జీవనవిధులు, ప్రార్థనాక్రమం, రంజాన్ నెలలో తప్పనిసరిగా చేయవలసిన దానం (సదాకత్-ఉల్-ఫితర్) వంటి వాటి గుఱించి బోధించబడతాయి. పేదసాదలకు జకాత్ చెల్లించవలసిన మొత్తాన్ని ముస్లిమ్ మతపెద్దలు ఈద్ ప్రార్థన ముందు చెల్లిస్తారు. ఇస్లాం చట్టం ప్రకారం వార్షికాదాయంలో 2.5% జకాత్‌గా పేదలకు, అవసరంలో ఉన్నవారికి దానం చేయాలని శాసనం. కొందఱు ముస్లిములు పిల్లలకు, దగ్గఱి బంధువులకు ఈదిస్/ ఈదీ (ఈద్ బహుమతులు)కూడా యిస్తారు. ఈద్ ముందు రాత్రిని “చాంద్ రాత్” (చంద్రుని రాత్రి) అంటారు. రాత్రి తదియ చంద్రుడు కనిపిస్తేనే మఱునాడు ఈద్ ఉంటుంది కనుక దీనికి ఆ పేరు. ఈ దేశాల్లో ముస్లిములు ఈద్ కోసం కొనుగోళ్ళు చేస్తారు. ఆడవాళ్ళు సంప్రదాయ మెహెందీ లేదా గోరింటాకును చేతులకు, కాళ్ళకు పెట్టుకుని, రంగురంగుల గాజులతో ముస్తాబవడం సంప్రదాయం. చిన్నా పెద్దా అందఱూ కొత్త బట్టల్లో కళకళలాడుతూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని “ఈద్ ముబారక్” అంటూ మేల్తలపులు చెప్పుకోవడం రివాజు. పండుగ వంటలలో సెవయ్యా (సేమ్యా) ఉంటుంది. వేయించిన సేమియా, పాలు, ఎండుదార్క్షలు కలిపి రుచిగా వండే ఈ వంటకాన్ని సేవ్యా, షేవై, షెవయ్యా అంటారు. షీర్ కుర్మా కూడా ఈద్ పిండివంటల్లో భాగం. ఈద్ ప్రార్థనల తఱువాత కొందఱు చనిపోయిన తమ కుటుంబసభ్యులకు మోక్షం కలగాలని శ్మశానాలకు వెళ్ళి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.భారతదేశంలోని జమా మసీదు (కొత్త దిల్లీ), రెడ్ రోడ్ (కోల్‌కతా), చార్మినార్-మదినా-మక్కా మసీదు ప్రాంతం (హైదరాబాదు) రంజాన్ ప్రార్థనలకు ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. కొన్ని వేల మంది ముస్లిములు ఒక్క చోట చేరి రోజువారీ ఉపవాసదీక్షను ముగించి (ఇఫ్‌తార్) ప్రార్థించడం ఒక పవిత్రభావాన్ని కలిగిస్తూ ఆహ్లాదకరంగా ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com