రికార్డు స్థాయి లో జరగనున్న అమరావతి శంకుస్థాపన..!!
- October 20, 2015
ప్రపంచంలోనే అత్యాధునిక నగరంగా తీర్చిదిద్దాలని సంకల్పిస్తున్న అమరావతి శంకుస్థాపన ఉత్సవం .. మొదలు కాకముందే రికార్డుల మోత మోగిస్తోంది. ఆహ్వానితుల సంఖ్య , అంతర్జాతీయ ప్రాతినిధ్యం , రాజకీయ ప్రాముఖ్యం, చారిత్రక పునరుత్థానం వంటి అంశాలు.. ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్‌లో నమోదు చేయాల్సిన అంశంగా అధికార వర్గాలు భావిస్తున్నాయి. 4,07,994 మందికి ఆహ్వానాలు..... అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి అక్షరాలా నాలుగు లక్షల ఏడువేల తొమ్మిది వందల తొంభై నాలుగు మందికి ఆహ్వానాలు పంపించారు. ఇందులో రాజకీయ, అదికార, విభిన్న రంగాల ప్రతినిధుల సంఖ్యే నలభై వేలకు పైగా ఉంది. వీరంతా వీఐపీ, వీవీఐపీ, మోస్టు ఇంపార్టెంటు వ్యక్తుల కేటగిరిలో ఉన్నారు. ప్రధాని, ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు వీవీఐపీ విభాగంలో ఉండగా, రాష్ట్రమంత్రులు, ఎంపీలు, కేబినెట్ ర్యాంకు కలిగిన ఇతరులు, శాసనసభ్యులు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు వీఐపీ కేటగిరిలో ఉన్నారు. వాణిజ్య, పారిశ్రామిక ప్రముఖులకూ ఆహ్వానం అమరావతికి పెట్టుబడులు ఆకర్షించేందుకుగాను వాణిజ్య, పారిశ్రామిక ప్రముఖులను సైతం శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించారు. వీరి కోసం ఒక ప్రత్యేక విభాగాన్నే కొత్తగా సృష్టించారు. అదే మోస్టు ఇంపార్టెంటు కేటగిరి. టాటాలు, అంబానీలు, అదానీలతో పాటు స్థానికంగా తెలుగు రాష్ట్రాల్లోని వ్యాపార, వాణిజ్య ప్రముఖులకు సైతం ఇందులో చోటు కల్పించారు. శంకుస్థాపన మహోత్సవానికి రికార్డు స్థాయి ఆహ్వానాలు పంపిణీ సాధారణంగా బహిరంగ సభలు, సమావేశాలు జరిగినప్పుడు ప్రత్యేకంగా ఎవరికీ వ్యక్తిగత ఆహ్వానాలు ఉండవు. కానీ ఈ మహోత్సవానికి మాత్రం రికార్డు స్థాయి ఆహ్వానాలను అధికారికంగా రూపొందించి పంపిణీ చేశారు. అవి అతిధులకు కూడా చేరిపోయాయి. రాజధాని ప్రాంతానికి చెందిన స్థానికులందరికీ ప్రత్యేక అతిథులుగా పిలుపులివ్వడం మరో విశేషం. ఇక రాష్ట్రంలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ ఆహ్వానితుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఇంతపెద్ద ఎత్తున ఓ కార్యక్రమంలో పాల్గొననుండటం ఒక రికార్డే. ఆహ్వానితుల్లో కేంద్ర ప్రభుత్వానికి చెందిన వారు 1353 మంది దేశ,విదేశ ప్రముఖుల ఆహ్వానితుల చిట్టా కూడా అంకెల్లో అబ్బో అనిపిస్తోంది. కేంద్రప్రభుత్వానికి చెందిన 1353 మంది ఆహ్వానితుల్లో ఉన్నారు. విదేశీ ప్రముఖులు 245 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు 410 మంది, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖులు 658 మంది, కార్పొరేట్, వ్యాపార ప్రముఖులు 19,198మంది, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఒక వెయ్యీ డెబ్భైరెండు మంది, రాష్ట్రానికి చెందిన రాజకీయ ప్రముఖులు6550,రాష్ట్ర ప్రభుత్వంలోని అధికారులు 811 మంది, ప్రెస్ అండ్ మీడియాకు చెందిన 453 మంది ఆహ్వానితుల చిట్టాలో ఉన్నారు. ఇంతపెద్ద ఎత్తున ప్రముఖులకు పిలుపునంపడం తప్పనిసరిగా చరిత్రలో నమోదు చేయాల్సిన అంశమేననే భావన వ్యక్తమవుతోంది. 16వేల గ్రామాలు, పట్టణాల నుంచి మట్టి, నీరు అతిథుల జాబితాను పక్కన పెడితే .. ఈ కార్యక్రమానికి ఒక పవిత్రతను, ఉదాత్తతను ఆపాదించడానికి చేపట్టిన భావోద్వేగ ఘట్టం కూడా రికార్డు గానే నిలుస్తోంది. మన మట్టి మన నీరు పేరిట 16 వేల గ్రామాలు, పట్టణాల నుంచి నీరు , మట్టి శంకుస్థాపనకు సేకరించడం ఒక బృహత్తర కార్యంగా నిలుస్తోంది. ఈ రూపంలో 16 మెట్రిక్ టన్నుల మట్టి రాజధానికి చేరుకుంటోంది. రాష్ట్రంలోని 150 ప్రముఖ దేవాలయాలు, 50 మసీదులు, 50 చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించి ఆయా ప్రాంతాల్లోని మట్టిని కూడా తీసుకుని వస్తున్నారు. శృంగేరి పీఠం నుంచి శ్రీచక్రం శృంగేరీ పీఠం నుంచి శ్రీచక్రం తెప్పిస్తున్నారు. అలాగే అష్టాదశ శక్తి పీఠాల నుంచి కూడా పూజాద్రవ్యాలు, మృత్తిక తెప్పిస్తున్నారు. ఇవన్నీ కూడా కార్యక్రమానికి ఆధ్యాత్మిక పరిమళం అద్దే ప్రయత్నంలో భాగంగా ఉన్నాయి. ప్రజాభాగస్వామ్యం, స్వచ్ఛంద సేవా నిర్వహణ అంశాల్లో ఎంతమేరకు ప్రభుత్వం కృతకృత్యమవుతుందనే విషయంలో సందేహాలున్నప్పటికీ రాజధాని శంకుస్థాపన మాత్రం ఒక రికార్డు బ్రేక్ ఈవెంట్ గా నిలిచిపోతుందనే అబిప్రాయం సర్వత్రా వినవస్తోంది.
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







