ఉషాపతి ఇకపై ఉప రాష్ట్రపతి.

- August 06, 2017 , by Maagulf
ఉషాపతి ఇకపై ఉప రాష్ట్రపతి.

తెలుగు వెలిగింది. తెలుగువారి కళ్లల్లో వెలుగు నిండింది. ఆ వెలుగుకి కారణం వెంకయ్యనాయుడు. ఇన్నాళ్లూ ఉషాపతిగా ఉన్న వెంకయ్య.. ఇకపై ఉప రాష్ట్రపతి. గెలుపు లాంఛనమే అని బరిలో దిగిన ఆయన.. వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. పల్లెటూరిలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వెంకయ్య... దేశ అత్యున్నత పదవుల్లో రెండోదైన ఉప రాష్ట్రపతిగా ఎన్నికకావడంతో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈనెల 11న ఆయన బాధ్యతలు చేపడతారు.

అనుకున్నదే జరిగింది. విజయం వరించింది. ముప్పవరకు వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఎన్డీయే తరఫున పోటీ చేసిన ఆయన ఘనవిజయం సాధించారు. ప్రతిపక్షాల అభ్యర్థి గోపాల కృష్ణ గాంధీపై 272 ఓట్ల మెజార్టీని సాధించారు. మొత్తం 785 ఓట్లకుగాను 771ఓట్లు పోలవ్వగా వెంకయ్యనాయుడికి 516 ఓట్లు వచ్చాయి. ప్రతిపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణకు 244 ఓట్లు వచ్చాయి. దీంతో వెంకయ్య గెలిచినట్టు గా ప్రకించారు. ప్రస్తుత ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ పదవీకాలం ఈ నెల 10తో ముగుస్తుంది. దీంతో 11న ఆయన భారతదేశానికి 15వ ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపడతారు.

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చవటపాళెంలో జూలై 1, 1949న సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు వెంకయ్య. చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో మేనమామ మస్తాన్‌నాయుడు ఆదరణలో శ్రీరామపురంలో పెరిగారు. అక్కడే పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం నెల్లూరు వెళ్లటానికి సుమారు 6 కి.మీలు నడిచి వెళ్లేవారు. నెల్లూరులో డిగ్రీ వరకు చదివిన ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1971 ఏప్రిల్‌ 14న ఉషమ్మను వివాహం చేసుకున్నారు.

సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన వెంకయ్య ప్రస్థానం ఎన్నో ఒదిడొడుకులను ఎదుర్కొంది. ముఖ్యంగా ఆయనకు ఆభరణం మాట. చక్కటి మాటలతో ఆయన ఎవరినైనా మంత్రముగ్దుల్ని చేయగలరు. ఏ అంశాన్నయినా విశ్లేషించగలరు. విద్యార్థి దశ నుంచి తనలో మొలకెత్తిన నాయకత్వ లక్షణాలను పొదివిపట్టుకున్న ఆయన అంచలంచెలుగా ఎదిగి దేశంలోనే రెండో అత్యున్నత పదవిని అందుకున్నారు. సమయస్ఫూర్తి, వాగ్ధాటి ఆయన సొంతం లౌక్యం, మాటకారితనం, కష్టపడి పనిచేసే తత్వం ఈ స్థాయికి తీసుకెళ్లాయి. 

విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో స్టూటెంట్ లీడర్‌గా మొదలైంది ఆయన ప్రస్థానం. జై ఆంధ్రా ఉద్యమంలో పాల్గొన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి జైలు శిక్ష అనుభవించారు. తొలిసారి1977లో జనతాపార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 1978లో ఇందిరా హవా ఉన్నప్పుడు ఉదయగిరి నుంచి మొదటిసారి గెలుపొందారు. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1988 నుంచి 93 వరకు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో మొదటిసారి కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆయన.. ఆ తర్వాత పార్టీ పార్లమెంటరీ కార్యరద్శిగా, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యర్శిగా వ్యవహరించారు. 2000-2002 మధ్య వాజ్ పేయి హయాంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా సేవలందించారు. 2002- 04 మధ్య రెండేళ్లపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కేంద్రపట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా సేవలందించారు. మూడుసార్లు కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైన వెంకయ్యనాయుడు.. గత ఏడాది రాజస్థాన్ నుంచి నాలుగోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com