వెనిజులాలో ఎన్నికలకు వ్యతిరేకంగా ప్రజలు తీవ్ర నిరసనలు

- August 01, 2017 , by Maagulf
వెనిజులాలో ఎన్నికలకు వ్యతిరేకంగా ప్రజలు తీవ్ర నిరసనలు

-జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలను బహిష్కరించిన విపక్షాలు
-ఘనవిజయం సాధించినట్లు ప్రకటించుకున్న అధ్యక్షుడు మదురో 
ప్రతిపక్షాలకు మెజారిటీ ఉండే జాతీయ అసెంబ్లీలోని కాంగ్రెస్ సభను రద్దుచేయాలనే ఉద్దేశంతో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో నిర్వహించిన ఎన్నికలను విపక్షాలు బహిష్కరించాయి. ఆదివారం ఎన్నికలు నిర్వహించగా వెనిజులా అంతటా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. సోమవారం జరిగిన నిరసనల సందర్భంగా భద్రతాదళాల కాల్పుల్లో పదిమంది మృతి చెందారు. తీవ్రమైన అణచివేత కారణంగా గతనాలుగు నెలల్లో 120మంది నిరసనకారులు మృతిచెందారు. ఎన్నికల్లో 41.5శాతం ఓట్లతో విజయం సాధించినట్లు మదురో ప్రకటించుకున్నారు. కారకస్‌లో నిరసనకారులు ఆదివారం పోలింగ్ కేంద్రాలపై దాడులు చేశారు. వీధుల్లో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ నిరసన ప్రదర్శనలు, మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. పోలీసులు రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. రహదారులను మూసివేశారు. నిరసనకారులపై భద్రతాదళాలు కాల్పులు జరిపాయి. 
ఒక అభ్యర్థితోపాటు ఇద్దరు యువకులు మృతి చెందారు. ఏడుగురు పోలీసులు గాయపడ్డారు. ఎనిమిది లక్షలమంది ఓటర్లు ఎన్నికల్లో పాల్గొన్నారని జాతీయ ఎన్నికల సంఘం ప్రకటించింది. సోమవారం ఉదయం వేలమంది మద్దతుదారులతో నిర్వహించిన విజయోత్సవసభలో మదురో ప్రసంగించారు. తన 18ఏళ్ల రాజకీయ జీవితంలో ఇది అతిపెద్ద ఓటింగ్ విప్లవం అని ఆయన అభివర్ణించారు. కొత్త అసెంబ్లీ సభ్యుల్లో అధ్యక్షుడి భార్య సిలియా ఫ్లోర్స్, అనుచరుడు డయోస్డాడో కేబెల్లోతో పాటు మిత్రపక్షాలు విజయం సాధించాయి. అమెరికా, ఈయూతోపాటు దక్షిణ అమెరికా దేశాలైన బ్రెజిల్, కొలంబియా, అర్జెంటినా, మెక్సికో ఎన్నికలను ఖండించాయి. వెనిజులా ప్రతిపక్ష నేత హెన్రిక్ క్యాప్రిల్ ఎన్నికలను గుర్తించడంలేదని ప్రకటించారు. సోమవారం, బుధవారాల్లో నిరసనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. బుధవారం కొత్త సభ ఉనికిలోకి రానున్న నేపథ్యంలో మదురో నిరసనలను నిషేధించారు. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహిస్తే పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఉత్తర్వులు జారీచేశారు. వెనిజులాతో పాటు దక్షిణ అమెరికాలోని పలు నగరాల్లో నిరసనలు కొనసాగాయి. గతకొంతకాలంగా ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, తిరుగుబాట్లు, దోపిడీలతో వెనిజులా కొట్టుమిట్టాడుతున్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com