ఆన్‌లైన్‌ లోనే కాదు డ్రోన్ల ద్వారా వస్తువులు డెలివరీ

- July 28, 2017 , by Maagulf
ఆన్‌లైన్‌ లోనే కాదు డ్రోన్ల ద్వారా వస్తువులు డెలివరీ

ఇప్పుడంతా డ్రోన్ల యుగం నడుస్తోంది. డ్రోన్ల ద్వారా వస్తువులు, ఆహార పదార్థాల డెలివరీలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో ఓ కంపెనీ డ్రోన్ల ద్వారా ఆహార పదార్థాలను ఇంటికి సరఫరా చేయడానికి శ్రీకారం చుట్టింది. అన్ని అనుమతులు లభిస్తే భారత్‌లో డ్రోన్ల ద్వారా డెలివరీ చేసే రెండో సంస్థగా ఇది అవతరించనుంది.
పలువురు యువకులు కలిసి నవాబుల నగరం లఖ్‌నవూలో ‘ఆన్‌లైన్‌కాకా’ అనే ఫుడ్‌ డెలివరీ సంస్థను నెలకొల్పారు. అయితే దాన్ని వారు కాస్త భిన్నంగా నడపాలనుకున్నారు. ఆర్డర్‌ చేసిన ఆహార పదార్థాలను డ్రోన్ల ద్వారా డెలివరీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం ఆ సంస్థలోని అహద్‌ అర్షద్‌(22), మొహమ్మద్‌ బిలాల్‌(23) గత ఏడాది కాలంగా డ్రోన్‌ ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు. డ్రోన్ల ద్వారా ఫుడ్‌ ఐటమ్స్‌ను డెలివరీ చేయడాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఇది విజయవంతం కావడంతో ఇప్పుడు ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై లఖ్‌నవూ కలెక్టర్‌కు లేఖ రాశారు.
‘లఖ్‌నవూలో ట్రాఫిక్‌ రోజురోజుకి పెరిగిపోతోంది. ఇలాంటి ప్రాంతాల్లో డ్రోన్లను వినియోగించుకుంటే ట్రాఫిక్‌ సమస్య పరిష్కారంతోపాటు, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించొచ్చు. అలాగే వినియోగదారులకు ఇప్పుడు అందిస్తున్న సమయంలో మూడో వంతు సమయంలోనే ఆహార పదార్థాలను చేరవేయగలుగుతాం’ అని కంపెనీ సోషల్‌మీడియా మేనేజర్‌ వివేక్‌ కుమార్‌ తెలిపారు.
అన్ని అనుమతులు లభిస్తే భారత్‌లో డ్రోన్‌ డెలివరీ చేయనున్న రెండోకంపెనీగా ఆన్‌లైన్‌కాకా నిలవనుంది. ఇప్పటికే ముంబయిలో పిజ్జా డెలివరీ చైన్‌ డ్రోన్‌ డెలివరీ అందిస్తోంది. ఆన్‌లైన్‌ కాకా ద్వారా డ్రోన్‌ డెలివరీ ఏవిధంగా అందిస్తామో తెలిపే ఓ వీడియోను ఆ సంస్థ తమ ఫేస్‌బుక్‌ ఖాతాలో పెట్టింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com